Anjali Sarvani Cricket Journey: చిరుత వేగం చెదరని సంకల్పం
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:28 AM
Unbroken Determination at Lightning Speed Anjali Sarvanis Inspiring Journey to Cricket Leadership
స్ఫూర్తి
తెల్లారితే అంతర్జాతీయ మ్యాచ్. దేశం తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన తరుణంలో విధి ఆడిన వింత నాటకం ఆమెను ఆసుపత్రి పాలు చేసింది. కానీ, శస్త్రచికిత్సల తాలూకు నొప్పుల కంటే... దేశం కోసం ఆడాలన్న తపనే ఆమెను మైదానంలోకి మళ్లీ నడిపించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సత్తా చాటి ఇప్పుడు ఆంధ్ర సీనియర్ జట్టుకు సారథిగా ఎంపికైన కర్నూలు జిల్లా ఆదోని ముద్దుబిడ్డ, ఆంధ్ర సీనియర్ మహిళల జట్టు కెప్టెన్ అంజలి శర్వాణి ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. ఆ అద్భుత ప్రస్థానం ఆమె మాటల్లోనే..
మా నాన్న కె.రమణారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ అనురాధ. నా ప్రయాణం క్రికెట్‌తో కాదు.. పరుగుతో మొదలైంది. 8వ తరగతి వరకు నేను ట్రాక్ మీదే ఉన్నాను. 100, 200 మీటర్ల పరుగులో పతకం రాకుండా ఇంటికి వెళ్లేదాన్ని కాదు. మిల్టన్ గ్రామర్ స్కూల్ పీఈటీ వెంకటేశ్ సార్ శిక్షణలో నేషనల్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని హరిద్వార్‌లో మెరిశాను. భారత్‌కు స్వర్ణం తేవాలన్నదే అప్పటి నా సంకల్పం.
మలుపు తిప్పిన సమ్మర్ క్యాంప్
2008లో జరిగిన ఒక సమ్మర్ క్యాంప్ నా జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ నేను పరిగెడుతుంటే చూసిన క్రికెట్ కోచ్ నాలోని ప్రతిభను గుర్తించి నాన్నతో మాట్లాడారు. అలా పరుగుల బాట నుంచి క్రికెట్ వైపు అడుగులు పడ్డాయి. నేను లెఫ్ట్‌హ్యాండర్ కావడంతో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ నాకు మేలు జరిగింది. ఏ రంగమైనా కఠోర సాధన ఉంటే విజయం తథ్యమన్న నాన్న మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి.
60 ఏళ్ల నిరీక్షణకు దక్కిన కప్పు
అండర్-16, 19 విభాగాల్లో ఆంధ్ర జట్టుకు ఆడుతూ నా ప్రయాణం మొదలైంది. 2018లో సౌత్ జోన్ జట్టుకు ఎంపికయ్యాను. 2019లో ముంబైలో జరిగిన అండర్-19 సూపర్ లీగ్‌లో నాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. సౌత్‌జోన్ 60 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కానీ, నా సారథ్యంలోని మా జట్టు వరుస విజయాలతో చాంపియన్‌గా నిలిచింది. ఆ కప్పు చేతపట్టుకున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ప్రతిభే నాకు ఇండియన్ రైల్వే్‌సలో ఉద్యోగం తెచ్చి పెట్టింది.
భారత్ జెర్సీ
2022లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టుకు ఎంపికయ్యాను. మొదటిసారి ‘ఇండియా’ అని రాసి ఉన్న జెర్సీ వేసుకున్నప్పుడు కలిగిన అనుభూతి మాటలకు అందదు. ఆ ఏడాది 37 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలవడం నా క్రికెట్ జీవితంలో మరువలేనిది. ఆ తర్వాత 2023లో టీ20 ప్రపంచక్‌పలోనూ భారత జట్టు తరపున ఆడాను.
గాయం వెంటాడినా..
బంగ్లాదేశ్ పర్యటనలో తగిలిన గాయం తర్వాత కోలుకోవడం అంత సులభం కాలేదు. బీసీసీఐ సహకారంతో బెంగళూరులో శస్త్రచికిత్స చేయించుకుని నెలల తరబడి విశ్రాంతి తీసుకున్నాను. ‘మళ్లీ క్రికెట్ ఆడగలనా’ అన్న భయం నన్ను నిద్రపోనివ్వలేదు. కానీ అమ్మానాన్నలు నా వెన్నంటి నిలిచారు. రెండోసారి ముంబైలోని అంబానీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని కాలిలోని చిన్న ఎముక ముక్కను తొలగించాక మళ్లీ మైదానంలో అడుగుపెట్టాను. డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ నన్ను రూ. 53 లక్షలకు కొనుగోలు చేసి నాపై నమ్మకం ఉంచింది. ఆ మూడేళ్లు నా సెకండ్ ఇన్నింగ్స్‌కు పునాది వేసింది.
లక్ష్యం మళ్లీ భారత్ జెర్సీనే
ప్రస్తుతం నేను రైల్వేస్ తరపున ఆడుతున్నా. నా మాతృభూమి అయిన ఆంధ్ర జట్టుకు ఆడాలనే కోరికతో రైల్వేస్ అనుమతి తీసుకుని ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు ఆంధ్ర సీనియర్ మహిళల జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టం. ప్రస్తుతం కడప క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాం. త్వరలో జరగబోయే సీనియర్ ఉమెన్స్ టోర్నమెంటులో నా సారథ్యంలో ఆంధ్ర జట్టు విజయకేతం ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
వందకు పైగా మ్యాచ్‌లు
వందకుపైగా మ్యాచ్‌లు ఆడాను. వందకుపైగా వికెట్లు తీశాను. కానీ, నా దృష్టి భారత్ జెర్సీ మీదే ఉంది. ఏ రంగంలోనైనా ఆడపిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్వేచ్ఛ ఉంటే వారు చరిత్ర సృష్టిస్తారు. నా ప్రయాణమే అందుకు నిదర్శనం.
గోరంట్ల కొండప్ప, కర్నూలు
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News