పిల్లలకు ఈ పొడులు వద్దే వద్దు
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:26 AM
పిల్లలకు ఈ పొడులు వద్దే వద్దు పిల్లలకు పాలు కచ్చితంగా బలవర్థకమే! అయితే వాటిలో కలిపే మాల్ట్ ఆధారిత పొడులు ఆరోగ్యకరమైనవేనా? శక్తినిస్తాయనీ...
అప్రమత్తం
పిల్లలకు ఈ పొడులు వద్దే వద్దు పిల్లలకు పాలు కచ్చితంగా బలవర్థకమే! అయితే వాటిలో కలిపే మాల్ట్ ఆధారిత పొడులు ఆరోగ్యకరమైనవేనా? శక్తినిస్తాయనీ, వ్యాధినిరోధకశక్తికీ, ఎదుగుదలకూ దోహద పడతాయనీ ఆయా కంపెనీలు చేసుకుంటున్న ప్రచారం ఎంతవరకూ వాస్తవం? ఆకర్షణీయమైన ప్యాక్‌లు, డబ్బాలు, సీసాల్లో దొరికే ఈ పొడుల గురించి వైద్యులేమంటున్నారు?
రుచిగా, తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలు పేచీ పెట్టకుండా తాగుతారనే ఆలోచనతో తల్లులు పాలలో ఈ పొడులను కలిపి పిల్లలకు అందిస్తూ ఉంటారు. ఈ సంస్కృతి పిల్లలున్న ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీ.. ఇలా పలు రకాల రుచుల్లో దొరికే ఈ పొడులు ప్రధానంగా పాల పొడి, మాల్ట్, చక్కెరలు, డేట్ పౌడర్, కొకొనట్ పౌడర్, బెల్లం పొడులతో తయారవుతాయి.
‘మాల్టోడెక్ట్ర్సిన్’ ముప్పు
చక్కెర, బెల్లంతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం నీళ్లలో కరిగే తెల్లని పొడి (మాల్టోడెక్ట్ర్సిన్)ని ఈ పొడుల్లో కలుపుతారు. అలాగే కృత్రిమ రంగులు, రుచులు కూడా జోడిస్తూ ఉంటారు. నిజానికి వీటితో ఒరిగే పోషక ప్రయోజనాలు శూన్యం. అదనంగా వీటితో దుష్ప్రయోజనాలే ఎక్కువ. అవేంటంటే...
దంతాలు: ఈ పొడుల్లోని తీయదనం వల్ల పిల్లల దంతాలు పుచ్చిపోతాయి
పేగులు: కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాల వల్ల పేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది
వ్యసనం: తీపికి అలవాటు పడిపోయిన పిల్లలు అలాంటి పదార్థాల మీద యావను పెంచుకుంటారు
భావోద్వేగాలు: ఈ పొడులు కలిపిన పాలు తాగిన వెంటనే రక్తంలోని చక్కెరలో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు చోటుచేసుకుని, పిల్లలు అతి చురుగ్గా మారిపోతారు, తీపి అందనప్పుడు చికాకుకు లోనవుతారు
ఆరోగ్య సమస్యలు: తీపి తింటూ పెరిగే పిల్లల్లో స్థూలకాయం, పిసిఔస్, మధుమేహం మొదలైన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి
పక్కదారి పట్టించే చక్కెరలు
కొన్ని కంపెనీలు చక్కెరకు బదులుగా బెల్లం, తాటి బెల్లం, స్టివియా, మాంక్ ఫ్రూట్‌లను వాడుతున్నట్టు చెప్పుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి తీపి పదార్థం వాడినా, వీటి ద్వారా పిల్లలకు తీపినే అలవాటు చేస్తున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. నిజానికి పిల్లలకు ఐదారేళ్ల వయసు వచ్చేవరకూ తీపిని అలవాటు చేయకూడదు. చక్కెర కలపని పాలనే మొదటి నుంచి అలవాటు చేస్తే, ఎలాంటి పొడులు కలపవలసిన అవసరం లేకుండానే, పిల్లలు సాదా పాలనే ఇష్టంగా తాగుతారు. ఒకవేళ ఇప్పటికే తీపికి అలవాటు పడిన పిల్లలైతే, పాలల్లో బాదం, ఖర్జూరం పొడులను కలిపి అందిస్తూ, క్రమేపీ వాటిని కూడా తగ్గిస్తూ, సాదా పాలు తాగేలా పిల్లలను ప్రోత్సహించాలి. మరీ ముఖ్యంగా రెండేళ్ల వయసొచ్చేవరకూ పిల్లలకు చక్కెర, బెల్లం, ఖర్జూరం పొడులు, తేనె, కొబ్బరి చక్కెర లాంటి తీపి పదార్థాలు అలవాటు చేయకూడదు. వీటిని పదార్థాల పైన చల్లి అందించడం కూడా సరి కాదు. పిల్లలకు ఖర్జూరం తినిపించాలనుకుంటే, దాన్నొక పండుతో సమానంగా పరిగణించి, మిగతా పండ్ల మాదిరిగానే తినిపించాలి.
పొడుల ప్రత్యామ్నాయాలు
మింగడానికి బదులుగా నిమిలి తినే పదార్థాలే ఆరోగ్యకరమైనవి. ఈ పోషకాలను శరీరం సంపూర్తిగా శోషించుకోగలుగుతుంది. శరీరంలో అకస్మాత్తుగా చక్కెర హెచ్చుతగ్గులు కూడా చోటుచేసుకోవు. కాబట్టి పిల్లలకు ఈ పొడుల ద్వారా అందే విటమిన్లను పండ్లు, నట్స్ రూపంలో అందించవచ్చు. ఈ పదార్థాలతో దంతాలు కూడా నిక్షేపంగా ఉంటాయి. బడి ఈడు పిల్లలకు రోజుకు రెండుసార్లు పండ్లు, ప్రతి భోజనంలో కూరగాయలు, రోజుకోసారి నట్స్ తినిపించాలి. చిన్న పిల్లలకు నట్స్ నేరుగా ఇవ్వకుండా, పొడి చేసి లడ్లు రూపంలో తినిపించవచ్చు.
డాక్టర్ శివరంజని సంతోష్
సీనియర్ కన్సల్టెంట్,
పీడియాట్రిక్స్,
మాగ్నా సెంటర్స్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News