Shivangi Para Athlete: వైకల్యంపై శివంగి గెలుపు
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:18 AM
Shivangis Triumph Over Disability From Kurnool to International Glory
ఆమె అడుగు పెడితే మైదానం పులకరిస్తుంది. ఆమె చేతిలోని జావెలిన్ గాల్లోకి లేస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. పుట్టుకతో ఒక చేయి లేకపోయినా గుండె నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తోంది ఈ కర్నూలు ముద్దుబిడ్డ. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ బాల పురస్కారాన్ని అందుకున్న హోసూరు ఉప్పర శివాని తన అద్భుత ప్రయాణాన్ని ‘నవ్య’తో పంచుకుంది.
ఆ స్ఫూర్తి గాథ ఆమె మాటల్లోనే..
‘‘తొలిచూరు ఆడబిడ్డ పుట్టిందని మా ఇంట అందరూ సంబరపడ్డారు. కానీ నాకు ఒక చేయి లేదని తెలిసి చుట్టుపక్కల వారు సానుభూతి చూపించారు. ‘పాపం అమ్మాయి’ అనే మాటలు వినిపించాయి. అమ్మ లలిత, నాన్న ఈరప్ప మాత్రం నన్ను ఏనాడూ తక్కువచేసి చూడలేదు. శివాని అని పేరు పెట్టి శివంగిలా పెంచారు. నాన్న ఆకుకూరలు అమ్ముతూ మమ్మల్ని పోషిస్తున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్నా నా చదువు విషయంలో మాత్రం ఎన్నడూ రాజీపడలేదు.
జీవితాన్ని మార్చిన మలుపు
నా క్రీడా ప్రయాణం వెనుక ఒక పెద్ద కథే ఉంది. కర్నూలు జిల్లా బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న సమయంలో సాగరిక మేడమ్ నాలోని ప్రతిభను గుర్తించారు. ‘తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అక్కడికి వెళ్లు శివానీ, అది నీ భవిష్యత్తుకు సువర్ణావకాశం’ అని ప్రోత్సహించారు. అంతదూరం వెళ్లాలంటే మొదట భయమేసింది. అమ్మానాన్న ఒప్పుకుంటారో లేదోనని సందేహించాను. కానీ నా భవిష్యత్తు కోసం కళ్లలో నీళ్లు దిగమింగుకుని నన్ను పంపించారు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి ప్రిన్సిపల్ నన్ను ‘ఆదిత్య మెహతా ఫౌండేషన్’లో చేర్పించారు. నాలో జావెలిన్ త్రో, షాట్‌పుట్‌లలో నైపుణ్యం ఉందని అక్కడి కోచ్‌లు వేణు వినుకోటి, మణింకంఠ గుర్తించి శిక్షణ ఇచ్చారు. ఆరేడు నెలల కఠోర సాధన నన్ను క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది.
పతకాల పంట
2023లో విశాఖపట్నం వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీలు నాకు తొలి పరీక్ష. వందలాదిమంది క్రీడాకారుల మధ్య నేను నిలబడగలనా అన్న భయం వేసింది. అప్పుడు మణికంఠ సార్ ‘శివానీ నీ లక్ష్యం బంగారు పతకం సాధించడం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లు’ అని ధైర్యం చెప్పారు. అంతే, తొలి ప్రయత్నంలోనే రెండు బంగారు పతకాలు సాధించాను. ఆ తర్వాత గుజరాత్‌లో జరిగిన జాతీయ పోటీల్లో జావెలిన్ త్రోలో బంగారు పతకం, షాట్‌పుట్‌లో రజత పతకం సాధించాను. 2023లో థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాను. 2024లో 100 మీటర్ల పరుగు పందెంలోనూ స్వర్ణం కైవసం చేసుకున్నాను. దుబాయ్‌లో జరిగిన పారా యూత్ ఆసియా క్రీడలు, ఢిల్లీ గ్రాండ్ ప్రిక్స్.. ఇలా ప్రతిచోట నా సత్తా చాటాను. గడచిన మూడేళ్లలో 12 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో మొత్తం 14 పతకాలు సాధించాను.
ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యం
క్రీడల్లో పతకాలు గెలుస్తున్నా చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. పదో తరగతిలో 67 శాతం మార్కులు సాధించాను. ప్రస్తుతం చిత్తూరులో 12వ తరగతి చదువుతున్నాను. నా ముందున్న ఒకే ఒక లక్ష్యం పారా ఒలింపిక్స్‌లో భారత్ తరఫున స్వర్ణ పతకం సాధించడం. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తూ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచం ముందు రెపరెపలాడిస్తాను’’.
గోరంట్ల కొండప్ప, కర్నూలు
ఫోటోలు: కె.వీరశేఖర్, మద్దికెర
రాష్ట్రపతి పురస్కారం
నా విజయాలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం నన్ను ‘జాతీయ బాల పురస్కార్’కు ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ 26న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. అదే వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడిన క్షణాలు నా జీవితంలో మర్చిపోలేను. ఆ వేదికపై నిలబడినప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా జీవితం సాఫీగా సాగుతున్న సమయంలోనే అమ్మ లలిత మాకు దూరమైంది. ఈ రోజు ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అమ్మ బతికి ఉంటే ఎంతగా మురిసిపోయేదో అని అనిపిస్తుంది. ఇప్పుడు నాన్నే నాకు అన్నీ. పూట గడవడం కష్టమెనా ‘శివానీ.. అధైర్యపడకు. నీ ఆత్మస్థైర్యమే నిన్ను పారా ఒలింపిక్స్‌కు చేరుస్తుంది’ అని నాన్న చెప్పే మాటలే నాకు స్ఫూర్తి.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More AP News And Telugu News