బుద్ధుడిలా కావాలంటే...
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:41 AM
గురువుల స్పర్శతో అద్వితీయ అనుభూతిని, జ్ఞానోదయాన్ని పొందిన వారి కథలు కొన్ని చరిత్రలో కనిపిస్తాయి. వివేకానందుని ఛాతీ మీద శ్రీ రామకృష్ణ పరమహంస తన కాలిని మోపినప్పుడు...
సద్బోధ
గురువుల స్పర్శతో అద్వితీయ అనుభూతిని, జ్ఞానోదయాన్ని పొందిన వారి కథలు కొన్ని చరిత్రలో కనిపిస్తాయి. వివేకానందుని ఛాతీ మీద శ్రీ రామకృష్ణ పరమహంస తన కాలిని మోపినప్పుడు... వివేకానందుడికి సమాధి స్థితి అనుభవంలోకి వచ్చిన ఉదంతం ప్రసిద్ధమైనది. జెన్ గురువు మట్జూకు సంబంధించి కూడా అటువంటి కథ ఉంది. చైనాలో క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దంలో జీవించిన ప్రసిద్ధ జెన్ గురువు మట్జూ. అతను ‘హాంగ్ జౌ స్కూల్ ఆఫ్ చాన్’ వ్యవస్థాపకుడు. గౌతమబుద్ధుడికన్నా ఎక్కువమందికి జ్ఞానోదయం కలగడానికి దోహదం చేసినవాడిగానూ అతను పేరు పొందాడు.
మట్జూ గురించి, అతని ప్రవర్తన గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ప్రకారం... అతని ప్రవర్తన చాలా వింతగా ఉండేది. అందరిలా రెండు కాళ్ళ మీద కాకుండా... రెండు చేతులనూ కాళ్ళలా కిందికి దించి... జంతువుల మాదిరిగా నడిచేవాడు. అతను చాలా బలిష్టంగా ఉండడంతో... బలిసిన ఎద్దు నడుస్తున్నట్టు కనిపించేదట. అలాగే అతని కళ్ళు పులి కళ్ళ మాదిరిగా... అగ్ని గోళాల్లా ఉండేవి. చాలా ధైర్యం ఉన్నవారు మాత్రమే శిష్యులుగా అతని దగ్గర ఉండగలిగేవాళ్ళు. మట్జూ శిక్షణ ఇచ్చే తీరు సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఉండేది. ‘‘బ్రహ్మ ముహూర్తంలో లేవండి. ప్రాణాయామం చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ధ్యానం చేయండి’’ అని శిష్యులకు అతను ఎప్పుడూ చెప్పేవాడు కాదు. శిష్యుల మనోస్థితులను గమనించి... ఎప్పటికప్పుడు కొత్త విధానాల్లో, ఒక్కొక్కొక్కరికీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో శిక్షణ ఇచ్చేవాడు. అతను ఎప్పుడు, ఎవరితో, ఎలా ప్రవర్తిస్తాడో అంచనా వేయడం సాధ్యమయ్యేది కాదు. కొందరిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మృదువుగా మాట్లాడేవాడు. మరికొందరిని చీవాట్లు పెట్టేవాడు. మరికొందరిని చూసీచూడనట్టు వ్యవహరించేవాడు. అయితే అతని ప్రతి చర్య వెనుకా శిష్యుల పట్ల అపారమైన దయ, కరుణ, ప్రేమ ఉండేవి.
ఒకసారి మట్జూ బుద్ధుని విగ్రహం ముందు కూర్చొని ఉన్నాడు. ప్రఖ్యాతి చెందిన ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యుడైన, గొప్ప వేదాంతిగా పేరుపొందిన వ్యక్తి ఒకరు అతనితో చర్చించడానికి వచ్చాడు. ‘‘మహాశయా! జ్ఞానం కలగాలంటే ఏం చెయ్యాలి? నేను మీలా, గౌతమబుద్ధుడిలా కావాలంటే ఏ సాధన చేయాలి? ఎంతకాలం చేయాలి?’’ అని చాలా వినయంగా ప్రశ్నించాడు. అప్పుడు మట్జూ ‘‘మీ ఆశయం చాలా ఉన్నతమైనది. మీరు చర్చించదలచిన విషయం ఎంతో గంభీరమైనది. అంత గొప్ప విషయాన్ని మాట్లాడుకోడానికి ముందు... గౌతమబుద్ధునికి గౌరవ సూచకంగా ఆయన విగ్రహం ముందు వంగి నమస్కరించండి, ప్రార్థించండి’’ అన్నాడు. ఆ ఆచార్యుడు బుద్ధుని విగ్రహం ముందు వంగి, కళ్ళు మూసుకొని నమస్కరించాడు. అతని వెనుక నుంచి తన కాలితో ఒక తన్ను తన్నాడు మట్జూ. ఆ ఆచార్యునిలో ఆలోచనల పరంపర ఒక్కసారిగా ఆగిపోయింది. ఆకస్మికంగా సమాధిస్థితి అనుభవంలోకి వచ్చింది. కొద్దిసేపటికి సాధారణ స్థితికి వచ్చిన ఆ ఆచార్యుడు గట్టిగా నవ్వుతూ ‘‘అద్భుతం! ఒక్క క్షణంలో సమాధి అనుభవాన్ని కలిగించిన మీ నైపుణ్యం, కరుణ వర్ణించడానికి నాకు తెలిసిన భాష సరిపోదు’’ అన్నాడు. మరుక్షణమే కన్నీరు కారుస్తూ... మట్జూకు నమస్కరించి వెళ్ళిపోయాడు.
రాచమడుగు శ్రీనివాసులు
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest National News And Telugu News