పోరాటమే పరమార్థం
ABN , Publish Date - May 15 , 2026 | 04:07 AM
చాలా వేగంగా సాగిపోతున్న నేటి ప్రపంచంలో మానవులు దాదాపు ప్రతి విషయంలోనూ అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే... మనం తక్షణ ఉపశమనాన్ని, తక్షణమైన విజయాన్ని...
యోగా
చాలా వేగంగా సాగిపోతున్న నేటి ప్రపంచంలో మానవులు దాదాపు ప్రతి విషయంలోనూ అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే... మనం తక్షణ ఉపశమనాన్ని, తక్షణమైన విజయాన్ని, తక్షణ గుర్తింపు కోరుకుంటున్నాం. ఆధ్యాత్మిక అనుభవాలు కూడా తక్షణం లభించాలనుకుంటున్నాం. ప్రతిదానికీ తొందరపడాలని ఆధునిక జీవనం మనకు నేర్పుతోంది. కానీ... ప్రతిదానికీ ఒక ఋతువు ఉంటుందనీ, ఆ కాలంలోనే అది వికసిస్తుందనే శాశ్వతమైన సత్యాన్ని ప్రకృతి మన చెవుల్లో గుసగుసలాడుతుంది. శరీరానికి స్వస్థత చేకూరడం కావచ్చు, హృదయం కోలుకోవడం కావచ్చు, బిడ్డ పుట్టడం కావచ్చు, ఆత్మ జాగృతిని పొందడం కావచ్చు... దేనికైనా తగిన సమయం చాలా ముఖ్యం.
సీతాకోకచిలుక కథ...
సీతాకోక చిలుక తన చుట్టూ ఉన్న కోశం (గూడు) నుంచి బయటకు రావడానికి కష్టపడుతూ ఉంటే... చూసిన ఒక పిల్లవాడి కథ నాకు తరచుగా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ చిన్న జీవి చిన్న రంధ్రంలోనుంచి బయటకు రావడానికి ఎంతో శ్రమ పడుతోంది. అది చూసిన బాలుడికి జాలి కలిగింది. దానికి సాయం చేయాలనే ఆలోచనతో... ఒక చిన్న బ్లేడ్ తీసుకొని ఆ కోశాన్ని మెల్లగా కోశాడు. సీతాకోకచిలుక వెంటనే బయటికొచ్చింది. కానీ ఊహించని విషయం ఒకటి జరిగింది. దాని శరీరం ఉబ్బిపోయి, బరువుగా మిగిలిపోయింది. దాని రెక్కలు బలహీనంగా, ముడుచుకుపోయి ఉన్నాయి. ఇక ఆ సీతాకోకచిలుక ఎగరడం నేర్చుకోవడం ఎన్నటికీ సాధ్యంకాదు. కొంతసేపు తననుతాను బాధగా ఈడ్చుకుంటూ వెళ్ళింది. చివరకు మరణించింది. ఆ బాలుడికి ఆ తరువాత మాత్రమే ప్రకృతిలోని లోతైన జ్ఞానం అర్థమయింది. ఆ కోశంలోని ఇరుకైన మార్గం క్రూరత్వం కాదు,.. ఒక సన్నాహం. సీతాకోకచిలుక అలా పోరాటం చేసినప్పుడే దాని శరీరంలోని ద్రవాలు దాని రెక్కలలోకి చేరుతాయి. అది ఎగరడానికి కావలసిన శక్తినీ, సమతుల్యతనూ అందిస్తాయి. ఆ పోరాటం లేకపోతే అది ఎగరడం సాధ్యం కాదు. ఇది మానవ జీవితాన్ని చాలా లోతుగా ప్రతిబింబించే ఉదాహరణ.
అసహనమే అవరోధం....
అదే విధంగా, ఆధ్యాత్మికమైన ఎదుగుదలను కూడా బలవంతం చేయకూడదు. ఈ రోజుల్లో చాలామంది సాధకులు తక్షణ జ్ఞానోదయాన్ని, శీఘ్రమైన అతీంద్రియ అనుభవాలను, వేగంగా శాంతిని కోరుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికత అనేది యాంత్రికమైన విజయం కాదు. అది చైతన్యం తాలూకు సహజసిద్ధమైన వికాసం. ఒక విత్తనం చెట్టుగా మారడానికి మట్టి అడుగున చీకటి ఎలా అవసరమో... ఆత్మకి కూడా అంతే. అది నిశ్శబ్దం, గందరగోళం, నిరీక్షణ, శుద్ధికావడం లాంటి వివిధ దశల్లోంచి ప్రయాణిస్తుంది. అటువంటి క్షణాల్లో... అసహనం మనకు అతి పెద్ద అవరోధంగా మారుతుంది. ‘హార్ట్‌ఫుల్‌నెస్’ సాధన మనకు ‘అంతర్గత నిరీక్షణ’ అనే కళను బోధిస్తుంది. ఆ నిరీక్షణ నిష్ర్కియమైనది కాదు. సహనంతో కూడిన విశ్వాసం. ధ్యానం, శుద్ధి, ప్రార్థనల ద్వారా భావోద్వేగ సమతుల్యతను, అంతర్గత సామరస్యాన్ని నెమ్మదిగా పెంపొందించుకోగలం. అప్పుడు, పరిస్థితుల మీద హింసాత్మకంగా ప్రతిస్పందించడాన్ని మనసు మానుకుంటుంది. కష్టాలను ఎదిరించడానికి బదులు... వాటిని ఆమోదంతో, పరిణతితో గ్రహించడం ప్రారంభిస్తాం. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం ఆమోదించినప్పుడు పరివర్తన ప్రారంభమవుతుందని సాధకులకు దాజీ తరచుగా గుర్తుచేస్తూ ఉంటారు. ధ్యానం అనేది బాహ్యమైన కష్టాలను అన్నిసార్లూ తొలగించదు. కానీ వాటిని మనం అనుభవించే తీరును మారుస్తుంది. బయట తుపాన్లు కొనసాగవచ్చు, కానీ అంతర్గతమైన అలజడి నెమ్మదిగా సద్దుమణుగుతుంది. ప్రశాంతత పొందిన హృదయం... నిరాశ లేకుండా వేచి ఉండడానికి, చేదు అనుభవం లేకుండా సహించడానికి అవసరమైన సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది.
స్వస్థతకు తనదైన ఒక పవిత్రమైన లయ ఉంది. గుండె జబ్బు నుంచి కోలుకుంటున్న వ్యక్తి రాత్రికి రాత్రి పూర్తి బలాన్ని పొందలేడు. అతనిలోని కణజాలం బాగుపడడానికి, మందులు పని చేయడానికి, భావోద్వేగాలు నెమ్మదించడానికి కొంత సమయం పడుతుంది. కోలుకొనే దశలో అసహనానికి గురైతే... స్వస్థతను ఆ ఆందోళన ఇంకా ఆలస్యం చేస్తుంది. ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు, కానీ ప్రతిదీ పూర్తవుతుంది. బిడ్డ పుట్టుక కూడా ఈ జ్ఞానాన్ని మరింత లోతుగా నేర్పుతుంది. ఒక తల్లి నెలల తరబడి పోషణ పొంది, తీవ్రమైన ప్రసవవేదన అనుభవించి ఒక బిడ్డను ఈ లోకంలోకి తీసుకువస్తుంది. ప్రసవ వేదన అర్థంలేని బాధ కాదు, జీవితం కోసం సిద్ధంకావడంలో అదొక భాగం.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్
ట్రైనర్ హార్ట్‌ఫుల్‌నెస్, 9440087532
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News