Share News

త్రిగుణాల నుంచి నిర్గుణత్వానికి

ABN , Publish Date - May 15 , 2026 | 04:03 AM

‘‘సమస్త సృష్టి త్రిగుణాత్మకమైనది. మానవులందరూ వారివారి స్వభావాల రీత్యా సత్వ, రజో, తమో గుణ ప్రధానులుగా విభజన చెందారు’’ అని ‘దేవీ భాగవతం’లో నారద మహర్షికి...

త్రిగుణాల నుంచి నిర్గుణత్వానికి

సహజయోగ

‘‘సమస్త సృష్టి త్రిగుణాత్మకమైనది. మానవులందరూ వారివారి స్వభావాల రీత్యా సత్వ, రజో, తమో గుణ ప్రధానులుగా విభజన చెందారు’’ అని ‘దేవీ భాగవతం’లో నారద మహర్షికి బ్రహ్మదేవుడు వివరించాడు. వాటిని ‘త్రిగుణాలు’ అంటారు. మన ఆలోచనలను, ప్రవర్తనను, స్వభావాన్ని ఈ గుణాలే నిర్ణయిస్తాయి.

సత్వగుణం పవిత్రతకు, జ్ఞానానికి, శాంతికి చిహ్నం. సత్వగుణం లక్షణాలు... శ్రద్ధ, క్షమ, శాంతి, నిర్మలత్వం, క్రమశిక్షణ, సత్యాన్నే పలకడం, సంతోషంగా ఉండడం. ఈ గుణం ఎక్కువగా ఉన్నవారు ప్రశాంతంగా, స్పష్టమైన ఆలోచనలతో ఉంటారు. రజోగుణం చైతన్యానికి, కోరికలకు, కార్యదక్షతకు, మనలోని క్రియాశక్తికి చిహ్నం, ఇలాంటి వ్యక్తులు అతిగా శ్రమిస్తారు. కీర్తి ప్రతిష్టలను ఆశిస్తారు, ఉద్వేగంతో, చంచల స్వభావంతో ఉంటారు. ఈ గుణం మనిషిని లక్ష్యాల వైపు పరుగులు పెట్టిస్తుంది. కానీ ఇది అశాంతికి కూడా కారణం కావచ్చు. ఇక... తామసిక తత్వం మోహాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. ఇది చీకటి, అజ్ఞానం, అలసత్వం, సోమరితనం, కుటిలత్వం, నిద్ర, ఆలస్యం, అశ్రద్ధ, అయోమయం, వైషమ్యాలకు చిహ్నం. తామస ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారు ఏ పని చేయలేక, జ్ఞానాన్ని పొందలేక వెనుకబడిపోతారు. క్లుప్తంగా చెప్పాలంటే... సాధకుడు తనలోని తమోగుణాన్ని త్యజించి, రజోగుణాన్ని నియంత్రించి, సత్వగుణాన్ని పెంచుకోవడం ద్వారా జ్ఞానమార్గంలో పయనిస్తాడు. మన సూక్ష్మ శరీరంలోని సుషుమ్నా నాడి సత్వగుణాన్ని, ఇడా నాడి తమో గుణాన్ని, పింగళానాడి రజోగుణాన్ని ప్రతిబింబిస్తాయి.

జ్ఞానం అంటే...

సహజయోగంలో సాధకుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు... అతని వెన్నెముకకు దిగువ భాగాన ఉన్న కుండలినీ శక్తి గురు కృప వల్ల జాగృతం అవుతుంది. సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వ ముఖంలో పయనిస్తుంది, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని, సహస్రారాన్ని చేరి... పరబ్రహ్మంతో ఏకత్వం పొందుతుంది. కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రాన్ని దాటినప్పుడు సాధకుడు తాత్కాలికంగా నిర్విచార స్థితిని పొంది, నిరహంకారి అవుతాడు, నిర్గుణుడిగా మారుతాడు. ధ్యానసాధన ద్వారా తనలోని తమో గుణాన్ని పృధ్వీతత్వం ద్వారా, రజోగుణాన్ని ఆకాశ తత్వం ద్వారా తొలగించుకొని సత్వగుణ వ్యక్తిత్వం సంతరించుకుంటాడు. ఈ ధ్యాన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు... కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో ఉన్న అన్ని చక్రాలను శుద్ధి పరుచుకుంటుంది. తద్వారా అతను అరిషడ్వర్గాలను క్రమేణా నియంత్రించుకోగలుగుతాడు. బంధరహితుడై, భక్తి, అంతర్గత జ్ఞానమే తన గమ్యమైన సహజయోగిగా మారుతాడు. జ్ఞానం అంటే పరమాత్మ శక్తి అయిన పరమ చైతన్యంలో ఏకమయ్యే స్థితిని చేరుకోవడమే. దీనికి సహజయోగం దోహదం చేస్తుంది.


సదాశివుడు ఎల్లప్పుడూ నిర్గుణ స్వరూపుడు. త్రిగుణాలకు అతీతుడు. ఆదిశక్తి మాత్రం సమయానుకూలంగా... కార్యనిర్వహణ కోసం సగుణ రూపంలోనూ, సదాశివుని సమక్షంలో నిర్గుణ రూపంలోనూ వ్యక్తమవుతుంది. పరాశక్తే పరమాత్మ, పరమాత్మే పరాశక్తి. వారిద్దరి మధ్యా భేదం లేదు. వాళ్ళు కేవలం జ్ఞాన గమ్యులు. విశ్వమంతా అహంకారకృతం... అంటే సగుణం. మన అంతర్గత సూక్ష్మ శరీరం లో సుషుమ్నా నాడి నిర్గుణతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నిరంహంకారమైన నిర్గుణత్వాన్ని సగుణులు కళ్ళతో చూడడం సాధ్యం కాదు. సర్వ వేదాలను అధ్యయనం చేసినా, సర్వ శాస్త్రాలనూ అభ్యసించినా ఆ దివ్య దర్శనం సులభసాధ్యం కాదు. చిత్తాన్ని నిరహంకారంగా చేసుకోగలిగిన మహాత్ములే ఆ దర్శనం పొందుతారు.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ

నిర్మలాదేవి, సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 15 , 2026 | 04:03 AM