Share News

ఒంటరిగా... దేశం చుట్టేశారు

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:43 AM

నాన్న కల... తన కూతుర్ని కూర్చోబెట్టుకుని బైక్‌పై భారత యాత్ర చేయాలని. కానీ అది నెరవేరకుండా ఆయన కాలం చేశారు. పదిహేడేళ్లకు ఆ కలను నిజం చేశారు నలభై ఏడేళ్ల జోస్ఫైన్‌ జోస్‌...

ఒంటరిగా...  దేశం చుట్టేశారు

అభిరుచి

నాన్న కల... తన కూతుర్ని కూర్చోబెట్టుకుని బైక్‌పై భారత యాత్ర చేయాలని. కానీ అది నెరవేరకుండా ఆయన కాలం చేశారు. పదిహేడేళ్లకు ఆ కలను నిజం చేశారు నలభై ఏడేళ్ల జోస్ఫైన్‌ జోస్‌. ఒంటరిగా డ్రైవ్‌ చేసుకొంటూ... డెబ్భై అయిదు రోజుల్లో... పద్ధెనిమిది రాష్ట్రాలు... నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు, సమస్యలు. ధైర్యం, నేర్పరితనంతో అన్నిటినీ అధిగమించి యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.

‘‘నా బాల్యంలో అత్యంత మధురమైన జ్ఞాపకం ఏంటో తెలుసా..! మా నాన్న జోస్‌ కవలక్కత్‌ టూ స్ర్టోక్‌ బజాజ్‌ సూపర్‌పై రైడింగ్‌ చేయడం. తను ‘మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసె్‌స’లో పని చేశారు. తరచూ నాన్నతో కలిసి స్కూటర్‌ మీద చిన్న చిన్న దూరాలు వెళుతుండేదాన్ని. ఎప్పుడూ చెబుతుండేవారు... ‘మనిద్దరం టూవీలర్‌పై దేశమంతా చుట్టి రావాలి’ అని. అయితే విధి మరోలా తలచింది. ఆ కల నెరవేరకుండానే నాన్న చనిపోయారు. ఎంతో బాధ పడ్డాను. ఒక కూతురుగా ఆయన ఆకాంక్షను ఎప్పటికైనా నెరవేర్చాలనుకున్నాను. కానీ జీవిత పోరాటంలో ఆశలు, ఆకాంక్షలు తెరమరుగయ్యాయి.

అమ్మ కోసం...

కేరళ రాష్ట్రం త్రిసూర్‌ మా స్వస్థలం. డిగ్రీ తరువాత సైకాలజీ చదివాను. ఆ సబ్జెక్టుపై ఉన్న మక్కువతో మరింత లోతుగా అధ్యయనం చేశాను. అదేసమయంలో ముంబయిలోని ఓ షేర్‌ మార్కెటింగ్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నేళ్లలో కంపెనీ కస్టమర్‌ సర్వీస్‌ ఇండియా హెడ్‌ అయ్యాను. ఉన్నత హోదా... అందుకు తగిన జీతం. ఆనందంగా సాగిపోతున్నాయి రోజులు. ఇంతలో అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆమెను చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరూ లేరు. దాంతో 19 నా ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని వదిలేసి కేరళ వచ్చేశాను.


77-Navya.jpg

ఒంటరిగా పయనం...

అప్పటికప్పుడు అనుకున్నా... కారులో ఒంటరిగా డ్రైవ్‌ చేసుకొంటూ దేశమంతా తిరిగేద్దామని. వెంటనే అత్యవసరమైనవన్నీ ప్యాక్‌ చేసుకున్నా. భద్రత కోసం మా కజిన్స్‌, స్నేహితులకు తెలిపాను. మా అమ్మ, అక్కలకు మాత్రం పీహెచ్‌డీలో భాగంగా డేటా సేకరించే పనిలో వెళుతున్నానని చెప్పాను. నిజం తెలిస్తే కచ్చితంగా వాళ్లు ఆపేస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక... వాయిదా పడితే నా మనసు మనసులో ఉండదు. గత ఏడాది అక్టోబరు నెల... రెండో తేదీ... నా కొత్త కారు గ్రాండ్‌ విటారాలో బయలుదేరాను... ఒక్కదాన్నే. ఆ క్షణం నా మనసు ఉప్పొంగింది. ఆనందంతో పరవళ్లు తొక్కింది. కారణం... మా నాన్న కల నెరవేరుస్తున్నందుకు. ఆయన చనిపోయిన పదిహేడేళ్ల తరువాత నాకు అవకాశం లభించింది. పక్కన లేరనే బాధే కానీ... పై నుంచి నాన్న నన్ను నడిపిస్తూనే ఉంటారని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఒంటరిగా ఇంతటి సాహసానికి పూనుకున్నాను. అయితే ఇన్ని రోజుల్లోనే పూర్తి చేయాలని పరిమితి పెట్టుకోలేదు.

75 రోజులు... 18 రాష్ట్రాలు...

నా ఈ ప్రయాణాన్ని చిరకాలం గుర్తిండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని అనుకున్నా. అందుకే దానికి ‘లాడ్లీ’ (ప్రియతమా) అని పేరు పెట్టుకున్నా. ఇంటి దగ్గర మొదలైన నా యాత్ర పద్ధెనిమిది రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 75 రోజులపాటు సాగింది. మొత్తం 14,277 కిలోమీటర్లు ప్రయాణించాను. విచిత్రం ఏంటంటే... ముందుగా రూట్‌ మ్యాప్‌ లాంటిదేమీ సిద్ధం చేసుకోలేదు. ఏ రోజుకారోజు నిర్ణయించుకొని వెళ్లిపోయేదాన్ని. లద్దాక్‌లోని 19 వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్‌ లా మార్గంలో కూడా ప్రయాణించాను. ప్రపంచంలోనే ఎత్తయిన వాహనం వెళ్లగలిగే రోడ్డుగా దీన్ని చెబుతారు. యాత్ర పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక గాలిలో తేలిపోతున్న అనుభూతి. నాన్న కల నెరవేర్చిన సంతృప్తి. అమ్మ అయితే విషయం తెలిసి నమ్మలేకపోయింది. తరువాత ‘మీ నాన్న ఉండుంటే నిన్ను చూసి గర్వపడేవారు’ అంటూ అభినందించింది.


సవాళ్లు ఎన్నో...

నా ప్రయాణం దేశంలోని మహానగరాలే కాదు... పల్లె ప్రాంతాలు, విసిరేసినట్టు ఉండే మారుమూల గ్రామాలు, కొండ అంచుల గుండా సాగింది. హోటళ్లు, హోమ్‌ స్టేలలో విశ్రాంతి తీసుకున్నాను. బయలుదేరేముందు ఒక్కటే నిర్ణయించుకున్నా... ఉదయం ఐదుకు ప్రారంభించాలి. సాయంత్రం ఐదు గంటలకల్లా ఆపేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి పడ్డాక డ్రైవ్‌ చేయకూడదనుకున్నా. అయినా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఒడిశాలో కొందరు దుండగులు బైక్‌లపై నన్ను వెంబడించారు. రోడ్డుపై యాక్సిడెంట్‌ జరిగినట్టు సృష్టించి, నా కారును ఆపే ప్రయత్నం చేశారు. ఎలాగో తప్పించుకొని దగ్గర్లోని ఓ గ్రామ కూడలికి వెళ్లాను. స్థానికుల సహాయంతో ఆ గండం నుంచి బయటపడ్డాను. గుజరాత్‌లో జరిగిన మరో సంఘటనలో ఓ ఆవును ఢీకొట్టబోయాను. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. హిమాలయాల్లోని రహదారుల్లో ట్రక్కు డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించారు. ఏంటని అడిగితే గొడవకు దిగారు. సమయస్ఫూర్తితో వాటన్నిటినీ దాటుకొని పర్యటన పూర్తి చేయగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది.

బ్రేక్‌తో కొత్త ఆలోచన...

ఇంటికి వచ్చాక పీహెచ్‌డీ మొదలుపెట్టాను. పరిశోధనలో భాగంగా వైవా ఇవ్వాలి. దాని కోసం తీవ్ర స్థాయిలో సన్నద్ధమవుతున్నా. కానీ ఆఖరి నిమిషంలో వైవా వాయిదా పడింది. ఏం చేయాలి? ప్రతి సంవత్సరం నాకంటూ ఒక కొత్త అనుభవం ఉండాలని కోరుకొంటా. ‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రోడ్‌ ట్రిప్‌ వేయాలని చాలాసార్లు అనుకున్నా. రకరకాల కారణావల్ల అది కుదరలేదు. అదీకాకుండా హాఠాత్తుగా అంత పెద్ద యాత్ర తలపెట్టడం సాహసమే అవుతుంది’... ఇలా నాలో నేనే మాట్లాడుకొంటున్నా. ఒక రోజు ఉదయం నిద్ర లేవగానే... అలా గుమ్మం బయటకు వెళ్లా. కళ్ల ముందు నా కారు కనిపించింది. అంతే... నా ఆలోచన మారిపోయింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 04:43 AM