నల్లనయ్య ఎనిమిది రూపాలు
ABN , Publish Date - Jun 12 , 2026 | 03:29 AM
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో తొమ్మిదో అవతారం శ్రీకృష్ణుడు. ద్వాపరయుగంలో ప్రభవించి, భగవద్గీతను అర్జునుడిద్వారా ఆయన లోకానికి అందించాడు....
తెలుసుకుందాం
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో తొమ్మిదో అవతారం శ్రీకృష్ణుడు. ద్వాపరయుగంలో ప్రభవించి, భగవద్గీతను అర్జునుడిద్వారా ఆయన లోకానికి అందించాడు. ‘పని చెయ్యి, ఫలితం ఆశించకు. అలాగని పని చెయ్యడం మానకు’ అనే మహోన్నత వాక్యం యావత్ మానవజాతికి ఒక గొప్ప సందేశం.
శ్రీకృష్ణుని విగ్రహ నిర్మాణానికి సంబంధించిన, ఎనిమిది కృష్ణ రూపాల వివరాలు పాంచరాత్ర ఆగమం, వైఖానస ఆగమం లాంటి శాస్త్రాల్లో కనిపిస్తాయి. అష్టమినాడు జన్మించిన స్వామి ప్రధానంగా ఆ అష్ట రూపాలలో ప్రసిద్ధుడై భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. అవి: బాలకృష్ణుడు, నవనీత కృష్ణుడు, కాళీయమర్దన కృష్ణుడు, గోవర్ధన ధరుడు, మదన గోపాలమూర్తి, పార్థసారథి, త్రైలోక్యమోహనుడు, జగన్మోహనుడు.
యశోదాదేవి ఒడిలో నిదురించి పాలను గ్రోలుతున్న బాలకృష్ణుడి రూపాన్ని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని శ్రీతత్త్వనిధి గ్రంథం చెబుతోంది.
వ్రేపల్లెలో వెన్నదొంగగా దర్శనమిచ్చినవాడు నవనీత కృష్ణుడు. వెన్న దొరికిందని ఆనందంతో నృత్యం చేస్తున్న స్వామి రూపం... నవనీత నృత్యమూర్తి.
కాళింది మడుగులో కాళీయ సర్పం పడగల మీద నృత్యం చేస్తున్న కాళీయమర్దన కృష్ణుణ్ణి పూజిస్తే శత్రుబాధలు తొలగిపోతాయని ‘పాంచరాత్రాగమం’ తెలిపింది. కాళీయమర్దన రూపం రసరమ్యమైనది. కుడిచేత్తో అభయం ఇస్తూ, ఎడమ చేతితో సర్పం తోకను పట్టుకొని, ఎడమ కాలిని పడగపై ఉంచి, కుడికాలిని కాస్త ఎత్తినట్టు ఈ ప్రతిమ చూపిస్తుంది.
గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి... గోప బాలకులను, సకల జంతుజాలాన్ని కాపాడిన స్వామి గోవర్ధనగిరిధారి. ఆ స్వామిని సేవిస్తే సకల కష్టాలు తొలగుతాయని పెద్దలు చెప్పారు.
మదనగోపాల రూపం ఎంతో విశిష్టమైనది. ఆ స్వామి పదహారు చేతులతో దర్శనమిస్తాడు. రెండు చేతులలో వేణువును ఊదుతూ, మరో రెండు చేతులలో శంఖ చక్రాలను, మిగిలిన చేతులలో పాశం, అంకుశం, పద్మం, చెరకుగడ తదితరాలను ధరించి కనిపించే ఈ స్వామిని ‘రాజగోపాలుడు’ అని కూడా అంటారు. మదనగోపాలుడి దర్శనం సకలాభీష్టప్రదం.
మహాభారత యుద్ధంలో అర్జునుడికి మార్గదర్శకునిగా, రథసారథిగా శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ఈ రూపం ‘పార్థసారథి’గా ప్రసిద్ధి చెందింది. ఆ స్వామి ఒక చేతితో చండ్రకోలును, మరో చేతితో శంఖాన్ని ధరించి దర్శనమిస్తాడు. ఆయను జ్ఞానప్రదాయకుడు. భగవద్గీతను అనుగ్రహించింది ఈ రూపంలోనే.
జగన్మోహనస్వామి బృందావనంలో రత్నకిరీటాన్ని ధరించి, గరుడుని భుజంపై కూర్చొని, ఎడమవైపున లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని... ఎనిమిది చేతులతో దర్శనమిస్తాడు.
త్రైలోక్యమోహన స్వామి ఎనిమిది లేదా పదహారు చేతులతో దర్శనమిస్తాడని ‘రూపమండన శిల్పశాస్త్రం’ తెలిపింది.

వైఖానస ఆగమం ప్రకారం: శ్రీకృష్ణుడి మూర్తి 120అంగుళాలకన్నా హెచ్చు ఉండకూడదు. నల్లని రంగులో, ఎర్రని వస్త్రాలతో వివిధ ఆభరణాలు ధరించి ఉండే స్వామి శిరస్సుపై కిరీట మకుటం గానీ, జటాబంధం కానీ చూపాలి. ఎడమ చేతిలో చేగోల ధరించినట్టు, ఎడమ చేతిని మోచేతి దగ్గర మడిచినట్టు చూపాలి. ఆ చేతిలో శంఖం కూడా ఉండవచ్చు. శ్రీకృష్ణుని కుడివైపున రుక్మిణిని చూపాలి. ఆమె బంగారు ఛాయలో ఉంటుంది. ఎడమవైపున నల్లని రంగులో, కుడిచేతితో అలంకార సుమాన్ని ధరించిన సత్యభామను చూపాలి. ఆ దేవేరులిద్దరూ కరండమకుటాన్ని కలిగి ఉండాలి.
విష్ణుధర్మోత్తరపురాణం ప్రకారం: శ్రీకృష్ణుడు ఒక చేత చక్రాన్ని ధరించి, మరో చేతితో అభయాన్ని ఇస్తున్నట్టు ఉండాలి. రుక్మిణి ఒక చేతిలో నీలోత్పలాన్ని ధరించాలి. కేవల శ్రీకృష్ణమూర్తులలో నవనీత కృష్ణమూర్తి, వేణుగోపాలమూర్తి, మదనగోపాలమూర్తి, పార్థసారథి, కాళియమర్దన మూర్తి, గోవర్ధనధారి ప్రశస్తమైనవి. వీటిలో వేణుగోపాలమూర్తిని... చుట్టూ గోవులు, గోపాలురు ఉండగా, త్రిభంగిమలోగానీ, విషమభంగిమలోగానీ వేణువు వాయిస్తున్నట్టు చూపడం జరుగుతుంది. మదనగోపాలమూర్తి ఇంచుమించు వేణుగోపాలమూర్తిలాగే ఉంటాడు. ఆయన పద్మం, పరశువు, చక్రం, పాశం, శంఖం, ఇక్షుకోదండం (చెరకువిల్లు) కలిగి ఉండాలి. ఈ మూర్తిని కూడా వేణుగానలోలుడిగానే చూపిస్తారు. కానీ మన్మధుడి చిహ్నమైన చెరకువిల్లు కలిగి ఉండడం వల్ల... ఈ మూర్తిని మదనగోపాలమూర్తిగా ‘శ్రీతత్త్వనిధి’ గ్రంథం అభివర్ణించింది. వీటితోపాటు వట పత్రశాయి, సంతానగోపాల రూపాలు కూడా ప్రసిద్ధి చెందాయి.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News