హలాయుధుడు... బలరాముడు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:38 AM
వైష్ణవ సంప్రదాయం ప్రకారం దశావతారాల్లో బలరామమూర్తి ఒకటి. శ్రీకృష్ణుని సోదరుడైన ఆయనను ‘బలభద్రుడు’ అని కూడా పిలుస్తారు. ఆయన ఆదిశేషుని అవతారం....
తెలుసుకుందాం
వైష్ణవ సంప్రదాయం ప్రకారం దశావతారాల్లో బలరామమూర్తి ఒకటి. శ్రీకృష్ణుని సోదరుడైన ఆయనను ‘బలభద్రుడు’ అని కూడా పిలుస్తారు. ఆయన ఆదిశేషుని అవతారం. కృష్ణునికన్నా పదినెలలు పెద్దవాడు. సాందీపని మహర్షి దగ్గర శ్రీకృష్ణునితో కలిసి వేదవిద్యను అభ్యసించాడు, అస్త్ర శస్త్ర ప్రావీణ్యం సంపాదించాడు. గదాయుద్ధంలో నిపుణుడు. శత్రువులను మర్దించడానికి నాగలి, రోకలి ధరించి ఉంటాడు. అందుకే ఆయనను ‘హలి, హలాయుధ, ముసలి, ముసలాయుధ, సీరపాణి’ అని పిలిచేవారు.
‘వైఖానస ఆగమం’ ప్రకారం... బలరామ ప్రతిమ మధ్యమ దశతాళమానాన్ని అనుసరించి 120 అంగుళాలకు మించకూడదు. కుడి చేతితో ముసలాన్ని (రోకలిని), ఎడమ చేతితో హలాన్ని (నాగలిని) ధరించి ఉండాలి. ఎర్రని వస్త్రాలతో, తెల్లని శరీరచాయతో, జటాముకుటాన్ని ధరించి ఉండే బలరామునికి ఎడమవైపున ఆయన దేవేరి రేవతి ఎర్రని మేని ఛాయతో, కుడిచేతితో కమలాన్ని ధరించి, ఎడమ చేతిని జారవిడిచి నిలబడి ఉండాలి. ‘బృహత్సంహిత’ ప్రకారం... బలరాముని కళ్ళు అర్ధ నిమీలితంగా ఉండాలి. రెండు, నాలుగు చేతులు ఉన్న మూర్తులను ‘అగ్నిపురాణం’ సూచించింది. రెండు చేతులు ఉంటే గదను, హలాన్ని, నాలుగు చేతులు ఉంటే కుడి పైచేతితో ముసలాన్ని, ఎడమ పై చేతితో హలాన్ని, కుడి క్రింది చేతిలో చక్రాన్ని, ఎడమ కింది చేతిలో శంఖాన్ని ధరించినట్టు చూపాలి. బలరామునికి కుడివైపున రేవతీదేవి పుష్పవస్త్రంలో, కుడి చేతితో పద్మాన్ని ధరించి, ఎడమచేతిని డోలాహస్తంగా కిందికి జారవిడిచినట్టు ఉండాలి. ‘హయశీర్ష సంహిత’ కూడా ఇవే లక్షణాలను చెప్పింది. ‘బృహత్సంహిత’ ప్రకారం... బలరాముడికి శ్రీకృష్ణుడికి మధ్య రెండు లేదా నాలుగు లేదా ఎనిమిది చేతులు ఉన్న దుర్గాదేవిని స్థానకమూర్తిగా చూపాలి. బలరాముణ్ణి స్వతంత్రంగా లేదా శ్రీకృష్ణుడితోనైనా, ఇతతర దేవతలతోనైనా కలిసి ప్రతిష్ఠించి పూజించవచ్చు.
బలరామక్షేత్రాలు
ప్రత్యేకంగా బలరాముడికి (బలభద్రుడికి) మన దేశంలో ఉన్న ఆలయాల్లో ప్రధానమైనవి ఒకటి జమ్మూలో, రెండోది బృందావనంలో ఉన్నాయి. జమ్మూలోని ధౌంతాలి (పంజ్‌తీర్థీ)లో సూర్యపుత్రి తవిషి నదీ తీరంలో ఉన్న ఆలయాన్ని జమ్మూ మహరాజు మహారాణా రణవీర్ సింగ్ కాలంలో నిర్మించారు. మధురలోని బృందావనం నుంచి బలరాముడు, మాతా రేవతీ దేవిల అరుదైన, మనోహరమైన విగ్రహాలను తీసుకువచ్చి ఆ ఆలయంలో ప్రతిష్ఠించారు. దాన్ని ‘దావు ఆలయం’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో 21 రోజుల పాటు రోజూ 21 చొప్పున ప్రదక్షిణలు చేసి, స్వామి వారి చరణాల దగ్గర వెండి నాగ నాగినీ జతను సమర్పిస్తే... కాలసర్ప దోషాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అలాగే రాఖీ పౌర్ణమి రోజున ఇక్కడి బలరాముడికి రాఖీ కడితే... వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయనే విశ్వాసం ఉంది. ఇక కేరళలోని త్రిసూర్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిపులం అనే గ్రామంలోని త్రికయ్యిల్ బలరామస్వామి ఆలయం అరుదైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. బలరాముణ్ణి పూజిస్తే వర్షాలు బాగా పడి, పంటలు చక్కగా పండుతాయని, ఆయనను ఆరాధించే చోట కరువు కాటకాలు ఉండవని పెద్దలు చెప్పారు.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest National News And Telugu News