50 ఏళ్లు దాటితే?
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:07 AM
50 ఏళ్లు దాటిన ప్రతి మహిళా కొన్ని పోషక లోపాలను ఎదుర్కొంటూ ఉంటుంది. వాటి ఫలితంగా తలెత్తే ఒళ్లు నొప్పులు, నిస్సత్తువలను పైబడే వయసుకు...
50 ఏళ్లు దాటిన ప్రతి మహిళా కొన్ని పోషక లోపాలను ఎదుర్కొంటూ ఉంటుంది. వాటి ఫలితంగా తలెత్తే ఒళ్లు నొప్పులు, నిస్సత్తువలను పైబడే వయసుకు ఆపాదించే మహిళలే ఎక్కువ. కానీ ఈ నడి వయసు పోషక లోపాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోగలిగినప్పుడే, చురుగ్గా పనులన్నీ చేసుకోగలుగుతారు.
ఐరన్: భారతీయ మహిళల్లో అత్యంత సాధారణ పోషక సమస్య ఇది. మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసపడుతున్నా, జుట్టు ఊడిపోతున్నా, చర్మం పాలిపోయినా ఐరన్ లోపంగానే భావించాలి. ఐరన్ లోపిస్తే, కండరాలకు, మెదడుకూ అందే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయి, శక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి ఐరన్ పుష్కలంగా దొరికే పాలకూర, బీట్‌రూట్‌లు ఎక్కువగా తినాలి. వీటిలోని ఐరన్‌ను శరీరం సమర్థంగా శోషించుకోవడం కోసం వాటికి విటమిన్ సి జోడించాలి
క్యాల్షియం: మెనాపాజ్ తర్వాత క్యాల్షియం శోషణ క్షీణిస్తుంది. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, కాళ్ల నొప్పులు వేధిస్తాయి. గోళ్లు పెళుసుగా మారిపోతాయి. చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరుగుతాయి. ఈ వయసులో ఎముకలు నిశ్శబ్దంగా సాంద్రతను కోల్పోతూ ఉంటాయి. కాబట్టి రాగులు, నువ్వుల విత్తనాలు, పన్నీర్‌లను ప్రతి రోజూ తీసుకుంటూ ఉండాలి. ఉదయం శరీరానికి ఎండ సోకేలా చూసుకోవాలి
విటమిన్ బి12: 50 శాతానికి పైగా భారతీయుల్లో విటమిన్ బి12 లోపం కనిపిస్తోంది. శాకాహారుల్లో ఈ సమస్య ఎక్కువ. చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, చేతుల్లో, పాదాల్లో తిమ్మిర్లు, నిరంతర అలసట విటమిన్ బి 12 లోపం లక్షణాలే! ఈ సమస్యను పరిష్కరించకపోతే నాడీ నష్టం జరగవచ్చు. డిమెన్షియా లక్షణాలు పెరగవచ్చు. కాబట్టి ప్రతి రోజూ పాల ఉత్పత్తులు లేదా పులిసిన పదార్థాలు తీసుకోవాలి. కొందరికి సప్లిమెంట్లు అవసరమవుతాయి
విటమిన్ డి: 75 శాతానికి పైగా భారతీయ మహిళల్లో విటమిన్ డి లోపం కనిపిస్తోంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, నిరంతర నీరసం ప్రధాన లక్షణాలు. ఈ విటమిన్ తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడతాయి, వ్యాధినిరోధకశక్తి కుంటుపడుతుంది. కాబట్టి ఉదయం వేళ కనీసం 20 నిమిషాల పాటు ఎండకు బహిర్గతం కావాలి. అవసరాన్ని బట్టి సప్లిమెంట్లు వాడుకోవాలి
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News