ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా చాలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:48 AM
గ్లామర్ ప్రపంచంలో మెరవడం సులభమే కానీ, ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేయడమే కష్టం. ‘సీతారామం’తో తెలుగువారి ఇంటి ఆడపడుచులా మారిపోయిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా...
స్టార్ స్టోరీ
గ్లామర్ ప్రపంచంలో మెరవడం సులభమే కానీ, ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేయడమే కష్టం. ‘సీతారామం’తో తెలుగువారి ఇంటి ఆడపడుచులా మారిపోయిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా ఎదిగింది. వరుస విజయాలు, పెళ్లి పుకార్లు, కెరీర్ సవాళ్లపై ఆమె మనసు విప్పి మాట్లాడింది. ఆ వివరాలు మీకోసం...
సోషల్ మీడియాలో ఈ వారం మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు సెన్షేషన్ అయ్యాయి. దీని గురించి ఆమె వద్ద ప్రస్తావించగానే పెద్దగా నవ్వి ‘‘నాకైతే ఫిబ్రవరి 14 వాలైంటైన్స్ డేలా కాకుండా ‘ఏప్రిల్ ఫూల్స్ డే’లా అనిపించింది. నేను ఎవరినో పెళ్లి చేసుకుంటున్నానని రాసేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ పుకార్ల వల్ల నాకు కోట్ల రూపాయల ఉచిత పబ్లిసిటీ లభించింది. కానీ సీరియస్‌గా చెప్పాలంటే.. నా పెళ్లి ఎప్పుడు జరిగినా అది నేనే స్వయంగా ప్రకటిస్తాను. మా నాన్న కూడా నన్ను సెటిల్ అవమని అడుగుతుంటారు. అయితే, నా కంటూ ఒక పర్ఫెక్ట్ పార్ట్‌నర్ దొరకాలి కదా! అప్పటి వరకు నా ప్రేమంతా సినిమాలతోనే’’ అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ నా సెకండ్ హోం
మరాఠీ అమ్మాయిని అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని అంటుంది మృణాల్. ‘‘సీతారామంలోని సీతామహాలక్ష్మి పాత్ర నాకు ప్రాణం పోసింది. ‘హాయ్ నాన్న’లో యశ్నగా నన్ను రిసీవ్ చేసుకున్న విధానం మర్చిపోలేను. తెలుగు సినిమా పరిశ్రమ కథలకు ఇచ్చే ప్రాధాన్యం అద్భుతం. ఇక్కడ భాష సమస్య అనిపించదు. ఎందుకంటే ఎమోషన్స్ అనేవి యూనివర్సల్. తెలుగులో నటించడం నాలో నటిని మరింత మెరుగుపరిచింది. టాలీవుడ్ నాకు రెండో ఇల్లు వంటిది’’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమపై అభిమానాన్ని చాటుకుంది.
అల్లు అర్జున్ ఒక ఇన్‌స్పిరేషన్
మృణాల్ తన ఫేవరెట్ హీరోల గురించి చెబుతూ అల్లు అర్జున్ ప్రస్తావనను తీసుకొచ్చింది. ‘‘బన్నీ డ్యాన్స్, ఆయన స్ర్కీన్ ప్రెజెన్స్ చూసి నేను ఫిదా అయిపోయాను. ఆయనతో కలిసి ఒక్క ఫ్రేములో కనిపించినా చాలని కోరుకుంటున్నాను. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని విన్నాను. ఒకవేళ నాకు అందులో అవకాశం వస్తే మాత్రం తన కల నిజమైనట్టేనని చెప్పింది మృణాల్.
సవాళ్లు.. పాఠాలు
టెలివిజన్ నుంచి వెండితెరకు రావడం అంత సులభం కాదని మృణాల్ గుర్తు చేసుకుంది. ‘‘ప్రారంభంలో చాలా మంది నన్ను ‘టీవీ నటి’ అని ముద్ర వేశారు. నాకు గ్లామర్ పాత్రలు సెట్ కావన్నారు. కానీ వెనకడుగు వేయలేదు. ‘లవ్ సోనియా’ నుంచి ‘హాయ్ నాన్న’ వరకు నేను ఎంచుకున్న ప్రతి పాత్ర ఒక చాలెంజ్. ఈ రోజు నేను ఎక్కడున్నా అది కేవలం నా కష్టం వల్ల మాత్రమే కాదు, నన్ను నమ్మిన దర్శకుల వల్ల’’ అని గుర్తు చేసుకుంది.
ఫిట్‌నెస్.. లైఫ్‌స్టైల్
గ్లామర్ వెనక ఉన్న రహస్యాన్ని అడిగితే.. ‘‘చక్కని ఆహారం, యోగా, మానసిక ప్రశాంతత’’ అని సింపుల్‌గా తేల్చేసింది. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో గడపడానికి సమయం కేటాయిస్తానని, అదే తనను రీచార్జ్ చేస్తుందని చెప్పింది. ఎంతో పరిణితితో మాట్లాడిన మృణాల్ ఆత్మవిశ్వాసానికి కొదవ లేదు. త్వరలోనే తెలుగులో మరో పెద్ద ప్రాజెక్టుతో వస్తానని అభిమానులకు ప్రామిస్ చేసింది.
దో దీవానే సెహర్ మే.. ఒక అందమైన ప్రయాణం
తాజాగా విడుదలైన తన కొత్త సినిమా ‘దో దీవానే సెహర్ మే‘ గురించి మృణాల్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పేరు వినగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇది ఒక ప్రేమకథ మాత్రమే కాదు, ఆధునిక నగరాల్లో యువత ఎదుర్కొనే ఎమోషనల్ స్ట్రగుల్స్ చుట్టూ తిరిగే కథ. ఇందులో నాది చాలా లేయర్స్ ఉన్న అమ్మాయి పాత్ర. షూటింగ్ సమయంలో ముంబై వీధుల్లో తిరుగుతూ, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ సినిమా కోసం నేను నా సహజ సిద్ధమైన నటనను మరింత రాటుదేల్చుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ చేస్తున్నప్పుడు నాకే తెలియకుండా కళ్లలో నీళ్లు తిరిగాయి’’ అని చెప్పుకొచ్చింది.
ఇష్టమైన వంటకం: పురాణ్ పోలీ, తెలుగు ఆవకాయ అన్నం
ఫేవరెట్ లొకేషన్: కశ్మీర్
హీరోయిన్ కాకపోయి ఉంటే: ఒక మంచి జర్నలిస్ట్‌ను అయ్యేదాన్ని
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News