తొలి గురువులు వారే
ABN , Publish Date - Jun 12 , 2026 | 03:21 AM
సంతానాన్ని అల్లాహ్ ప్రసాదించిన అమూల్యమైన వరంగా, వారిని సక్రమంగా పెంచడం అత్యున్నతమైన బాధ్యతగా ఇస్లాం ధర్మం పేర్కొంది. కుటుంబానికి...
సందేశం
సంతానాన్ని అల్లాహ్ ప్రసాదించిన అమూల్యమైన వరంగా, వారిని సక్రమంగా పెంచడం అత్యున్నతమైన బాధ్యతగా ఇస్లాం ధర్మం పేర్కొంది. కుటుంబానికి ఆనందాన్ని, సమాజానికి భవిష్యత్తును, దేశానికి సంపదను అందించేది పిల్లలే. వారి హృదయాలు స్వచ్ఛంగా ఉంటాయి. చిన్న వయసులో వారికి ఏ విలువలను, సంస్కారాలను, ఆచారాలను నేర్పిస్తామో... అవే వారి భావి జీవితానికి పునాదిగా నిలుస్తాయి. కాబట్టే పిల్లల క్రమశిక్షణలో, వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లితండ్రులపైన గొప్ప బాధ్యత ఉంది. వారికి ఆహారం, వస్త్రాలు, విద్యా అందించడమే కాదు... మంచి నడవడిక, దైవ భక్తి, ప్రేమ, సత్యం, నిజాయితీ, కరుణ, జాలి, సహాయం చేసే గుణం లాంటి విలువలను నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యం. వారు తమ పిల్లలను ఈ ప్రపంచంలో విజయాలకోసమే కాదు... పరలోకంలో విజయానికి కూడా సిద్ధం చేయాలి.
క్రమశిక్షణ అంటే...
మనలో ప్రతి ఒక్కరూ తమ సంరక్షణలో ఉన్నవారి విషయంలో జవాబుదారీగా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుందని దైవప్రవక్త మహమ్మద్ స్పష్టం చేశారు. దాని ప్రకారం పిల్లల విషయంలో తల్లిదండ్రులు జవాబుదారీగా ఉంటారు. నేటి కాలంలో పిల్లలు అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు మొబైల్ ఫోన్లు, ఇంటర్‌నెట్, చెడు స్నేహాలు, అసభ్యకరమైన వినోదాలు వారి మనస్సులను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలతో సమయం గడపాలి. వారి సమస్యలను వినాలి. ప్రేమతో సలహా ఇవ్వాలి. క్రమ శిక్షణ అంటే శిక్షించడం కాదు... సరైన మార్గం చూపించడం, బాధ్యత నేర్పించడం, తప్పులను సరిదిద్దడం. అలాగే పిల్లల హృదయంలో దైవం పట్ల ప్రేమను నింపడం.
విలువలతో జీవించాలి
పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రార్థన అలవాటు చేయాలి. ముస్లిం బాలలకు నమాజ్, ఖురాన్ పఠనం నేర్పించాలి. అబద్ధం చెప్పకూడదని, ఇతరులను బాధ పెట్టకూడదని, పెద్దలను గౌరవించాలని బోధించాలి. తల్లిదండ్రులు ఇవన్నీ స్వయంగా పాటించి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు పెద్దల మాటలకన్నా చర్యలనే ఎక్కువగా అనుసరిస్తారు. వారు ప్రార్థన చేయకపోతే పిల్లలకూ ఆసక్తి ఉండదు. వారు అబద్ధాలు చెబితే... పిల్లలు నిజాయితీగా ఉండడం నేర్చుకోలేరు. పిల్లల సంస్కారానికి ఇల్లే మొదటి పాఠశాల. తొలి గురువులు తల్లిదండ్రులే. మహనీయుడైన లుక్మాన్ తన కుమారునికి చేసిన ఉపదేశాల ప్రస్తావన దివ్య ఖుర్‌ఆన్‌లో ఉంది. మంచిని ప్రోత్సహించాలని, నమాజ్‌ను ఆచరించాలని, చెడును నిరోధించాలని, వినయంగా ఉండాలని లుక్మాన్ చేసిన బోధలు ఎప్పుడూ ఆచరణీయాలే. అలాగే పిల్లలు మంచి స్నేహితులను ఎంచుకొనేలా ప్రోత్సహించాలి. వారి జీవితం మీద స్నేహితుల ప్రభావం చాలా ఉంటుంది. అందుకే మంచి స్నేహితుడిని సుగంధ ద్రవ్యాలతో, చెడు స్నేహితుణ్ణి నిప్పుల కొలిమితో దైవప్రవక్త పోల్చారు. తల్లిదండ్రులు విలువలతో జీవించి, వాటిని తమ సంతానానికి బోధిస్తే... పిల్లలు ఈ లోకంలోను, పరలోకంలోను మన్నన పొందుతారు.
మహమ్మద్ వహీదుద్దీన్
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News