అల్ర్టా రన్‌లో అదరగొట్టారు
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:07 AM
మట్టి రోడ్లు... కొండ కొనలు... ఇరవై వేల అడుగుల ఎత్తులో... నిటారుగా ఉన్న పర్వత మార్గాల ద్వారా సాగే పరుగు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అల్ర్టా రన్‌గా చెప్పుకొనే ‘బ్రెజిల్ 135’ను...
సంకల్పం
మట్టి రోడ్లు... కొండ కొనలు... ఇరవై వేల అడుగుల ఎత్తులో... నిటారుగా ఉన్న పర్వత మార్గాల ద్వారా సాగే పరుగు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన అల్ర్టా రన్‌గా చెప్పుకొనే ‘బ్రెజిల్ 135’ను విజయవంతంగా పూర్తి చేశారు పూజా కృష్ణమూర్తి. రెండు దశాబ్దాలు పైబడిన మారథాన్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచారు. ఆ అనుభవాలు... దానికి సన్నద్ధమైన తీరు... ఆమె మాటల్లోనే...
‘‘జనవరి పది... నా జీవితంలో ఒక చరిత్రాత్మక రోజు. అసాధ్యమనుకున్నది సాధించిన రోజు. ‘బ్రెజిల్ 135 అలా్ట్ర’ను విజయవంతంగా పూర్తి చేసిన రోజు. ఇలాంటి ఘట్టం ఒకటి నా జీవన ప్రయాణంలో ఉంటుందని ఎన్నడూ ఊహించలేదు. విశేషమేంటంటే... నేను కోరి రన్నర్‌ను కాలేదు. అసలు బ్రెజిల్ పరుగు నా ప్రణాళికల్లోనే లేదు. అన్నీ అలా జరిగిపోయాయంతే. కానీ ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను... కృషికి పట్టుదల తోడైతే అసాధ్యమన్నది లేదని. భారత ఆర్థిక రాజధాని ముంబయి మాది. సెయింట్ జేవియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చదివాను. తరువాత సినీ రంగంపై మక్కువతో ఫిలిమ్ మేకింగ్ కోర్సు చేశాను. కొంత కాలం ఓ వాణిజ్య ప్రకటనల సంస్థలో ఉద్యోగం.
చిన్ననాటి అభిరుచి...
అయితే నాకు చిన్నప్పటి నుంచి పర్వతారోహణపై మక్కువ. నా ఆసక్తిని మా అమ్మ గమనించి... నన్ను, మా అక్క ప్రియను మౌంటెనీరింగ్ శిక్షణలో చేర్పించింది. ఆ తరువాత నుంచి మేం తరచూ హిమాలయాలకు వెళ్లడం మొదలుపెట్టాం. అమ్మ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేది. వయసుతోపాటు ట్రెక్కింగ్ అనుభవాలూ పెరుగుతూ వచ్చాయి. నాకైతే ఒక అభిరుచిగానే కాకుండా... జీవితంలో ఒక భాగం అయిపోయింది. నాలాంటి ఔత్సాహికులకు మార్గదర్శకులుగా వ్యవహరించడం, వారిని వెంటబెట్టుకొని పర్వతారోహణకు తీసుకువెళ్లడం... కొన్నేళ్లు ఇదే మా అక్కచెల్లెళ్ల ఉద్యోగం అయిపోయింది. దీనివల్ల తెలియకుండానే నాకు నాయకత్వ లక్షణాలు అబ్బాయి. శరీరం ఎంతో దృఢంగా మారింది.

అనుకోకుండా అలా...
అది 2011. మా అక్కకు తోడుగా ఉండటం కోసం నేను కూడా హాఫ్ మారథాన్‌కు పేరు నమోదు చేసుకున్నా. అప్పటివరకు నాకు అందులో అనుభవం లేదు. ఏకధాటిగా అన్ని కిలోమీటర్లు ఎప్పుడూ నడిచిందీ లేదు. అలా అనుకోకుండా పరుగు మొదలైంది. ఇక ఆ రోజు నుంచీ స్థానికంగా మారథాన్ జరిగితే వదిలిపెట్టలేదు. ఆరంభంలో పది కిలోమీటర్ల రేస్‌లకే పరిమితమయ్యాను. రణగొణ ధ్వనుల నుంచి ఉపశమనం పొందడానికి వారాంతాల్లో నగరానికి దూరంగా వెళ్లే ఉద్దేశంతో రేస్‌ల్లో పాల్గొనేదాన్ని. ఏడెనిమిదేళ్లు అలా గడిచిపోయాయి. రన్నింగ్‌ను ఒక అభిరుచిలాగానే కాకుండా, సవాలుగా తీసుకోవాలని అనుకున్నాను. దానికోసం వ్యక్తిగత కోచ్‌ను నియమించుకున్నాను. శిక్షణ మొదలుపెట్టాను. హాఫ్ మారథాన్ (21 కి.మీ.)లో పోటీపడ్డాను. ఎంతో ఉత్సాహంగా సాగిపోతోంది కెరీర్. అదేసమయంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో రన్నింగ్‌కు బ్రేక్ పడింది.
రెండేళ్ల తరువాత...
రెండేళ్ల విరామం తరువాత 2022లో మళ్లీ రన్నింగ్ మొదలుపెట్టాను. నా ఫిట్‌నె్‌సను తిరిగి సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడాల్సివచ్చింది. అయితే నా కోచ్ అదిల్ మిర్జా అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే ‘బ్యాడ్‌వాటర్’కు అర్హత సాధించాడు. మండే ఎండల్లో మన సామర్థ్యానికి పరీక్ష పెట్టే 135 మైళ్ల అల్ర్టామారథాన్ అది. నాకు యూఎస్ వీసా ఉండటంతో అతడి సహాయక బృందం సభ్యురాలిగా వెళ్లాను. ఆ సమయంలో నా సామర్థ్యం చూసిన అదిల్... ‘హాఫ్ మారథాన్‌లు ఎందుకు చేస్తున్నావు? నువ్వు అల్ర్టారన్నర్‌వి’ అంటూ ప్రశంసించాడు. ఆ ప్రశంస నా ఆలోచననే కాదు, నా జీవితాన్నే మార్చేసింది.
మలుపు తిప్పిన పయనం...
కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన అమెరికన్ రన్నర్ సోనియా అహూజాను కలిశాను. తను ‘బ్రెజిల్ 135 అల్ర్టారన్’ విన్నర్. ‘బ్యాడ్‌వాటర్’ పూర్తి చేసిన అనుభవం. ఆమెతో పరిచయం నన్ను మరో ఎత్తుకు తీసుకువెళ్లింది. కోచ్, సోనియా సలహాలు, సూచనలతో ముందుగా ‘బ్రెజిల్ 135’కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అయితే అప్పటివరకు నేను ఫుల్ మారథాన్ పరుగెత్తలేదు. అలాంటిది కఠినమైన బ్రెజిల్ మారథాన్‌ను ఎలా పూర్తి చేస్తావని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. అవేవీ పట్టించుకోలేదు. ఎందుకంటే ట్రెక్కింగ్‌వల్ల నా కండరాలు దృఢంగా మారాయి. పరుగులోనూ అనుభవం ఉంది. కావల్సిందల్లా సరైన మార్గదర్శనం. అందుకు వీరిద్దరూ ఉన్నారు. ఆ ధైర్యంతోనే రెండేళ్ల కిందట లద్దాక్, అనంతరం పుణే మారథాన్‌లలో పాల్గొన్నాను.
ఏదైనా సాధ్యమే...
ఫుల్ మారథాన్‌లు పూర్తి చేసిన నేపథ్యంలో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. దాంతో ఈ నెల 10న జరిగిన ‘బ్రెజిల్ 135 అల్ర్టామారథాన్’కు వెళ్లాను. 135 అనేది పరుగెత్తే దూరం... మైళ్లలో. అంటే 217 కిలోమీటర్లు. ఈ మార్గమంతా కొండ ప్రాంతాల మీదుగా సాగుతుంది. ఎంతో కఠినంగా ఉంటుంది. మన శక్తిసామర్థ్యాలకు అసలైన పరీక్ష. అరవై గంటల్లో పూర్తి చేయాలి. కానీ నేను 48 గంటల్లోనే ముగించాను. మొత్తంగా చూస్తే ఆరో స్థానంలో నిలిచాను. కానీ మహిళల్లో మొదటి స్థానం నాదే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళను నేనే అని తెలిశాక నా ఆనందానికి హద్దులు లేవు. ఎంతో గర్వంగా అనిపించింది. దీంతోపాటు మహిళను సాధికారత వైపు అడుగులు వేయించేందుకు నా వంతు బాధ్యత తీసుకున్నాను. అందుకోసం ఒక ఎన్‌జీఓతో కలిసి పని చేస్తున్నాను. మారథాన్ సందర్భంగా నా గళం వినిపించాను.’’
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News