Sankranti Festival: సర్వహితం సంక్రాంతి సంబరం
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:36 AM
తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూ... ఆధునిక హంగులను సైతం సదాచారం వైపు నడిపించే పండుగ సంక్రాంతి. ‘క్రాంతి’ అంటే వెలుగు. ‘సంక్రాంతి’ అంటే కొత్తదైన వెలుగు....
పర్వదినం
తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూ... ఆధునిక హంగులను సైతం సదాచారం వైపు నడిపించే పండుగ సంక్రాంతి. ‘క్రాంతి’ అంటే వెలుగు. ‘సంక్రాంతి’ అంటే కొత్తదైన వెలుగు. మన జీవితాల్లో కొత్త వెలుగు నిండాలని కోరుకుంటూ చేసుకొనే సమష్టి ఆరాధన సంక్రాంతి. అందుకే పండుగల్లో ఇది అగ్ర తాంబూలాన్ని అందుకుంది.
సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పేరుతో నాలుగు రోజుల ఆటవిడుపు కాదు. జీవన సంస్కృతికి ప్రతిబింబమైన సామాజిక పర్వదినం. రంగవల్లులు, గొబ్బెమ్మలు, బంతిపూలు, రేగు పండ్లు, బసవన్నలు, హరిదాసులు, పిండివంటలు, కొత్త బియ్యం, కోడి పందేలు, పతంగులు, చెరుకు గడలు, భోగి మంటలు, తర్పణాలు, దాన ధర్మాలు, ఆత్మీయమైన పలకరింపులు, అనుబంధాల సరదాలు, ఆచార వ్యవహారాలు... వీటన్నిటి సమాహారం సంక్రాంతి.
భోగి భాగ్యాలు
సంక్రాంతి సందడి భోగి రోజునే ప్రారంభమవుతుంది. పాత కలపను, వృధా వస్తువులను భోగి మంటల్లో వేసి, అగ్ని ఆరాధన చేయడం అంటే... పాత వాసనలు, వృధా ఆలోచనలు వదులుకొని కొత్త ఆశలతో జీవించాలనే సందేశం. కాలం కదిలిపోతుంది. భవిష్యత్తు వర్తమానం అవుతుంది. వర్తమానం కూడా గతం అనే మహార్ణవంలో కలిసిపోతుంది. గతాన్ని మరచి, భవిష్యత్తుకోసం దిగులు పడకుండా వర్తమానంలో జీవించాలని భోగి మంటలు చెబుతాయి. భోగి అనగానే గుర్తుకువచ్చేది భోగి పండ్లు. అపురూపమైన పసితనానికి దిష్టి తగలకుండా, అన్ని ఆనందాలూ పిల్లలకు లభించాలని ఆశీర్వదించేవే భోగి పండ్లు. ఆరోగ్యం, ఆనందం అనే భాగ్యాలను తెచ్చే భోగి పండుగ అద్వితీయమైన రోజు. బలి చక్రవర్తిని వామనుడు మూడు అడుగుల నేలను అడిగి, విశ్వమంతా వ్యాపించినది భోగి రోజునే అని, వ్యవసాయానికి ఆధారమైన వర్షానికి కారకుడు ఇంద్రుడు. ఆయన కృపవల్ల పంటలు సమృద్ధిగా చేతికి వచ్చాయని కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశాన్ని భోగి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
శుభ సంక్రాంతి
సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చేసే శుభపర్వం మకర సంక్రాంతి. అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం చేసుకుంటే... సౌరమానం ప్రకారం జరుపుకొనే పండుగ సంక్రాంతి. ఆ రోజు నుంచే దక్షిణాయనం ముగిసి, ఉత్తరాయణం మొదలవుతుంది. శుభకార్యాలకు నెలవైన కాలం ఉత్తరాయణం. మకర సంక్రమణం తరువాత ఇళ్ళలో శుభకార్యాలను తలపెట్టడం ఆనవాయితీ. మనిషి తనలోని ప్రతికూల లక్షణాలన్నిటినీ వదులుకొని, సత్ప్రవర్తన అలవరచుకోవాలనే సందేశానికి ప్రతీక ఈ పండుగ. భగీరథ ప్రయత్నం ఫలించి, గంగానది భువిపై పరుగులు పెట్టిన రోజుగా దీన్ని పేర్కొంటారు. మనిషికి జీవితాన్ని, అస్థిత్వాన్ని ఇచ్చిన పూర్వీకులను సంస్మరించుకుంటూ తర్పణాలు ఇవ్వడం, దానాలు చేయడం సంక్రాంతి విధి. మనిషిని బ్రతికించేది అన్నం. సంక్రాంతి నాడు కొత్త ధాన్యంతో పరమాన్నం చేసి, భగవంతుడికి నివేదించి, అందరికీ అన్నం సమృద్ధిగా లభించాలని ఆకాంక్షించడం... సార్వజనీన సౌభాగ్యాన్ని సహృదయంతో కోరుకోవడమే అవుతుంది.
కృతజ్ఞతలే కనుమ
ప్రపంచానికి అన్నం పెట్టే రైతులతో కలిసి ఆరుగాలం శ్రమించే బసవన్నలను అలంకరించి, పూజలు నిర్వహించి, కృతజ్ఞతలు చెల్లించుకొనే మహత్తర పర్వం... కనుమ. పశుపక్ష్యాదులను కూడా గౌరవించుకొనే సందర్భం. పశుపోషణ, రక్షణ మానవుల కర్తవ్యం. వాడుకలో ‘కనుమ’గా ఉపయోగించే పదానికి అసలు రూపం... కనుముపులు. ‘కనుము’ అంటే పశువు, ‘పులు’ అంటే మాలిన్యం. పశువుల మాలిన్యాన్ని శుభ్రపరచడం వెనుక... మనిషిలోని పశుత్వాన్నీ, మాలిన్యాన్నీ కడిగేసుకోమనే అర్థం దాగుంది. ప్రపంచంలో మనతోపాటు కలిసి ఉండే జీవజాతికి మంచి మనసుతో, నిష్కల్మషంగా కృతజ్ఞతలు తెలుపుకోవడమే అసలైన కనుమ పండుగ.
సంఘీభావమే ముక్కనుమ
సంక్రాంతి పండుగ వాతావరణానికి ముగింపు శోభను సంతరించే ముక్కనుమ... అందరినీ కలుపుకొనే విశేషమైన పర్వం. అందరినీ మనవారనుకొని ఊరంతా ఒక్కటయ్యే సూత్రం... రథం ముగ్గు రూపంలో ప్రతి ఇంటినీ ఒక్కటిగా చేస్తుంది. మనిషి సంఘజీవి. సంఘీభావంతోనే మనిషి మనుగడ సాధ్యపడుతుంది. ‘నేను, నాది’ అనే స్వార్థానికి తావివ్వని సమైక్య భావన మనలో ధ్వనించాలనేదే ముక్కనుమ సారాంశం.
డాక్టర్ ఇట్టేడు అర్కనందనాదేవి
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News