వరాహ రూపం... మత్స్య నైవేద్యం
ABN , Publish Date - Jun 12 , 2026 | 03:27 AM
వారాహీ దేవి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పూర్వం ఆ దేవత పేరు కేవలం తంత్ర సాధకులకు మాత్రమే సుపరిచితంగా ఉండేది. కాగా.. కొన్నేళ్ళ నుంచి వివిధ...
ఆలయదర్శనం
వారాహీ దేవి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పూర్వం ఆ దేవత పేరు కేవలం తంత్ర సాధకులకు మాత్రమే సుపరిచితంగా ఉండేది. కాగా.. కొన్నేళ్ళ నుంచి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వారాహీ దేవికి ప్రాచుర్యం బాగా పెరిగింది. అయితే దాదాపు పన్నెండు వందల ఏళ్ళకు పైగా ఆరాధనలు అందుకుంటున్న వారాహీ ఆలయం ఒకటి ఒడిశాలో ఉంది.
పూర్వం అంధకాసురుణ్ణి సంహరించడానికి దేవతల ద్వారా ఏడు శక్తులు ఉద్భవించాయి. ఆ శక్తులను ‘సప్త మాతృకలు’ అంటారు. వారిని ఉగ్ర శక్తులుగా భావిస్తారు. ఆ ఏడు శక్తులలో వారాహీ దేవి ఒకరు. యజ్ఞ వరాహమూర్తికి చెందిన శక్తిగా ఆమెను పూజిస్తారు. వరాహ ముఖం కలిగిన వారాహీని ఆహార ప్రదాతగా పరిగణిస్తారు. వివిధ ఆలయాల్లో కుడ్య చిత్రాలుగానో, ఉపాలయాల్లోనో కనిపించే సప్తమాతృకలకు ప్రత్యేకంగా ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒడిశాలోని పూరీ జిల్లా చౌరాసి గ్రామంలోని వారాహీ దేవాలయం వాటిలో ఒకటి. అంతేకాదు... నిర్మాణ శైలిలోనూ ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. క్రీస్తుశకం పదో శతాబ్దంలో.... ఒడిశాకు ప్రత్యేకమైన ‘ఖఖర శైలి’లో దీని నిర్మాణం జరిగింది. ప్రధాన ఆలయంలో ఆకర్షణీయమైన శిల్పాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉంది. గర్భ గుడిలో అమ్మవారి విగ్రహం వరాహ ముఖంతో, పెద్ద ఉదరంతో, ఒక చేతిలో చేపను, మరో చేత్తో పాత్రను పట్టుకొని దర్శనమిస్తుంది. కాబట్టి ఆమెను ‘మత్స్య వారాహీ’ అని కూడా పిలుస్తారు. అమ్మవారికి చేపలను నైవేద్యంగా సమర్పించే ప్రత్యేకమైన ఆచారం ఇక్కడ ఉంది. తాంత్రిక విద్యలకు కూడా ఇది ప్రసిద్ధ క్షేత్రం అని స్థానికులు చెబుతారు.
ఎలా వెళ్ళాలి?: ఒడిశాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కోణార్క్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పూరీ లేదా భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News