Share News

‘సిన్నర్స్‌’ రికార్డుల హోరు

ABN , Publish Date - Jan 25 , 2026 | 04:50 AM

ఆస్కార్‌ వేదికపై ఇప్పుడు మార్మోగుతున్న పేరు... ‘సిన్నర్స్‌’. హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రియాన్‌ కూగ్లర్‌, నటుడు మైఖేల్‌ బి.జోర్డాన్‌ కలయికలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 16 విభాగాల్లో...

‘సిన్నర్స్‌’ రికార్డుల హోరు

ఆస్కార్‌

ఆస్కార్‌ వేదికపై ఇప్పుడు మార్మోగుతున్న పేరు... ‘సిన్నర్స్‌’. హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రియాన్‌ కూగ్లర్‌, నటుడు మైఖేల్‌ బి.జోర్డాన్‌ కలయికలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 16 విభాగాల్లో పోటీపడుతోంది. ఒకే సినిమాకు ఇన్ని నామినేషన్లు రావడం ఆస్కార్‌ 98 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి.

గతంలో 14 నామినేషన్లు సాధించిన చిత్రాలు మూడున్నాయి. ఆల్‌ అబౌట్‌ ఈవ్‌ (1950), టైటానిక్‌ (1997), లాలా ల్యాండ్‌ (2016). వాటన్నింటినీ వెనక్కి నెట్టి 16 నామినేషన్లతో సిన్నర్స్‌ అగ్రస్థానానికి చేరింది.

సినిమా కథేంటంటే?

1930 కాలంనాటి అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక ‘గోతిక్‌ హారర్‌ థ్రిల్లర్‌’. జిమ్‌ క్రో కాలంలో కవల సోదరులు (మైఖేల్‌ బి.జోర్డాన్‌ ద్విపాత్రాభినయం) తమ గతంలోని చేదు జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి తిరిగి సొంత ఊరికి వస్తారు. అక్కడ వారు ఊహించని ఒక భయంకరమైన దుష్టశక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనుషుల మధ్య ఉండే విద్వేషం కంటే భయంకరమైన శక్తులు ఉంటాయా? అనే కోణంలో ఈ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. సాంకేతిక హంగులతోపాటు బలమైన భావోద్వేగాలు ఉన్న కథ కావడంవల్లే ఈ చిత్రానికి ఇన్ని నామినేషన్లు దక్కాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కలెక్షన్ల సునామీ

‘సిన్నర్స్‌’ను దాదాపు రూ.830 కోట్లతో నిర్మించారు. ఒక హారర్‌ చిత్రానికి ఇది భారీ బడ్జెట్‌. సినిమా విడుదలయ్యాక బాక్సాఫీసు వద్ద ఇది ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 3 వేల కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తొలి వారాంతం అమెరికాలో దాదాపు 48 మిలియన్‌ డాలర్లతో గ్రాండ్‌ ఓపెనింగ్‌ సాధించింది. 2022లో వచ్చిన ‘నోప్‌’ తర్వాత ఒక ఒరిజినల్‌ కథతో వచ్చిన సినిమాకు దక్కిన అత్యుత్తమ ఓపెనింగ్‌ ఇదే.


నామినేషన్లు ఇలా...

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (రియాన్‌ కూగ్లర్‌), ఉత్తమ నటుడు (మైఖేల్‌ బి.జోర్డాన్‌), ఉత్తమ సహాయనటుడు (డెల్రాయ్‌ లిండో), ఉత్తమ సహాయనటి (ఉన్మి మోసాకు), ఉత్తమ ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లే (రియాన్‌ కూగ్లర్‌), ఉత్తమ సినిమాటోగ్రఫీ (ఆటం డ్యూరాల్డ్‌ అర్కాపావ్‌), ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ (హన్నా బీచ్లర్‌), ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజన్‌ (రూత్‌ ఇ.కార్టర్‌), ఉత్తమ ఫిలిం ఎడిటింగ్‌ (మైఖేల్‌ పి.షావర్‌), ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ (లుడ్విగ్‌ గోరాన్సన్‌), ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ (ఐ లైడ్‌ టు యు), ఉత్తమ మేకప్‌, హెయిర్‌ స్టైలింగ్‌, ఉత్తమ సౌండ్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ క్యాస్టింగ్‌ (ఈ ఏడాదే ప్రవేశపెట్టారు)

ఈ వార్తలు కూడా చదవండి...

నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 04:50 AM