Share News

శిథిలానికి సజీవ రూపం

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:20 AM

శిథిలమైపోయిన ఆలయ శిఖరాలు, గోపురాలు, స్మారక కట్టడాలను చూసినప్పుడు వాటి పూర్తి నిజ రూపాన్ని కొంత మేరకు ఊహించుకుని సంతృప్తి పడుతూ ఉంటాం! అయితే...

శిథిలానికి సజీవ రూపం

విభిన్నం

శిథిలమైపోయిన ఆలయ శిఖరాలు, గోపురాలు, స్మారక కట్టడాలను చూసినప్పుడు వాటి పూర్తి నిజ రూపాన్ని కొంత మేరకు ఊహించుకుని సంతృప్తి పడుతూ ఉంటాం! అయితే మహారాష్ట్రకు చెందిన కళాకారిణి పర్ణవి బాంగర్‌... చారిత్రక సమాచారం, సాహిత్యాల ఆధారంగా వాటి నిజరూపాన్ని అంచనా వేసి, సృజనాత్మక రేఖాచిత్రాలుగా పునఃసృష్టిస్తున్నారు. తన కళాత్మక ప్రయాణం గురించి ఆమె ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.

చిత్రలేఖనం నా అభిరుచి. ఈ అభిరుచితో ఫైన్‌ ఆర్ట్స్‌లోకి ప్రవేశించాలనుకున్నాను. కానీ అనుకోకుండా ఆర్కిటెక్చర్‌ రంగంలోకి ప్రవేశించాను. ఆ రంగంలో కొనసాగుతున్న సమయంలో ఒక సందర్భంలో హంపి సందర్శించాను. అక్కడ కనిపించిన శిథిల నిర్మాణాలను చూసినప్పుడు, ఈ నిర్మాణ నిజ రూపం ఇలా ఉండి ఉండొచ్చని నా కుటుంబ సభ్యులకు వివరించడం మొదలుపెట్టాను. ఆ కట్టడాల నిజ పరిమాణాన్ని నేను స్పష్టంగా ఊహించుకోగలుగుతున్నా వాళ్లు మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. దాంతో వాళ్లకు బొమ్మ గీసి చూపించాను. నేను ఎంచుకోవలసిన రంగం ఆర్కిటెక్చర్‌ కాదనీ, సృజనాత్మక పునరుద్ధరణ రంగమనే విషయం ఆ క్షణమే అర్థమైంది. అలా అప్పటి నుంచి పునరుద్ధరణ చిత్రాలు గీయడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో 2021లో మొట్టమొదటి ప్రాజెక్టులో భాగంగా హంపిని ఎంచుకున్నాను. అక్కడున్న శిథిలమైన 21 స్మారక చిహ్నాలను ఇలస్ట్రేషన్స్‌తో పునఃసృష్టించాను. రాయగడ్‌లో ఇలాంటి శిథిల నిర్మాణాలకు సంబంధించి 9 ఇలస్ట్రేషన్స్‌ రూపొందించాను. ఇలా గత ఐదేళ్లుగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోని శిథిల నిర్మాణాలను పునఃసృష్టిస్తున్నాను.

లోతైన పరిశోధనతో...

ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల అనేక చారిత్రక కట్టడాలు ధ్వంసమైపోతూ ఉంటాయి. అలాంటి నిర్మాణాల పూర్తి రూపాలను ఊహించుకోవడం సులభమే! కానీ ఆయా ప్రాంతాల ప్రత్యేకత, చరిత్రల గురించిన అవగాహన లేకుండా వాటి అసలు రూపాలను అంచనా వేయడం అసాధ్యం. ఇందుకోసం ఎంతో మంది చరిత్రకారులు, వాస్తుశిల్పులను కలిశాను. గ్రంథాలయాల్లో చారిత్రక పుస్తకాలు, పరిశోధనా పత్రాలను పరిశోధించాను. అలాగే అందుబాటులో ఉన్న ఆర్కైవల్‌ ఇమేజె్‌సను కూడా పరిశీలించాను. గత ఏడాది ‘రిమినిసింగ్‌ హిస్టరీ’ అనే లాభాపేక్షలేని, ఆర్కిటెక్చర్‌ ఫర్మ్‌ను కూడా స్థాపించాను. ఈ వేదిక ద్వారా నాతో కలిసి పని చేయాలనుకునే పురావస్తు శాస్త్రవేత్తలు, వాస్తుశిల్పుల సహకారంతో మరిన్ని శిథిల కట్టడాలను పునఃసృష్టించాలని ఆశిస్తున్నాను. ఇప్పటివరకూ రూపొందించిన రేఖా చిత్రాలను లివింగ్‌ టెంపుల్‌ ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శించాను.


6-navya.jpg

డిజిటల్‌ రూపాల్లో...

నేను గీసే ఇలస్ట్రేషన్స్‌ ఆధారంగా కట్టడాలను పునర్నిర్మించడం సాధ్యపడదు! ఆ ప్రాచీన నిర్మాణాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. కాబట్టి వాటిని పునర్నిర్మించడం క్లిష్టం. భౌతికంగా పునర్నిర్మించలేని ఆ కట్టడాలను డిజిటల్‌గా పునర్నిర్మించుకునే వీలుంది. కాబట్టి ఈ డిజిటల్‌ రూపాలను అందరూ చూడగలిగే అవకాశం కల్పించాలంటూ పర్యాటక శాఖ, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలను సంప్రతించాను. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ఆలయాల్లో త్రీడి మోడల్స్‌, వర్చువల్‌ రియాలిటీలు ఎంతో బాగా అభివృద్ధి చెందాయి. కాబట్టి అదే విధంగా ఇలస్ట్రేషన్స్‌ ప్రదర్శన ద్వారా ఆయా కట్టడాల నిజరూపాన్ని, విశిష్టతనూ ప్రజలకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. నేను రూపొందించిన రిమినిసింగ్‌ హంపి పుస్తకంలో పారదర్శక రేఖాచిత్రాలున్నాయి. వాటి ద్వారా ఆలయాలు, గోపురాల నిజ రూపాన్ని కళ్లారా చూడవచ్చు.

సవాళ్లకూ కొదవ లేదు

ఇప్పటివరకూ హంపి, రాయ్‌గడ్‌, సారానాథ్‌లలో అనేక శిథిల నిర్మాణాలను పునఃసృష్టించాను. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన ప్రాంతాలే! తెలిసిన కట్టడాలే! కానీ అంతగా ప్రాచుర్యం లేని, నిర్లక్ష్యానికి గురైన శిథిల కట్టడాలు, ఆలయాలు, స్మారక చిహ్నాలను సందర్శించి వాటిని కూడా పునఃసృష్టించి, గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అయితే హంపి లాంటి సుప్రసిద్ధ ప్రాంతంతో పోల్చితే ఇతరత్రా ఆదరణకు నోచుకోని అనేక ఆలయాలు, స్మారక చిహ్నాల వివరాలను సేకరించడం కష్టంగా మారుతోంది. గ్రంథాలయాలు మూత పడడం, ఆర్కైవల్‌ ఇమేజెస్‌ కలిగిన పుస్తకాలను డిజిటల్‌ రూపంలో అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్ల శిథిల కట్టడాల పునఃసృష్టి అంకంతకూ క్లిష్టమైపోతోంది. వృత్తిలో నేనెదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇది. భవిష్యత్తులో పాత వాడలను డాక్యుమెంట్‌ చేసి, వాటి సంరక్షణకు కృషి చేయాలనుకుంటున్నాను.

గోగుమళ్ల కవిత

మాది ముంబైలోని థాణె. నవీ ముంబయిలోని భారతీయ విద్యాపీఠంలో ఆర్కిటెక్చర్‌ చదువుకున్నాను. నాన్న శ్రీకాంత్‌ బాంగర్‌, అమ్మ రాజశ్రీ బాంగర్‌ ఇద్దరూ ప్రభుత్వోద్యోగులుగా రిటైర్‌ అయ్యారు. ఇద్దరూ నా అభిరుచిని ఎంతో బాగా ప్రోత్సహించారు. నా తమ్ముడు చిన్మయానంద్‌ బాంగర్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. నేనిప్పటివరకూ హంపిలోని విజయవిఠల ఆలయంలో గోపురం, రాతి రథంలోని విమానాలను పునరుద్ధరించాను. అలాగే తమిళనాడులో మూడు ఆలయాల పునరుద్ధరణ చిత్రాలను రూపొందించాను. నేపాల్‌, కాశ్మీర్‌, రాయగడ్‌ కోట, ఆంగ్కర్‌వాట్‌, తమిళనాడు, లేపాక్షి, సారానాథ్‌లలోని స్మారక చిహ్నాలకు రేఖాచిత్రాల రూపాన్నిచ్చాను.

ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:20 AM