Share News

ఆకలిని జయించి ఆసియా కప్‌కు

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:16 AM

ఇది గెలుపు కోసం తపించే ఒక క్రీడాకారిణి కథ మాత్రమే కాదు.. ఆకలిని డ్రిబ్లింగ్‌ చేస్తూ, పేదరికాన్ని రివర్స్‌ హిట్‌ చేస్తూ.. సమాజం విసిరిన వివక్ష అనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి...

ఆకలిని జయించి ఆసియా కప్‌కు

విజేత

ఇది గెలుపు కోసం తపించే ఒక క్రీడాకారిణి కథ మాత్రమే కాదు.. ఆకలిని డ్రిబ్లింగ్‌ చేస్తూ, పేదరికాన్ని రివర్స్‌ హిట్‌ చేస్తూ.. సమాజం విసిరిన వివక్ష అనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టిన ఒక సామాన్య బాలిక అసామాన్య పోరాటం ఇది.

విరిగిన హాకీ స్టిక్‌కు అతుకులేసుకుంటూ మొదలైన ఆమె ప్రస్థానం.. నేడు ఆసియాకప్‌ ముంగిట ఆశాదీపమై నిలిచింది.

జీవితం ఒక హాకీ మ్యాచ్‌ అయితే.. అందులో ఆమె ఎదుర్కొన్నవన్నీ పెనాల్టీ కార్నర్‌లే. ప్రత్యర్థి కేవలం మైదానంలోని ఆటగాళ్లు మాత్రమే కాదు.. ఆకలి, పేదరికం, సమాజం విసిరే విమర్శలు. మధ్యప్రదేశ్‌లోని సీవనీకి చెందిన 15 ఏళ్ల నౌషీన్‌ నాజ్‌ కథ వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. ఈ రోజు ఆమె భారత్‌ తరఫున అండర్‌-18 ఆసియాకప్‌ హాకీ ఆడేందుకు సిద్ధమవుతుండవచ్చు. కానీ ఆమె ప్రస్థానం మొదలైంది మాత్రం ఒక విరిగిన హాకీ స్టిక్‌తో.. అంతకంటే ఎక్కువగా విరిగిపోని గుండె నిబ్బరంతో!

విరిగిన కర్ర.. వెలకట్టలేని కల

నౌషీన్‌ తండ్రి ఎహ్ఫాజ్‌ఖాన్‌ ఒక దినసరి కూలి. పాత అట్టపెట్టెలు, స్ర్కాప్‌ సేకరించి అమ్మితే వచ్చేది రోజుకు రూ. 200 నుంచి రూ.400 మాత్రమే. ఆ ఇంట్లో ఏడుగురు సంతానం. వీరిలో ఐదుగురు ఆడపిల్లలు. ఒకపూట తిండి దొరకడమే గగనమైన వేళ.. వేల రూపాయల హాకీ కిట్‌ కొనడం ఆ తండ్రికి అసాధ్యమైన పని. కానీ, నౌషీన్‌కు హాకీ అంటే ప్రాణం. ఆడేందుకు స్టిక్‌ లేకపోతే, తన పొరుగున ఉండే ఒకబ్బాయి పారేసిన విరిగిన స్టిక్‌ను అడిగి తీసుకుంది. దానికి మేకులు కొట్టించుకుని, ఫెవిక్విక్‌ పూసి, ఒక పాత గుడ్డముక్కను చుట్టి తన హాకీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మైదానంలో మిగతా పిల్లలు మెరిసిపోయే కిట్‌లతో ఆడుతుంటే ఈ చిన్నారి మాత్రం తన ఆకలిని మర్చిపోయి, ఆ విరిగిన స్టిక్‌తోనే బంతిని గోల్‌పో్‌స్టలోకి పంపేది. ‘‘నా కూతురు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఆ విరిగిన కర్ర విడిపోయినప్పుడల్లా మళ్లీ బట్టకట్టి ఆడుతూనే ఉండేది’’ అని ఆమె తండ్రి నీళ్లు నిండిన కళ్ళతో గుర్తుచేసుకున్నాడు.


సామాజిక వివక్ష

నౌషీన్‌ కేవలం ఆర్థిక ఇబ్బందులనే కాదు, సామాజిక వివక్షను కూడా ఎదుర్కొంది. ‘‘హాకీ ఆడేటప్పుడు అమ్మాయిలు హాఫ్‌ ప్యాంట్లు వేసుకోవడం ఏంటి? ఇది మన పద్ధతి కాదు, మీ పిల్లల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు’’ అంటూ చుట్టుపక్కల వారు, బంధువులు వేలెత్తి చూపేవారు. ఆ మాటలు ఎహ్ఫాజ్‌ను బాధించేవి. కానీ, తన బిడ్డ కళ్లలోని కసిని చూసిన తండ్రి ఆ విమర్శలను లెక్క చేయలేదు. తన కుమార్తెల కలల కోసం సమాజంతో యుద్ధం చేశాడు. ఈ రోజు అదే వ్యక్తులు నౌషీన్‌తో ఫొటోలు దిగడానికి క్యూ కడుతున్నారు.

మైదానంలో గోల్స్‌ సునామీ

నౌషీన్‌ ప్రతిభను 2023లో మధ్యప్రదేశ్‌ హాకీ అకాడమీ గుర్తించింది. అది ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. అప్పటి వరకు సరైన తిండి, క్రీడా సామగ్రి లేని ఆమెకు అకాడమీ అండగా నిలిచింది. పౌష్టికాహారం, ప్రొఫెషనల్‌ శిక్షణ దొరకగానే ఆమె అసలైన ఆట మొదలైంది.

ఏకంగా 9 గోల్స్‌...

ఇటీవల బీహార్‌లోని రాజ్‌గిరిలో జరిగిన సబ్‌ జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షి్‌పలో ప్రత్యర్థి జట్లను నౌషీన్‌ ముప్పుతిప్పలు పెట్టింది. ఏకంగా 9 గోల్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలవడమే కాకుండా, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఫైనల్‌’ అవార్డును కూడా కైవసం చేసుకుంది.


3-National.jpg

ఆసియాకప్‌ దిశగా అడుగులు

నౌషీన్‌ వేగాన్ని చూసి హాకీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆమె భోపాల్‌లోని జాతీయ క్యాంపులో శిక్షణ పొందుతోంది. మే 29 నుంచి జపాన్‌లో జరగనున్న అండర్‌-18 ఆసియాక్‌పకు ఎంపికయ్యే దిశగా ఆమె అడుగులు పడుతున్నాయి. అక్కడ కూడా ఆమెకు సొంత కిట్‌ లేదు. తోటి క్రీడాకారిణుల వద్ద సామగ్రి అడిగి తీసుకుని ప్రాక్టీస్‌ చేస్తోంది.

తన పరిస్థితిపై ఏమాత్రం కుంగిపోకుండా ‘‘నా లక్ష్యం ఒక్కటే.. దేశం తరఫున ఆడటం’’ అని ధీమాగా చెబుతోంది.పేదరికంపై తండ్రి విజయం నౌషీన్‌ తండ్రి ఇప్పుడు ఒక బలమైన గోల్‌కీపర్‌లా ఆమెకు రక్షణగా నిలుస్తున్నాడు. ‘‘ఒకప్పుడు నా కూతురు ఆటను చూసి భయపడేవాడిని, కానీ ఇప్పుడు గర్వంగా ఉంది. నా బిడ్డను అడ్డుకోవాలని చూస్తే, తొలుత నన్ను ఎదుర్కోవాల్సిందే’’ అని ఆయన చెబుతున్న మాటలు ఒక తండ్రికి ఒక బిడ్డ సాధించిన విజయంపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నౌషీన్‌ బాటలోనే ఆమె చెల్లెలు సబారిక కూడా ఇప్పుడు హాకీ అకాడమీలో అడుగుపెట్టింది. నౌషీన్‌ చేతిలో ఇప్పుడు ఖరీదైన స్టిక్‌ ఉండొచ్చు. కానీ, ఆనాడు విరిగిన స్టిక్‌ను గుడ్డతో కట్టిన ఆ పట్టుదలే ఆమెను ఇవాళ ఈస్థాయికి చేర్చింది. గెలుపు గుర్రం ఎక్కడానికి కావాల్సింది సదుపాయాలు కాదు, సంకల్పం అని నౌషీన్‌ నిరూపిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 05:16 AM