Share News

ఈ పండుగ మహిళలకు అంకితం

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:54 AM

నవరాత్రి... కర్ణాటకలో చాముండి, బెంగాల్‌లో దుర్గ... ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ దేవతల పేరిట దీన్ని నిర్వహిస్తారు. కానీ, ప్రాథమికంగా నవరాత్రి అంటే స్త్రీ తత్త్వానికి లేదా మహిళల్లోని దైవత్వానికి అంకితం చేసిన...

ఈ పండుగ మహిళలకు అంకితం

సద్గురువాణి

నవరాత్రి... కర్ణాటకలో చాముండి, బెంగాల్‌లో దుర్గ... ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ దేవతల పేరిట దీన్ని నిర్వహిస్తారు. కానీ, ప్రాథమికంగా నవరాత్రి అంటే స్త్రీ తత్త్వానికి లేదా మహిళల్లోని దైవత్వానికి అంకితం చేసిన పండుగ.

స్త్రీ తత్త్వాన్ని పూజించడం అత్యంత పురాతనమైన ఆరాధనా విధానం. భారతదేశంతో పాటు యూరప్‌, అరేబియా, ఆఫ్రికాలోని ప్రధాన భాగాల్లో పూర్వం దేవీ ఆరాధన ఉండేది. కానీ ఈ రోజుల్లో... అన్ని దేశాలూ ప్రధానంగా పురుషతత్త్వం మీద దృష్టి ఎక్కువగా పెట్టడం వల్ల... స్త్రీ తత్త్వ ఆరాధన ఇంకా సజీవంగా ఉన్న ఏకైక సంస్కృతిగా భారతదేశం మాత్రమే మిగిలింది. భారతీయ సంస్కృతి ఎల్లప్పుడూ స్త్రీ తత్త్వాన్నే జీవంలోని అత్యంత శక్తిమంతమైన పార్శ్వంగా చూపిస్తుంది. కాళికామాత శివుడి ఛాతీ మీద నిలబడి ఉన్న క్యాలెండర్‌ చిత్రాలను మీరు చూసి ఉంటారు. అక్కడ. ఆయన ప్రాణం లేనట్టు పడుకుని ఉంటాడు. స్త్రీ తత్త్వం ఉత్తేజపరిస్తే తప్ప పురుష తత్త్వానికి ప్రాణం ఉండదని దీని అర్థం.

మీలో కేవలం పురుష తత్త్వమే ఉన్నట్టయితే... మీ దగ్గర అన్నీ ఉన్నా ఏదీ లేనట్టే. ఒక ఉదాహరణ చెప్పాలంటే... చెట్టు వేరును పురుష తత్త్వం అనుకుంటే... పువ్వు, పండు స్త్రీ తత్త్వానికి ప్రతీక. వేరు తాలూకు అసలు ఉద్దేశం పువ్వును, పండును ఇవ్వడమే. అదే జరగకపోతే వేరు వృధాయే కదా! కేవలం బతికి ఉండడం వల్లే అన్నీ సమకూరవు. మనుగడకు సంబంధించిన అవసరాలు తీరిన తరువాత జీవంలో మరింత సున్నితమైన పార్శ్వాలను మీరు అనుభూతి చెందాలి. ఈ భూమిపై స్త్రీ తత్త్వం కన్నా పురుష తత్త్వానికే ఎక్కువ ప్రాధాన్యం దక్కిందంటే... దానికి కారణం వేల సంవత్సరాల మానవ చరిత్రలో మన ప్రధాన లక్ష్యం కేవలం ప్రాణాలు దక్కించుకొని బతకడమే. గత యాభై, వంద ఏళ్ళలో మాత్రమే మన మనుగడ ఒక క్రమబద్ధమైన స్థితికి చేరుకుంది. మొదటిసారిగా... మనుగడ కోసం పడే ఆరాటాన్ని కాస్త సడలించుకోగలిగే స్థితికి మానవాళి చేరుకుంది. ఆ మనుగడ పోరాటాన్ని కాస్త పక్కన పెడితే... స్త్రీ తత్త్వం ఎంత ముఖ్యమైనదో మీకే అర్థమవుతుంది. ఈ భూమి మీద స్త్రీ తత్త్వానికి మరింత మెరుగైన వ్యక్తీకరణ దొరికితే... మన స్టాక్‌ మార్కెట్‌ ఆకాశాన్ని తాకకపోవచ్చు కానీ... సాధారణంగా ప్రజలు ముఖంలో చిరునవ్వుతో, కాస్త ఎక్కువ ఆనందంగా, ప్రేమగా ఉంటారు. జీవితం మరింత అందంగా మారుతుంది. మనకు ప్రాథమికంగా కావలసినది కూడా ఇదే కదా! ఇవన్నీ మానవ శ్రేయస్సు కోసమే. కాని పురుష తత్త్వం ఒకే దిశలో దూసుకుపోవడం వల్ల ఆ అసలు విషయాన్నే మనం పూర్తిగా మరచిపోయాం.


సమాజంలో స్త్రీ తత్త్వాన్ని స్పృహతో పోషించడం, వేడుకలా జరుపుకోవడం చాలా అవసరం. ఇది జరగకపోతే... ప్రపంచంలో స్త్రీ తత్త్వానికి చోటే ఉండదు. స్త్రీ తత్త్వం కనుమరుగైపోతే... జీవితంలో అందమైన సున్నితమైన, ఆప్యాయంగా చూసుకొనే గుణాలన్నీ మాయమైపోతాయి. జీవంలోని అగ్ని శాశ్వతంగా ఆరిపోతుంది. ఈ నవరాత్రుల్లో... స్త్రీ తత్త్వాన్ని పూర్తి నిమగ్నతతో, ఆనందంగా, ప్రేమగా, వేడుకలా జరుపుకోండి. అప్పుడే మీరు జీవిత సౌందర్యాన్ని తెలుసుకోగలరు.

సద్గురు జగ్గీవాసుదేవ్‌

శక్తి అంటే ఎనర్జీ. ఒక అణువును పనిచేసేలా చేసే శక్తి, ఈ బ్రహ్మాండాన్ని నడిపించే శక్తి ఒక్కటే. ఆ శక్తినే ఎప్పుడూ స్త్రీ తత్త్వంగా గుర్తిస్తారు. ఈ రోజుల్లో సమాజం, మహిళలు కూడా స్త్రీ తత్త్వాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థే ప్రధాన శక్తిగా మారడం వల్ల... మహిళలు కూడా పురుషుల్లా మారడానికి ప్రయత్నిస్తున్నారు. అంతా మళ్ళీ అటవిక నియమం - ‘బలవంతుడిదే రాజ్యం’ అనే స్థితికి చేరుకుంది. ఇది కొనసాగితే పురుష తత్త్వమే ఆధిపత్యం చేయాల్సివస్తుంది. ప్రేమ, కరుణ, జీవాన్ని హత్తుకొనే సున్నితత్వాలను వదిలేసి... మొరటుగా ఆక్రమించే శక్తినే మనం ఎంచుకుంటున్నాం.

Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 16 , 2026 | 03:54 AM