Share News

గుర్తింపు దాహంతో అహంలో మునగొద్దు

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:44 AM

ప్రతి వృత్తి నిపుణుడికి, బహుశా అందరికన్నా ముఖ్యంగా ప్రతి వైద్య నిపుణుడికి గుర్తింపు కావాలి. అప్పుడే సహాయం అవసరమైనవారు వారిని సంప్రతించడానికి వీలుంటుంది. కేవలం నోటి మాటలతోనే...

గుర్తింపు దాహంతో అహంలో మునగొద్దు

యోగా

ప్రతి వృత్తి నిపుణుడికి, బహుశా అందరికన్నా ముఖ్యంగా ప్రతి వైద్య నిపుణుడికి గుర్తింపు కావాలి. అప్పుడే సహాయం అవసరమైనవారు వారిని సంప్రతించడానికి వీలుంటుంది. కేవలం నోటి మాటలతోనే కీర్తి ప్రతిష్టలు వ్యాప్తి చెందే రోజులు పోయాయి. ఈ రోజున, సంప్రదాయ పద్ధతుల కన్నా... ఎక్కుమందికి చేరువయ్యే సోషల్‌ మీడియా వేదికలు చాలా వేగంగా, సమర్థవంతంగా అందుబాటును పెంచుతున్నాయి. ఈ సామర్థ్యాన్ని గుర్తించిన చాలామంది నిపుణులు తమ వృత్తి జీవితాన్ని, సోషల్‌ మీడియా ప్రయాణాన్ని ఏకకాలంలో ఆరంభిస్తున్నారు. ఉపన్యాసాలు, సమావేశాలు, ప్రచురణలు, బహిరంగ కార్యక్రమాల ద్వారా గుర్తింపును పెంచుకొనే సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ ప్రధానంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మార్గాలు కూడా తమ వ్యాప్తిని పెంచుకోవడానికి సోషల్‌ మీడియా మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే. ఈ విధంగా పెరుగుతున్న గుర్తింపులో మంచి, చెడులతో పాటు ఒక వికృతమైన కోణం కూడా ఉంది. విషయాలను తెలియజేయడం, అవగాహన కల్పించడం, చైతన్యాన్ని కలిగించడం, మన నైపుణ్యాలను అందరికీ అందుబాటులో ఉంచడం లాంటి సదుద్దేశాలతోనే మనలో చాలామంది ప్రయాణం ఆరంభిస్తారు. కానీ ఆ ప్రయాణంలో, మనం బహుశా అంతగా కోరుకోని ప్రదేశంలోకి వెళిపోతున్నాం.

చిత్తశుద్ధితో మొదలై...

‘పెరుగుతున్న గుర్తింపు మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుందా?’ అనే ఒక ముఖ్యమైన ప్రశ్నను ఇది మనలో లేవనెత్తుతుంది. దీనికి సమాధానం ‘అవును’ అనేది నిస్సందేహం. ప్రభావం, గుర్తింపు పెరుగుతున్నప్పుడు... వాటిని నియంత్రించకుండా వదిలేస్తే అవి స్వల్ప స్థాయిలో అహాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసంలో పెరుగుదలగా అది మొదలై... క్రమంగా ‘నేనే ముఖ్యం’ అనే భావనలోకి రూపాంతరం చెందవచ్చు. ఇలాంటి మార్పులు ఇతరులతో సంబంధాలను మాత్రమే కాదు, విచక్షణను, నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఆ వ్యక్తి ఒక వైద్య నిపుణుడు అయినప్పుడు... దాని పర్యవసానాలు మరింత తీవ్రంగా ఉంటాయి.


లంగరు కావాలి...

ఒక వైద్యుడు సంక్లిష్టమైన ప్రక్రియ గురించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు.. శాస్త్రీయమైన తర్కం, రోగి సంక్షేమంతో పాటు అందరి దృష్టిలో ఉండాలనే ఆకాంక్ష, గుర్తింపు లేదా వృత్తిపరమైన ప్రాధాన్యత పట్ల ఆకర్షణ కూడా కాస్తయినా ప్రభావితం చేసే పరిస్థితిని ఊహించుకోండి. చాలామంది నిపుణులు దీన్ని ఉద్దేశపూర్వకంగా జరగనివ్వరు. కానీ ఆ అవకాశం మాత్రం ఉంది. ఎప్పుడూ అందరి దృష్టిలో ఉండాలనే తపన అన్ని సమయాల్లోనూ అప్రధానమైనది కాదని ఇది గుర్తు చేస్తుంది. అయితే, అందరి దృష్టిలో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను... దాని చీకటికోణంలో ప్రవేశించకుండా తప్పించుకుంటూనే ఎలా ఆస్వాదించగలం? దీనికి సమాధానం... ప్రశంసలు, ప్రజాదరణ, ప్రజల గుర్తింపు అనే ప్రవాహాల్లో కొట్టుకుపోకుండా మనల్ని స్థిరంగా ఉంచే ఒక లంగరును కలిగి ఉండడం. నా విషయానికొస్తే, ఆ లంగరు... హార్ట్‌ఫుల్‌నెస్‌ అభ్యాసాలు.

వినయం... రక్షణ కవచం

హార్‌ఫుల్‌నెస్‌ ధ్యానం, దానితో ముడిపడిఉన్న అభ్యాసాలు అవగాహనను పెంచుతాయి. సున్నితత్వాన్ని గాఢంగా మారుస్తాయి. వినయాన్ని పెంపొందిస్తాయి. అవగాహన గొప్పదయితే... అహం తాలూకు సూక్ష్మమైన కదలికలు మనలో తిష్టవేసుకోవడానికి ముందే వాటిని గుర్తించడానికి అది సహాయపడుతుంది. పెరిగిన సున్నితత్వం మనల్ని మన అసలు ఉద్దేశానికి, విలువలకు అనుగుణంగా నిలుపుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన రక్షణ కవచం వినయం. అది విజయం, గుర్తింపుతోపాటు వచ్చే అహంకారాన్ని నివారిస్తుంది. గుర్తింపు, వృత్తిపరమైన ఎదుగుదల ప్రధానమైనవే. కానీ. ఒక లంగరు గనక లేకపోతే... ఆ బలాలే బలహీనతలుగా మారవచ్చు. సమర్థవంతంగా, నైతికంగా, నిలకడగా ఉండాలనుకొనే ప్రతి వృత్తి నిపుణుడు.... తనను స్థిరంగా, అప్రమత్తతతో, తనను తన ఉన్నతమైన ఉద్దేశానికి అనుగుణంగా ఉంచే అభ్యాసాల నుంచి ప్రయోజనం పొందుతారు. నిరంతరం అందరి గుర్తింపును పొందాలంటూ మనల్ని ప్రోత్సహించే ఈ ప్రపంచంలో... మనల్ని మనం విస్మరించకుండా చూసుకోవడమే అతి పెద్ద సవాలు.

ప్రజలలో అవగాహన కలిగించాలనే చిత్తశుద్ధితో మొదలైన ప్రయత్నం... నిరంతరం అందరి దృష్టిలో ఉండాలనే తాపత్రయంగా రూపాంతరం చెందవచ్చు. అందరి దృష్టిలో ఉండాలనే కోరిక... వారి శ్రద్ధను పొందాలనే అవసరంగా మారవచ్చు. ఈ మనస్తత్వం వృత్తికి సంబంధించిన పనితీరులోకి చొచ్చుకుపోయి ప్రాధాన్యతలను వక్రమైన మార్గాల్లోకి నడిపించవచ్చు.

డాక్టర్‌ శరత్‌రెడ్డి

కార్డియాలజిస్ట్‌,

ట్రైనర్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌. 9440087532

ఈ వార్తలు కూడా చదవండి..

రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి

ప్రతి ఒక్కరూ రేపు సైకిల్‌ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

Read Latest National News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 12:44 AM