త్రివిక్రమావతారం
ABN , Publish Date - May 15 , 2026 | 04:01 AM
వామనుడు శ్రీమహావిష్ణువు అయిదో అవతారం. ఈ వామనావతార ఘట్టాన్ని భాగవతం ఎంతో మనోహరంగా వర్ణించింది. మత్స్యపురాణం, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర పురాణం, వైఖానస ఆగమం...
తెలుసుకుందాం
వామనుడు శ్రీమహావిష్ణువు అయిదో అవతారం. ఈ వామనావతార ఘట్టాన్ని భాగవతం ఎంతో మనోహరంగా వర్ణించింది. మత్స్యపురాణం, అగ్నిపురాణం, విష్ణుధర్మోత్తర పురాణం, వైఖానస ఆగమం, రూపమండనం, శిల్పరత్నాలు లాంటి గ్రంథాలు కూడా ఆ వృత్తాంతాన్ని చక్కగా వివరించాయి. ప్రహ్లాదుడి మనుమడైన బలి చక్రవర్తిని పాతాళానికి అణచివేసి... ఇంద్రుడి స్వర్గాధిపత్యాన్ని నిరాటంకం చేయడానికి వటువు రూపంలో బలి చక్రవర్తి యజ్ఞవాటికకు మహావిష్ణువు చేరుకుంటాడు. బలి దగ్గర మూడు అడుగుల దానాన్ని పొంది... ఒక అడుగుతో నేలను, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి... మూడో అడుగును ఎక్కడ పెట్టాలని బలిని అడుగుతాడు. తన తలపై పెట్టాలని బలి కోరగా... బలిని వామనుడు పాతాళానికి తొక్కుతాడు.
రెండు రూపాలు...
వామనుడి రూపాన్ని రెండు రకాలుగా చెబుతారు. అవి: వామనుడు (కుబ్జ రూపంలో ఉన్న బ్రహ్మచారి), త్రివిక్రముడు (మూడు లోకాలను ఆక్రమించిన బృహద్రూపం)
వామనమూర్తి: వైఖానస ఆగమం ప్రకారం... ఈ మూర్తిని ఉత్తమ పంచతాళమానం అంటే ముఖం కొలతలు అయిదు రెట్లు ఎత్తులో... మరో నాలుగు అంశాలు చేసి రూపొందించాలి. ఈ మూర్తి రెండు చేతులను కలిగి ఉంటాడు. కుడి చేతిలో కమండలం, ఎడమ చేతిలో గొడుగు ధరిస్తాడు. తలఫై శిఖ ఉంటుంది. చెవులకు కర్ణకుండలాలు, ఉత్తరీయంగా కృష్ణాజినం (జింక చర్మం), యజ్ఞోపవీతం, మేఖలం, కౌపీనం ధరించి ఉంటాడు. ఉంగరపు వేలికి పవిత్రాన్ని (యజ్ఞ దీక్ష పొందే ముందు వేలికి పెట్టుకొనే, దర్భలతో చేసిన ఉంగరాన్ని పవిత్రం అంటారు) ధరించినట్టు చూపించాలి. ఇవన్నీ ఆయన ఒక సామాన్య వేద విద్యార్థి లేదా బ్రహ్మచారి అని చూపే లక్షణాలు.
త్రివిక్రముడు: త్రివిక్రమ మూర్తి రెండు లేదా నాలుగు చేతులతో ఉంటాడు. కుడి కాలు భూమిపైన, ఎడమ కాలును బలి తలమీద ఉంచుతాడు. వైఖానస ఆగమం ప్రకారం త్రివిక్రమ మూర్తిని చూపించడంలో మూడు పద్ధతులు ఉన్నాయి. అన్ని పద్ధతులలోనూ ఎడమకాలును ఎత్తినట్టు చూపాలి. ఒక దశలో కుడి మోకాలి వరకు, రెండో దశలో నాభి వరకు, మూడో దశలో ఫాలభాగం వరకూ ఆ కాలిని ఎత్తి... బలిని అణచివేస్తున్నట్టు చూపించాలి. త్రివిక్రముడి ప్రతిమ ఉత్తమ దశతాళ ప్రమాణంలో 124 అంగుళాల ఎత్తు ఉండాలనేది శిల్ప సంప్రదాయం. ఈ మూర్తికి నాలుగు లేదా ఎనిమిది చేతులు ఉంటాయి. నాలుగు చేతులైతే పై రెండిటిలో శంఖ చక్రాలను, కుడి చేతిని అభయ లేదా వరద ముద్రలోను చూపాలి. ఎడమ చేతిని కాలికి సమాంతరంగా ఉంచాలి.
ఎనిమిది చేతులు ఉన్నట్టయితే... అయిదు చేతులలో శంఖం, చక్రం, గద, ధనస్సు (శార్ఙ్గం), హలం (నాగలి), మిగిలిన మూడు చేతులలో రెండు అభయ, వరద ముద్రలతో ఉండాలి. ఇంకొక చెయ్యి కాలికి సమాంతరంగా ఉంటుంది. ఈ మూర్తి కృష్ణ వర్ణంలో ఎర్రని వస్త్రాన్ని ధరించి ఉంటాడు. త్రివిక్రముడు దండం, పాశం, శంఖం, చక్రం, గద పద్మాలను ధరించి ఉంటాడని ‘విష్ణు ధర్మోత్తర పురాణం’ పేర్కొంది. పరివార సమేతుడైన త్రివిక్రముణ్ణి, బలి చక్రవర్తి ఉదంతాన్ని చూపే శిల్ప విశేషాలను ‘శ్రీతత్త్వ నిధి’ అనే గ్రంథం వివరంగా వర్ణించింది. త్రివిక్రమ మూర్తిని ప్రతిష్ఠించి, పూజించిన వారికి రాజ్యభోగం లభిస్తుందని పెద్దలు చెబుతారు.
వామనుడి గురించి మొట్టమొదటగా ఋగ్వేదం ‘ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ / సమూఢమస్య పాగ్‌ంసురే’ అని వర్ణించింది. అంటే సర్వవ్యాపి అయిన శ్రీమహావిష్ణువు ఈ విశ్వాన్ని మూడు అడుగులతో ఆక్రమించాడు. ఆయన పాదధూళిలో సమస్త ప్రపంచం ఇమిడి ఉంది. వామనుడికీ, యజ్ఞానికి భేదం లేదని ‘శతపథ బ్రాహ్మణం’ పేర్కొంది. పురాణాల ప్రకారం వామనుడు... అదితి, కశ్యపుల సంతానం. ఈ స్వామి దేవేరి కీర్తి. వీరిద్దరి పుత్రుడు బృహత్ శ్లోకుడు. భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణం నక్షత్రంలో, అభిజిత్ ముహూర్తంలో వామనుడు ప్రభవించాడు.
మన తెలుగు రాష్ట్రాలలో... ఆంధ్రప్రదేశ్‌లోని పర్చూరు సమీపంలో ఉన్న చెరుకూరు గ్రామంలో అత్యంత పురాతనమైన త్రివిక్రమ స్వామి దేవాలయం ఉంది. అక్కడ స్వామివారి మూలమూర్తి మూడు అడుగుల ఎత్తులో కొలువై ఉంటాడు. పురాణ గాథలతో నిండిన గర్భాలయం గోడలు అద్భుతమైన శిల్ప కళాకృతులతో చూపరులను కనువిందు చేస్తాయి. అరుదైన ఈ ఆలయాన్ని ఏడో శతాబ్దంలో తూర్పు చాళుక్యులు నిర్మించారని, అనంతరం విజయనగర సామ్రాజ్య కాలంలోనూ, సదాశివరాయల పరిపాలనలోనూ ఎంతో వైభవాన్ని ఈ ఆలయం చవిచూసిందనీ చరిత్ర చెబుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News