అంతరంగ శత్రు సంహారం
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:51 AM
విజయదశమి... ధర్మానికి, సత్యానికి లభించిన మహోన్నత విజయానికి ప్రతీక. రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు సంహరించిన దివ్య ఘట్టం...
హరేకృష్ణ
విజయదశమి... ధర్మానికి, సత్యానికి లభించిన మహోన్నత విజయానికి ప్రతీక. రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు సంహరించిన దివ్య ఘట్టం, పాండవులు తమ ఆయుధాలను శమీ వృక్షం నుంచి తిరిగి తీసుకొని ధరించిన సందర్భం నిత్య నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాయి.
పది తలలు ఉన్న రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించిన పర్వదినమే ‘దసరా’ లేదా ‘విజయదశమి’గా ప్రసిద్ధిచెందింది. రావణుడికి అపారమైన తపోబలం, భౌతిక సంపద ఉన్నప్పటికీ ధర్మాన్ని విస్మరించాడు. సీతాదేవిని అపహరించిన లోకకంటకుడిగా మారాడు. అందుకే సర్వస్వాన్ని కోల్పోయి వినాశనాన్ని పొందాడు. ధర్మం ముందు ఎంతటి భౌతిక శక్తినైనా కాలం తుడిచి పెట్టేస్తుందనే సందేశాన్ని ఈ ఘట్టం ద్వారా రాముడు జగత్తుకు అందించాడు. అందుకే... అధర్మంపై ధర్మం సాధించిన శాశ్వత విజయానికి ప్రతీకగా విజయదశమి భాసిస్తోంది. అలాగే... ‘యతో ధర్మ స్తతో జయః’ అని మహాభారతం ప్రబోధించింది. ఎక్కడ ధర్మం ఉంటుందో విజయం కూడా అక్కడే నిలుస్తుందని దీని అర్థం. పాండవులు తమ పన్నెండేళ్ళ వనవాసాన్ని, ఒక ఏడాది అజ్ఞాత వాసాన్ని ముగించుకొని... శమీ వృక్షం (జమ్మి చెట్టు) మీద దాచి ఉంచిన తమ దివ్యాయుధాలను తిరిగి చేతపట్టి, కౌరవులపై విజయం సాధించారు. నేటి సమాజంలో వృత్తిదారులు, విద్యార్థులు తమ వృత్తి నైపుణ్యాలకు భగవద్భక్తిని జోడించి, పనిముట్లను పూజించి (ఆయుధపూజ), తమ కర్తవ్య నిర్వహణను యజ్ఞంలాంటి భావనతో చేయాలి. భగవంతుడి అనుగ్రహంతో కూడిన సాధన మాత్రమే మానవుడికి నిజమైన ఆధ్యాత్మిక బలాన్ని, విజయాన్ని ప్రసాదిస్తుంది.
నరకానికి మూడు ద్వారాలు
‘కామ, క్రోధ, లోభాలు నరకానికి మూడు ద్వారాలు’ అని ‘త్రివిధమ్ నరకస్యేదం ద్వారం...’ అనే గీతా శ్లోకంలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. దానికి ఆచార్య శ్రీల ప్రభుపాద ‘‘ఈ అంతరంగ శత్రువులను హరినామ సంకీర్తనం, భక్తి యోగం అనే అగ్నిలో భస్మం చేయడం ద్వారా మాత్రమే జీవుడు పవిత్రతను సాధించగలడు. రావణుడు కేవలం బాహ్యమైన రాక్షసుడు మాత్రమే కాదు, మన హృదయాలలో దాగి ఉన్న కామ, క్రోధ, లోభాలనే అనర్థాలకు ప్రతీక. కాబట్టి బాహ్యంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం కాదు, భక్తి సాధన ద్వారా మనస్సులోని అసురీ ప్రవృత్తులను దహించడమే నిజమైన దుష్టశిక్షణ’’ అని చెప్పారు. నేటి వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో యువత తీవ్రమైన మానసిక ఒత్తిడి, పోటీతత్వం, సోషల్ మీడియా వ్యామోహం, ఏకాకితనాలతో నలిగిపోతున్నారు. విజయదశమి పర్వదినం యువతకు వారి అంతరంగంలోని చంచలమైన కోరికలను, అనర్థాలను జయించే ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. భగవద్గీత, శాస్త్రాల మార్గదర్శనంలో ధర్మబద్ధమైన క్రమశిక్షణను అలవరచుకోవడం ద్వారా సోషల్ మీడియా వ్యామోహాల నుంచి యువత బయటపడవచ్చు. భగవత్ సేవా దృక్పథంతో తమ శక్తులను సమాజ శ్రేయస్సుకు వినియోగించినప్పుడు మాత్రమే యువత ఆదర్శవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలరు.
ఈ విజయదశమి శుభ సందర్భంలో ప్రతి వ్యక్తి, ప్రతి సాధకుడు తమ హృదయంలోని కామక్రోధాధి శత్రువులను జయిస్తానని సంకల్పించాలి. నిత్యం హరినామాన్ని జపిస్తూ, శ్రీరామచంద్రుడి దివ్యలీలలను స్మరిస్తూ, దర్మబద్ధమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడమే జీవితానికి నిజమైన సాఫల్యం. శ్రీరాముని అడుగుజాడల్లో నడుస్తూ... అంతరంగ విజయాన్ని సాధించడమే విజయదశమి మనకు అందిస్తున్న అత్యున్నతమైన సందేశం.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్మెంట్,
హైదరాబాద్, 9396956984
Also Read:
సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
జంతర్ మంతర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు