Share News

ఇరాన్‌లో విలసిల్లిన బౌద్ధం

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:10 AM

‘ఇరాన్‌’ అనే మాట ప్రాచీన ‘ఆర్యన్‌’ అనే పదం నుంచి ఉద్భవించింది. ఇరాన్‌ అంటే ‘ఆర్యులు సందర్శించిన భూమి’. పర్షియన్‌ నాగరికతను నిర్మించినది మన ప్రాచీన ఆర్యులే. అందుకే వారు అగ్నిని...

ఇరాన్‌లో విలసిల్లిన బౌద్ధం

ధర్మపథం

‘ఇరాన్‌’ అనే మాట ప్రాచీన ‘ఆర్యన్‌’ అనే పదం నుంచి ఉద్భవించింది. ఇరాన్‌ అంటే ‘ఆర్యులు సందర్శించిన భూమి’. పర్షియన్‌ నాగరికతను నిర్మించినది మన ప్రాచీన ఆర్యులే. అందుకే వారు అగ్నిని పూజించేవారు. ఋగ్వేదం ‘అగ్నిమీళే పురేహితం...’ అనే అగ్ని మంత్రంతోనే ఆరంభం అవుతుంది. ఇరాన్‌ దేశంలోకి బౌద్ధ ధర్మం క్రీస్తుశకం రెండో శతాబ్దంలోనే ప్రవేశించింది. బౌద్ధ సాహిత్యాన్ని చైనా భాషలోకి తర్జుమా చేసిన ప్రాచీన అనువాదకులలో ఇరాన్‌కు చెందిన పార్థియన్లు చాలామంది ఉన్నారు.

బౌద్ధులకు వేధింపులు...

ఇరాన్‌ భాష... ఇండో ఇరానియన్‌ మూలాల నుంచి జన్మించింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక ఇరాన్‌... ఒకప్పటి పర్షియా. అంటే ఇరాన్‌, పర్షియా అనే రెండు పేర్లు ఒకే దేశాన్ని సూచిస్తాయి. కానీ ఇరాన్‌ అనే పదం మాత్రం ప్రాచీన నాగరికతను నేరుగా సూచిస్తుంది. ససానియన్ల పాలనలో బౌద్ధులు వేధింపులకు గురయ్యారు. ఎందుకంటే ససానియన్లు క్రీస్తుశకం 224లో జొరాస్ట్రియన్‌ మతాన్ని రాజ్య మతంగా ప్రకటించారు. బౌద్ధ ధర్మానుసరణ సాగుతున్న అన్ని ప్రాంతాల్లో... ముఖ్యంగా మధ్య ఆసియాలో అనేక బౌద్ధ ధార్మిక క్షేత్రాలను వారు ధ్వంసం చేశారు. అరబ్‌ దండయాత్రలకన్నా ముందే బౌద్ధమతం పూర్వ ఇరాన్‌ ప్రాంతంలో వ్యాప్తి చెందింది. అనేక బౌద్ధ ధార్మిక విహారాలు ఆప్ఘనిస్తాన్‌, తుర్క్మెనిస్తాన్‌, ఉజ్‌బెకిస్తాన్‌, తజికిస్తాన్‌, ఖజాకిస్తాన్‌లతో పాటు ఇరాన్‌లో కూడా బయటపడ్డాయి. దౌర్జన్యపూరితమైన దండయాత్రలు పూర్వ ఇరాన్‌, ఆప్ఘనిస్తాన్‌లలో బౌద్ధ ధర్మ పతనానికి కారణమయ్యాయి. కానీ బామియాన్‌, హడ్డా లాంటి కొన్ని స్థలాలలో క్రీస్తు శకం 8, 9 శతాబ్దాలవరకూ బౌద్ధ విహారాలు కొనసాగాయి.


భాషా కుటుంబాలు వేర్వేరు...

దక్షిణ ఇరాన్‌ ప్రాంతమైన ఫార్స్‌లో గాంధారశైలిలో రూపుదిద్దుకున్న తొమ్మిది బౌద్ధ విగ్రహాలు 2002లో బయటపడ్డాయి. దీనితో ఇరాన్‌ ప్రాచీన ధర్మమేమిటన్నది ప్రజలందరికీ తెలిసింది. ఇటీవలి కాలంలో ఇరాన్‌ ప్రజల్లో ప్రారంభమైన బౌద్ధ ధర్మాసక్తి ప్రపంచాన్ని ఆకర్షించింది. ప్రసిద్ధ ఇరాన్‌ కవి సోహ్రాబ్‌ సేపెహ్రి కవితలలో బౌద్ధ ప్రభావం కనిపిస్తుంది. ఇరాన్‌ నేడు ముస్లిం ప్రాంతాలైన అరబ్‌ దేశాలపై ఎందుకు దాడి చేస్తోందో చాలామందికి అర్థం కాదు. ఈ రెండు దేశాల మఽధ్యా భాష, సంస్కృతుల పరంగా విభేదం ఉంది. ఇరాన్‌ అధికారిక భాష అరబిక్‌ కాదు... పర్షియన్‌. పర్షియన్‌ను ‘ఫార్సీ’ అని కూడా పిలుస్తారు. ఇది మన ఇండో-యూరోపియన్‌ భాషా కుటుంబానికి చెందినది. అందుకే పర్షియన్‌కు సంస్కృతం, హిందీ, ఫ్రెంచ్‌ లాంటి భాషలతో సంబంధం ఉంది. అరబిక్‌ భాష వేరు... అది సెమిటిక్‌ భాషా కుటుంబానికి చెందినది. పర్షియన్‌ ఇప్పుడు అరబిక్‌ జన్యమై లిపిని ఉపయోగిస్తోంది. కానీ పర్షియన్‌ భాషా నిర్మాణం, వ్యాకరణం, ప్రాచీన పద సంపద భిన్నంగా ఉంటాయి. అందుకే అరబిక్‌లో మాట్లాడేవారు పర్షియన్‌ను, పర్షియన్‌లో మాట్లాడేవారు అరబిక్‌ను అంత త్వరగా అర్థం చేసుకోలేరు. పర్షియన్‌లో అరబిక్‌ భాషలో లేని కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఉదాహరణకు ప, ఛ, గ, ఝ లాంటి శబ్దాలు. చూడడానికి ఒకేలా ఉండడం అనేది ఈ రెండు భాషా లిపుల విషయంలో తరచుగా గందరగోళానికి దారి తీస్తుంది. కానీ భాషాశాస్త్రపరంగా ఇవి వేర్వేరు భాషలు.

ఇస్లాం ప్రవేశానికి ముందే పర్షియా దేశం శక్తిమంతమైన పర్షియన్‌ సామ్రాజ్యాలను రూపొందించింది. కాగా... అరబ్‌ భాష... అరేబియన్‌ ద్వీపకల్పంలో అభివృద్ధి చెందింది. క్రీస్తు శకం ఏడో శతాబ్దంలో... విడివిడిగా ఉన్న అరబ్‌ తెగలను ఇస్లాం మతం ఏకీకృతం చేసింది, పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలో అరబ్‌ పాలనను విస్తరించింది. అరబ్‌ ముస్లిం సేనలు ఏడో శతాబ్దంలో పర్షియాను ఆక్రమించాయి. అలా ఇస్లాం క్రమంగా ఇరాన్‌లోకి ప్రవేశించింది. కాలక్రమేణా అది ఇరానియన్ల మతంగా మారింది. కానీ ఇరానియన్లు తమ పర్షియన్‌ భాషను ఎంతో నేర్పుగా రక్షించుకున్నారు.

ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు

జేఎన్‌యు, న్యూఢిల్లీ.

91 98189 69756

ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 03:10 AM