కలల రాణి
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:53 AM
కవ్వించే నయనం... గమ్మత్తయిన గాత్రం... మైమరిపించే దరహాసం... రాణి ముఖర్జీ ట్రేడ్‌మార్క్. అత్యధిక పారితోషికం తీసుకున్న తారగా... టాప్‌లో ట్రెండైన బ్యూటీగా... అభిమానుల...
స్టార్ స్టోరీ
కవ్వించే నయనం... గమ్మత్తయిన గాత్రం... మైమరిపించే దరహాసం... రాణి ముఖర్జీ ట్రేడ్‌మార్క్. అత్యధిక పారితోషికం తీసుకున్న తారగా... టాప్‌లో ట్రెండైన బ్యూటీగా... అభిమానుల హృదయ స్పందనగా... ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన కలల ‘రాణి’... పరిశ్రమలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు. ఆమె సుదీర్ఘ ప్రయాణంలో... మరిచిపోలేని మజిలీలు, మాటలకందని భావాలు, భావోద్వేగాలు ఎన్నో.
ఈ ఏడాది రాణి ముఖర్జీకి చాలా ప్రత్యేకం. ఆమె పరిశ్రమలోకి వచ్చి ముప్ఫై ఏళ్లు. ‘రాజా కీ ఆయేగీ బారాత్’తో 1996లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాణి... ఆ తరువాత అద్భుతమైన చిత్రాలతో... ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో పరిశ్రమలో ధృవతారగా ఎదిగారు. విశేషం ఏమిటంటే... 47 ఏళ్ల ఆమె జీవితంలో మూడు దశాబ్దాలు సినీ ప్రయాణంలోనే గడిచిపోయాయి. ముంబయిలో పుట్టిన రాణి తల్లి కృష్ణ ముఖర్జీ గాయని. తండ్రి రామ్ ముఖర్జీ దర్శకుడు, ‘ఫిల్మాలయా స్టూడియో’ సహవ్యవస్థాపకుడు. అన్నయ్య రాజా ముఖర్జీ దర్శకనిర్మాత. ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్, నటి దేబశ్రీ రాయ్, దర్శకుడు, రచయిత అయాన్ ముఖర్జీ రాణికి బంధువులు. పరిశ్రమతో అనుబంధంగలవారు కుటుంబంలో ఇంతమంది ఉన్నా... తను మాత్రం సినిమాల్లోకి రావాలని కోరుకోలేదు. ఎందుకని అడిగితే... ‘ఇప్పటికీ చాలామంది నటులు మా ఇంట్లో ఉన్నారు. నేను వేరే ఏదైనా రంగంలోకి వెళతా’ అనేవారు చిన్నప్పుడు.
ఒకే రోజు రెండు చిత్రాలు...
ముంబయిలోని ‘మనేక్‌జీ కూపర్ హైస్కూల్’లో చదివిన రాణి... ‘ఎస్‌ఎన్‌డీటీ మహిళ విశ్వవిద్యాలయం’ నుంచి హోమ్‌సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. పదో తరగతి నుంచే ఒడిస్సీ నాట్యం అభ్యసించారు. తల్లి ప్రోద్బలంతో యాక్టింగ్ కోర్సులో చేరిన ఆమె... ఒకేసారి హిందీ, బెంగాలీ చిత్రాల్లో కథానాయికగా అవకాశాలు దక్కించుకున్నారు. ఈ రెండూ ఒకే రోజు విడుదల అయ్యాయి. పరిశ్రమలోకి వచ్చిన రెండేళ్లకు కానీ రాణికి హిట్ దక్కలేదు. ఆమిర్‌ఖాన్‌తో చేసిన ‘గులామ్’ ఆమెకు తొలి విజయం. అందులో చిన్న పాత్రే అయినా ‘ఆతీ క్యా ఖండాలా’ పాట రాణిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. 1998లో విడుదలైన ‘కుచ్ కుచ్ హోతా హై’ ఆమె సినీ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. వాస్తవానికి ట్వింకిల్ ఖన్నాతో పాటు మరికొంతమంది నాటి టాప్ హీరోయిన్లు ఆ పాత్రకు నో చెప్పారు. హీరో షారూక్‌తో పాటు దర్శకుడు కరణ్ జోహార్, నిర్మాత ఆదిత్య చోప్రా అడగడంతో చివరకు రాణి ఓకే అన్నారు. ఆ చిత్రం భారీ హిట్ అవ్వడమే కాదు, ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది.
రొటీన్‌కు దూరంగా...
‘కుచ్ కుచ్ హోతా హై’ తరువాత వరుస అపజయాలు చవిచూసిన రాణి ముఖర్జీ... ఇకపై సగటు హిందీ కథానాయికలా రొటీన్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. సవాళ్లు విసిరే, నటనకు అవకాశం ఉండే రోల్స్‌ను ఎంచుకున్నారు. అలా వచ్చినవే ‘బాదల్, బిచూ, హేరామ్, కభీ ఖుషీ కభీ గమ్’ తదితర చిత్రాలు. జయాపజయాలతో సంబంధం లేకుండా సాగిన రాణి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు. విజయానికి పొంగిపోలేదు. అపజయానికి కుంగిపోలేదు. వచ్చినవాటిలో నచ్చినవి చేసుకొంటూ ఇన్నేళ్లుగా పరిశ్రమలో ప్రయాణిస్తున్న ఆమె ఎనిమిది ఫిలిమ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. 2023లో విడుదలైన ‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’కు ‘ఉత్తమ నటి’గా జాతీయ పురస్కారం అందుకున్నారు. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ చైర్మన్, దర్శకనిర్మాత ఆదిత్య చోప్రాతో కొంతకాలం ప్రేమాయణం నడిపిన రాణి... 2014లో ఆయన్ను పెళ్లి చేసుకున్నారు. మరుసటి ఏడాది కుమార్తె అదిరాకు జన్మనిచ్చారు. ‘నా జీవితంలోనే అత్యంత సంతోషకర సమయం మాతృత్వం’ అంటూ నాడు చెప్పారు.

ఆమిర్ నో... కరణ్ యస్...
కరణ్ జోహార్ షోలో రాణి... నాడు ఆమిర్‌ఖాన్ నిర్ణయంవల్ల తన మనసు ఎంత గాయపడిందో చెప్పుకొచ్చారు. ‘‘గులామ్’ షూటింగ్ సమయంలో నా గొంతు ఆ సినిమాకు సరిపోదని, వేరేవారు డబ్బింగ్ చెబుతారని ఆమిర్‌ఖాన్ అన్నారు. ఆ నిర్ణయం నన్ను తీవ్రంగా బాధపెట్టింది. కానీ సెట్‌లో అది కనిపించనీయలేదు. ఎందుకంటే... సినిమాలో భాగమైనప్పుడు ఒక జట్టు సభ్యురాలిగా వ్యవహరించాలి. వ్యక్తిగత నిరాశలు ఉన్నప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం వాటిని పక్కనపెట్టి పని చేయాలి’’ అంటూ రాణి భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ‘కుచ్ కుచ్ హోతా హై’లో కరణ్ ఆమెతోనే డబ్బింగ్ చెప్పించారు. ‘నీ గొంతు నాకు చాలా ఇష్టం’ అంటూ నాడు కరణ్ అన్న మాటలను రాణి గుర్తు చేసుకున్నారు. తరువాత ఆ గొంతే ఎన్నో గమ్మత్తులు చేసింది. కోట్లమంది అభిమానులను మైమరిపించింది.
‘చాలా బాధపడ్డా’...
ప్రస్తుతం ‘మర్దానీ 3’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రాణి ఇటీవల కరణ్ జోహార్ షోలో తన అనుభవాలను పంచుకున్నారు. ‘బ్లాక్’లో నటనకు జాతీయ అవార్డు దక్కకపోవడం తనను కుంగదీసిందన్నారు. ‘‘ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన అమితాబ్‌బచ్చన్‌కు, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి అవార్డులు వచ్చాయి. నాకు రాకపోవడం నన్ను తీవ్రంగా బాధించింది. నన్ను ఉత్తమ నటిగా చూడాలన్న మా అమ్మానాన్నల హృదయాలు గాయపడ్డాయి. వాళ్ల ప్రోత్సాహం, కోరికతోనే నేను నటిని అయ్యాను. వాళ్ల కలను నిజం చేసి, వారికి ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చి, సంతోషంగా ఉంచాలనుకున్నాను. అందుకే సినిమాలు చేస్తూవచ్చాను’’ అంటూ చెప్పుకొచ్చారు. ‘‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’ నా కలను నిజం చేసింది. మూడు దశాబ్దాల నా సినీ ప్రస్థానంలో ఉత్తమ నటిగా తొలి జాతీయ అవార్డు అందుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవార్డు నాకు ప్రపంచాన్ని జయించిన అనుభూతినిచ్చింది. దీన్ని మా దివంగతులైన మా నాన్నకు అంకితవిస్తున్నాను. ఆయన స్ఫూర్తి, ఆశీస్సులతోనే ఇది సాధ్యమైంది’’ అని నాడు అవార్డు అందుకున్న సందర్భంగా రాణి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
Read Latest Telangana News And Telugu News