నేతన్నల బ్రాండ్ అంబాసిడర్
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:48 AM
బడ్జెట్ అనగానే సామాన్యుడికి అంకెల లెక్కలు గుర్తొస్తాయి. కానీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విషయంలో అంకెలకు మించి ఆమె వేషధారణలో ఒక ప్రత్యేక శైలి కనిపిస్తుంది....
బడ్జెట్ అనగానే సామాన్యుడికి అంకెల లెక్కలు గుర్తొస్తాయి. కానీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విషయంలో అంకెలకు మించి ఆమె వేషధారణలో ఒక ప్రత్యేక శైలి కనిపిస్తుంది. వరుసగా తొమ్మిదో ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ పార్లమెంటు మెట్లు ఎక్కుతున్న నిర్మలమ్మను చూస్తే అదొక బడ్జెట్ ప్రసంగంలా మాత్రమే కాదు, భారతీయ చేనేత కళా ప్రదర్శనలా అనిపిస్తుంది.
కాంజీవరం కలనేత..
ఈ ఏడాది బడ్జెట్ కోసం నిర్మల తన సొంత రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన చారిత్రక కాంజీవరం సిల్క్ చీరను ఎంచుకున్నారు. మెజెంటా రంగులో మెరిసిపోతున్న ఈ చీరపై బంగారు రంగు ‘కట్టం‘ (గళ్లు), కాఫీ బ్రౌన్ బోర్డర్‌పై చేసిన సున్నితమైన పనితనం భారతీయ చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పింది. అయితే, ఇందులో ఒక విశేషం ఉంది. ఇది జెర్రీతో చేసింది కాదు. పూర్తిగా దారంతో చేనేత చేసిన అరుదైన కళాఖండం. ఇందులో ముందుగా చీర బాడీని ఒక రంగులో నేస్తారు. బోర్డర్‌ను వేరే రంగులో వేరే దారంతో ప్రత్యేకంగా నేస్తారు. తర్వాత రెండు భాగాలను ఇంటర్‌లాక్ (పల్లు పద్ధతి) ద్వారా బలంగా కలుపుతారు. ఈ విధానాన్ని కొర్వై టెక్నిక్ అంటారు. ఈ చీరపై ఉన్న సంప్రదాయబద్ధమైన రుద్రాక్ష మోటిఫ్ దానికి మరింత పవిత్రతను తీసుకొచ్చింది. ఈ రుద్రాక్ష మోటిఫ్ మన ప్రాచీన ఆలయ వాస్తు శిల్పకళ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించినది కావడంతో ఆ చీరకు ఒక దివ్యమైన కళా స్వరూపం చేకూరింది.
చలిని తట్టుకునేలా..
కేవలం సంప్రదాయానికే పరిమితం కాకుండా ఢిల్లీలోని కఠినమైన చలి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక వినూత్న ప్రయోగం చేశారు. సాధారణంగా చీరలకు వేసుకునే బ్లౌజుకు బదులుగా చలిని తట్టుకునేలా టీషర్ట్ మెటీరియల్‌తో చేసిన ఫుల్ స్లీవ్స్, హైనెక్ క్రాఫ్ టాప్‌ను ఽధరించారు. ఢిల్లీ ప్రజలు చలి కోసం సాధారణంగా శాలువాలు కప్పుకుంటారు. కానీ శాలువా కప్పుకునే పనిలేకుండా ఈ టీషర్ట్ బ్లౌజ్ నిర్మలకు ఎంతో సౌలభ్యాన్ని, పవర్‌ఫుల్ లుక్‌ను అందించింది.
బ్రీఫ్‌కేస్ నుంచి బహీఖాతా వరకు
కేవలం చీరలే కాదు, పరిపాలన సంప్రదాయాల్లోనూ నిర్మల విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గతంలో బ్రిటిష్ కాలం నాటి బ్రీఫ్‌కేస్ సంప్రదాయాన్ని పక్కన పెట్టి భారతీయ శైలిలో ఎరుపు రంగు పట్టు వస్త్రంలో చుట్టిన ‘బహీఖాతా’ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు డిజిటల్ బడ్జెట్ కాలంలోనూ ట్యాబ్‌ను కూడా అదే సంప్రదాయ ఎరుపురంగు బ్యాగ్‌లో తీసుకెళ్తూ పాత సంప్రదాయాన్ని, కొత్త సాంకేతికతను సమన్వయం చేశారు. ఇలా ప్రతి బడ్జెట్ వేళ నిర్మలమ్మ తన వస్త్రధారణ ద్వారా దేశంలోని ఏదో ఒక మూల ఉన్న చేనేత కళాకారుడికి గౌరవాన్ని, గుర్తింపును అందిస్తూనే ఉన్నారు.
తొమ్మిదేళ్ల ప్రస్థానం
నిర్మలమ్మ బడ్జెట్ ప్రయాణంలో గడిచిన తొమ్మిదేళ్లు ఒక అద్భుతమైన ఫ్యాషన్ ప్రస్థానం. 2019లో తన తొలి బడ్జెట్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగళగిరి పట్టుచీరతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నిర్మల.. 2021లో తెలంగాణకు గర్వకారణమైన పోచంపల్లి ఇక్కత్ చీరను ధరించి తెలుగు నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. గతేడాది బీహార్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి బహూకరించిన ‘మధుబని’ ఆర్ట్ చీరను ధరించారు. 2024 మధ్యంతర బడ్జెట్ వేళ పశ్చిమ బెంగాల్‌కు చెందిన నీలంరంగు టస్సర్ సిల్క్ ‘కాంతా’ వర్క్ చీరలో మెరిశారు. కర్ణాటకకు చెందిన ‘కసూతి’ ఎంబ్రాయిడరీ, ఒడిశాకు చెందిన ‘బొంకై’ హ్యాండ్లూమ్ చీరలు కూడా ఆమె గత బడ్జెట్ ప్రసంగాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భార్గవి కూనం
డిజైనర్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్
బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్
For More TG News And Telugu News