Share News

ఏఏఐ బోర్డులో ‘ఆమె’

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:44 AM

సంకల్పం ఆకాశమంత ఎత్తుంటే.. విజయం దానంతట అదే దాసోహమంటుంది. మూడు దశాబ్దాల క్రితం ఒక సాధారణ మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ప్రయాణం మొదలుపెట్టి... నేడు...

ఏఏఐ బోర్డులో ‘ఆమె’

సంకల్పం ఆకాశమంత ఎత్తుంటే.. విజయం దానంతట అదే దాసోహమంటుంది. మూడు దశాబ్దాల క్రితం ఒక సాధారణ మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ప్రయాణం మొదలుపెట్టి... నేడు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బోర్డ్‌ తొలి మహిళా మెంబర్‌గా చరిత్ర సృష్టించిన నివేదిత దూబే స్ఫూర్తిగాధ ఇది.

భారతదేశ విమానాయన రంగం నేడు శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించే ‘ఏఏఐ’ బోర్డులో తాజాగా ఒక చరిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. జనవరి 30న ఏఏఐ బోర్డ్‌ మెంబర్‌ (హ్యూమన్‌ రిసోర్సె్‌స)గా బాధ్యతలు చేపట్టిన నివేదిత దూబే ఈ పదవిని అధిష్ఠించిన తొలి మహిళగా రికార్డులకెక్కారు.

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ నుంచి

నివేదిత ప్రస్థానం 1995లో ఒక సాధారణ మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ప్రారంభమైంది. 30 ఏళ్ల క్రితం ఏఏఐలో అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌గా ఆమె చేసిన సేవలు ఎంతో కీలకమైనవి. గడ్డు పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని తట్టుకుంటూ భారీ బృందాలను నడిపించడంలో ఆమె దిట్ట అని పేరు తెచ్చుకున్నారు.

నివేదిత దూబే కేవలం కార్యాలయానికే పరిమితం కాలేదు. రీజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా (ఈస్ట్రన్‌ రీజియన్‌) పనిచేసిన కాలంలో పట్నా, పూర్ణియా వంటి విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్‌ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి తన మార్కు చూపించారు. కార్మిక సంబంధాల విషయంలో ఆమెకు ప్రత్యేకమైన పట్టు ఉంది. ఆమె నాయకత్వంలో ఒక్క పనిగంట కూడా నష్టం కాకుండా ట్రేడ్‌ యూనియన్లతో చర్చలు జరిపి పనులు సజావుగా సాగించడం ఆమె వ్యూహ రచనకు నిదర్శనం.


దేశం పట్ల నిబద్ధత

నివేదిత విజయం వెనుక బలమైన క్రమశిక్షణతో కూడిన నేపథ్యం ఉంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆమె తండ్రి డీఎన్‌ డోగ్రా ప్రసిద్ధ సైకాలజిస్ట్‌. ఎంతోమంది యువత సాయుధ దళాల్లో చేరేలా ఆయన మార్గదర్శకత్వం వహించారు. ఆమె సోదరుడు మేజర్‌ జనరల్‌ సంజీవ్‌ డోగ్రా ఎన్డీఏ డిప్యూటీ కమాండెంట్‌గా రిటైర్‌ అయ్యారు. దేశం పట్ల నిబద్ధత కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నివేదిత ఇప్పుడు విమానయాన రంగం ద్వారా దేశానికి సేవ చేస్తున్నారు.

ఏఏఐ విజన్‌ 2047

హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నివేదిత ఇప్పుడు వేలాదిమంది ఉద్యోగుల సంక్షేమం, శిక్షణ, నూతన నియామకాల బాధ్యతను పర్యవేక్షించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగులకు కొత్త సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, యువ అధికారులలో లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ పెంచనున్నారు.'

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా

భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న 2047 లక్ష్యాలకు అనుగుణంగా విమానాశ్రయాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. నివేదిత కేవలం అధికారి మాత్రమే కాదు. ఒక గొప్ప శిక్షకురాలు కూడా. ఇండియన్‌ ఏవియేషన్‌ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ, తర్వాతి తరం విమానయాన నిపుణులను ఆమె తీర్చిదిద్దుతున్నారు. ఐసీఏవో గుర్తింపు పొందిన అంతర్జాతీ విమానాశ్రయ నిపుణురాలిగా ఆమెకు గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు ఉంది. ‘నిర్వహణలో నైపుణ్యం, నాయకత్వంలో నిబద్ధత ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు’ అని నివేదిత నిరూపించారు. కేవలం అడ్మినిస్ట్రేషన్‌కే పరిమితం కాకుండా, మానవ వనరుల వికాసానికి ఆమె చేస్తున్న కృషి భవిష్యత్‌ మహిళా అధికారులకు గొప్ప దిక్సూచి.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 12:44 AM