వెరైటీ టిఫిన్స్..!
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:04 AM
మనం రోజూ ఉదయాన్నే ఇడ్లీ, ఉప్మా, కిచిడీ లాంటి అల్పాహారాలు తీసుకుంటూ ఉంటాం. వీటికి భిన్నంగా పోషకాలతో నిండిన వెరైటీ టిఫిన్స్ మీకోసం...
వంటిల్లు
మనం రోజూ ఉదయాన్నే ఇడ్లీ, ఉప్మా, కిచిడీ లాంటి అల్పాహారాలు తీసుకుంటూ ఉంటాం. వీటికి భిన్నంగా పోషకాలతో నిండిన వెరైటీ టిఫిన్స్ మీకోసం...
మద్దూర్ వడ
(కర్ణాటక)
కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి- కప్పు, బొంబాయి రవ్వ- అర కప్పు, మైదా పిండి- అర కప్పు, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- ఆరు, అల్లం ముక్కలు- చిన్నవి మూడు, ఎండు కొబ్బరి పొడి- రెండు చెంచాలు, జీలకర్ర- అర చెంచా, పల్లీలు- పావు కప్పు, ఇంగువ- పావు చెంచా, ఉప్పు- ఒకటిన్నర చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కరివేపాకు- రెండు రెమ్మలు, మంచి నీళ్లు- అర కప్పు, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం: ఉల్లిపాయలను కాస్త లావుగా పొడవాటి చీలికల్లా కోసి పెట్టుకోవాలి. అల్లం, పచ్చి మిర్చిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. అలాగే పచ్చి పల్లీలను పలుకుల్లా గ్రైండ్ చేసుకోవాలి. వెడల్పాటి గిన్నెలో ఉల్లిపాయ చీలికలు, అల్లం-పచ్చిమిర్చి పేస్టు, పల్లీల పలుకులు, జీలకర్ర, కొబ్బరి పొడి, ఇంగువ, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి చేత్తో గట్టిగా ఒత్తుతూ కలపాలి. తరువాత బొంబాయి రవ్వ వేసి మిశ్రమం తడిగా మారేవరకు కలపాలి. ఆపైన బియ్యప్పిండి, మైదా వేసి పావు కప్పు వేడి నూనె పోసి చేత్తో ఒత్తుతూ కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీటిని చిలకరిస్తూ తడిపొడిగా పిండిని కలపాలి. ఆపైన మూతపెట్టి పావుగంటసేపు నాననివ్వాలి. పిండిని చిన్న ముద్దలుగా చేసి అరచేతి మీద లావుపాటి చెక్కల్లా చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక చెక్కలు వేసి మధ్యస్థాయి మంటమీద రెండు వైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఇవి వారంపాటు నిల్వ ఉంటాయి.
పరుప్పు వడై
(తమిళనాడు)
కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగపప్పు- అర కేజీ, కంది పప్పు- నాలుగు చెంచాలు, ఎండు మిర్చి- ఎనిమిది, సోంపు- చెంచా, జీలకర్ర- చెంచా, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, అల్లం తరుగు- మూడు చెంచాలు, పచ్చి మిర్చి- ఆరు, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత, నూనె- డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం: ఒక గిన్నెలో పచ్చి శనగపప్పు, కందిపప్పులను తీసుకుని శుభ్రంగా కడిగి నిండా నీళ్లు పోసి మూడు గంటలు నానబెట్టాలి. తరువాత గుప్పెడు పప్పును విడిగా తీసి పెట్టుకుని మిగిలిన దాన్ని మిక్సీలో వేయాలి. అలాగే ఎండు మిర్చి, సోంపు, జీలకర్ర వేసి మెత్తగా కాకుండా రవ్వ మాదిరి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీయాలి. అందులో ముందుగా తీసిపెట్టుకున్న పప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. ఆపైన పిండి మిశ్రమంతో చిన్న బిళ్లలు చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా ఎర్రగా వేగిన తరువాత పళ్లెంలోకి తీయాలి.
అడై
(తమిళనాడు)
కావాల్సిన పదార్థాలు: బియ్యం- కప్పు, పచ్చిశనగ పప్పు- అర కప్పు, మినప్పప్పు- అర కప్పు, కంది పప్పు- పావు కప్పు, పెసర పప్పు- పావు కప్పు, ఎండు మిర్చి- ఎనిమిది, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, ఇంగువ- పావు చెంచా, అల్లం తరుగు- చెంచా, పచ్చిమిర్చి- రెండు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, కరివేపాకు- రెండు రెమ్మలు, జీలకర్ర- చెంచా, నూనె- తగినంత
తయారీ విధానం: పెద్ద గిన్నెలో బియ్యం, అన్ని రకాల పప్పులు, ఎండు మిర్చి వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తరువాత అవి మునిగే వరకు గోరువెచ్చటి నీటిని పోసి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా చేతికి గరుకుగా తగిలేలా గట్టిగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీయాలి. అందులో ఉప్పు, పసుపు, ఇంగువ, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాసి గరిటెతో పిండిని పరిచి మూతపెట్టి రెండు నిముషాలు ఉంచాలి. ఇలా రెండువైపులా ఎర్రగా వేగిన తరువాత పళ్లెంలోకి తీయాలి. ఈ అడైని టమాటా పచ్చడి లేదా కొబ్బరి పచ్చడితో సర్వ్ చేయాలి.
సెట్ దోశ
(కర్ణాటక)
కావాల్సిన పదార్థాలు: మినప గుండ్లు- కప్పు, బియ్యం- ఒకటిన్నర కప్పులు, మెంతులు- చెంచా, అటుకులు- అర కప్పు, ఉప్పు- తగినంత, నూనె- తగినంత
తయారీ విధానం: చిన్న గిన్నెలో అటుకులను తీసుకుని రెండుసార్లు కడిగి కొన్ని నీళ్లు చిలకరించి మూతపెట్టి ఉంచుకోవాలి. మరో గిన్నెలో బియ్యం, మినపగుండ్లు, మెంతులు వేసి కడిగి నీళ్లు పోసి మూడు గంటలపాటు నానబెట్టాలి. మిక్సీలో అటుకులతోపాటు బియ్యం, మినపగుండ్ల మిశ్రమం వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీయాలి. ఈ పిండిని రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే అందులో తగినంత ఉప్పు వేసి, గరిటె జారుగా అయ్యేలా కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా నూనె రాసి గరిటెతో దోశ వేయాలి. రెండు వైపులా ఎర్రగా వేగిన తరువాత పళ్లెంలోకి తీయాలి. ఈ సెట్ దోశను పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..