Nalini Joshi Indian Mathematician: ఆమె గణితాన్వేషి
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:16 AM
చాలామందికి అంకెలు అంటే కేవలం లెక్కలు మాత్రమే. కానీ ఆమెకు ప్రకృతి రహస్యాలు విప్పే తాళం చెవులు. సమీకరణాల సంక్లిష్టతలో సౌందర్యాన్ని వెతుకుతూ...
చాలామందికి అంకెలు అంటే కేవలం లెక్కలు మాత్రమే. కానీ ఆమెకు ప్రకృతి రహస్యాలు విప్పే తాళం చెవులు. సమీకరణాల సంక్లిష్టతలో సౌందర్యాన్ని వెతుకుతూ గణితాన్ని సామాజిక ప్రయోజనానికి ఆయుధంగా మలిచిన మేధావి ఆమె. ఆస్ట్రేలియా గడ్డపై భారతీయ ముద్రవేస్తూ ‘ఎన్‌ఎ్‌సడబ్ల్యూ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచిన ప్రొఫెసర్ నళిని జోషి స్ఫూర్తిదాయక ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
సాధారణంగా గణితం అంటే చాలామందికి భయం. మరికొందరికి అయోమయం. కానీ నళిని జోషికి మాత్రం అదొక అందమైన కళ. మయన్మార్‌లో జన్మించి, భారతీయ మూలాలతో పెరిగిన ఆమె అంకెలను అక్షరాలుగా మలిచి ప్రకృతి రహస్యాలను ప్రపంచానికి వివరించారు. చిన్ననాటి నుంచి ఆమెకు ఉన్న జిజ్ఞాస నేడు ఆమెను ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో అత్యున్నత చైర్ ఫ్రొఫెసర్ స్థానంలో నిలబెట్టింది. ఆమె ఆలోచనల నుంచి పుట్టిన ప్రతి సమీకరణం నేడు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి దిక్సూచిలా మారుతోంది.
న్యూ సౌత్‌వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎదురుచూసే అత్యున్నత గౌరవాల్లో ‘న్యూ సౌత్‌వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్’ ఒకటి. 2025లో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం నళిని జోషిని వరించడం యావత్ భారత సంతతికి గర్వకారణం. గణితం పట్ల ఆమెకున్న జిజ్ఞాస మాత్రమే కాదు.. క్లిష్ట సమస్యలను సులభతరం చేసే ఆమె విశ్లేషణాత్మక శైలికి ఈ అవార్డు పట్టాభిషేకం వంటిది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో భారతీయ మూలాలున్న ఒక మహిళ ఈ స్థాయి గౌరవం పొందడం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.

అసాధారణ పరిశోధనల వారధి
నళిని జోషి పరిశోధన ‘పెయిన్లెవ్ సమీకరణాల’ చుట్టూ తిరుగుతుంది. ఈ పేరు వినడానికి కొత్తగా ఉన్నా వీటి ప్రభావం మాత్రం మన దైనందిన జీవితంలో అనేక అంశాలపై ఉంటుంది. వైర్‌సల వ్యాప్తిని అంచనా వేయడం నుంచి, భారీ అలల ఉద్ధృతిని లెక్కగట్టడం వరకు ఆమె రూపొందించిన గణిత నమూనాలు కీలక పాత్ర పోషిస్తాయి. వైద్య రంగంలో ఎమ్మారై స్కాన్ల నాణ్యతను పెంచడంలో కూడా నేడు ఆమె పరిశోధనలు ఉపకరిస్తున్నాయి. ఆమె సిద్ధాంతాలు కేవలం పుస్తకాలకే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఎలా ఉపయోగపడతాయో ఆమె చేసి చూపించారు.
మహిళా లోకానికి ఆశాకిరణం
విజ్ఞాన శాస్త్ర రంగాల్లో, ముఖ్యంగా గణితంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న రోజుల్లో నళిని జోషి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్సె్‌సకు ఎన్నికైన తొలి భారతీయ మహిళగా ఆమె సృష్టించిన చరిత్ర నేటి తరం యువతులకు ఒక గొప్ప స్ఫూర్తి. లింగ వివక్షను అధిగమించి మేధస్సుకు సరిహద్దులు లేవని ఆమె నిరూపించారు. ‘సైన్స్ ఇన్ ఆస్ట్రేలియా జెండర్ ఈక్విటీ’ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది మహిళా శాస్త్రవేత్తలు ఎదగడానికి ఆమె అండగా నిలుస్తున్నారు. ఆమె సాధించిన ఈ పురస్కారం ఒక వ్యక్తి విజయమే కాదు, అంకితభావంతో పనిచేసే ప్రతి పరిశోధకుడి విజయం.
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
Read Latest AP News And Telugu News