Share News

పది పారమితలు

ABN , Publish Date - May 15 , 2026 | 03:58 AM

బౌద్ధంలో ఒక వ్యక్తి చేరుకోగల అత్యున్నత స్థాయి... ‘సమ్మా సంబుద్ధుడు’ (సంపూర్ణ జ్ఞాని) కావడం. అయితే ఆ స్థాయిని చేరుకోవడానికి ముందు ఆ వ్యక్తి పది జన్మలు ఎత్తి, పది పారమితలను...

పది పారమితలు

సద్బోధ

బౌద్ధంలో ఒక వ్యక్తి చేరుకోగల అత్యున్నత స్థాయి... ‘సమ్మా సంబుద్ధుడు’ (సంపూర్ణ జ్ఞాని) కావడం. అయితే ఆ స్థాయిని చేరుకోవడానికి ముందు ఆ వ్యక్తి పది జన్మలు ఎత్తి, పది పారమితలను అభ్యాసం చేయాలి. ‘పారమితలు’ అంటే ‘పారమార్థిక విలువలు’ అని అర్థం. బుద్ధుడికి, సుభూతికి మధ్య జరిగిన వివాదం ఈ పారమితలను గురించి తెలియజేస్తుంది. పారమితల గురించి వివరించాల్సిందిగా సుభూతి అడిగినప్పుడు ‘‘పారమితలు పది. అవి: దానం, శీలం, పరిత్యాగం, ప్రజ్ఞ, వీర్యం, క్షాంతి, సత్యం, స్థిర నిశ్చయం, మైత్రి, ఉపేక్ష. ఈ పారమితలు కరుణతో సంపాదించుకొనే గుణాలు. వాటిని హేతువు నిర్దేశిస్తుంది. అవి స్వార్థ ప్రేరణలకు లోబడవు. దుష్ట విశ్వాసంతో కళంకితం కావు. అహంకారానుభూతులతో ప్రభావితం కావు’’ అంటూ వాటి గురించి మరింత లోతుగా వివరించాడు బుద్ధుడు.

‘దాన పారమిత’ అంటే బోధిసత్త్వుడైనవాడు తన జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చి సంతృప్తి చెందాలి. ఇతరులు కూడా తన మాదిరిగా ఇవ్వగలిగేలా ప్రోత్సహించాలి. ‘శీల పారమిత’ అంటే నైతిక ధర్మాలు పదింటినీ తాను అనుసరించి, ఇతరులు అనుసరించేలా చేయాలి. ‘పరిత్యాగ పారమిత’ అంటే బోధిసత్త్వుడైనవాడు ఇహ లోక సుఖాలను విడిచిపెట్టాలి. ‘ప్రజ్ఞా పారమిత’ అంటే పూర్ణజ్ఞానం. ప్రపంచ స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ‘వీర్య పారమిత’ అంటే మనోబలం, శీలబలం, శారీరకబలం కలిగి... పరహితం కోసం పట్టువదలకుండా కృషి చేయడం. ‘క్షాంతి పారమిత’ అంటే ఇతరులు తనకు కలిగించే బాధను సహనంతో అనుభవించడం. ‘సత్య పారమిత’ అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, వాగ్దానభంగం కలుగకుండా చూడడం. ‘స్థిర నిశ్చయ పారమిత’ అంటే దృఢంగా నిశ్చయించుకోవడం, సంకల్పబలాన్ని కలిగి ఉండడం. దీన్ని ‘అధిట్టానము’ అని కూడా అంటారు. దీన్ని ఒక భవనం పునాదితో పోలుస్తారు. ‘మైత్రీ పారమిత’ అంటే దయాపూరితమైన కరుణ. ఎవరినీ మినహాయించకుండా అందరి హితాన్ని కోరడం, ఇతరుల ముక్తి కోసం తన ముక్తిని త్యాగం చేయడం. క్రూర మృగాలను, హంతకులను మార్చగలిగే శక్తిని సాధించడం. ‘ఉపేక్ష పారమిత’ అంటే తృణీకారాలు, అవమానాలు, ప్రశంసలు, నిందలు, లాభనష్టాలు, కష్టసుఖాలు... ఏవి కలిగినా నిశ్చలమైన శిలలా నిలబడగలగడం. గౌతమ బుద్ధుడు బోధించిన ఇన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తికి సద్గతి కలుగుతుందనడంలో సందేహమేముంది?

రాచమడుగు శ్రీనివాసులు

ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 15 , 2026 | 03:58 AM