వాన వేళ వేడివేడిగా..!
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:01 AM
బయట చినుకులు పడుతుంటే వేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అలా స్నాక్ టైమ్‌లో, టీ తాగేటప్పుడు తినడానికి వీలుగా సులువుగా తయారుచేసుకోగలిగే రెస్టారెంట్ రుచులు మీకోసం...
వంటిల్లు
బయట చినుకులు పడుతుంటే వేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అలా స్నాక్ టైమ్‌లో, టీ తాగేటప్పుడు తినడానికి వీలుగా సులువుగా తయారుచేసుకోగలిగే రెస్టారెంట్ రుచులు మీకోసం...
తందూరి ఫిష్
కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు- ఎనిమిది, నూనె- మూడు చెంచాలు, జీలకర్ర పొడి- ఒకటిన్నర చెంచాలు, ధనియాల పొడి- చెంచా, దాల్చిన చెక్క పొడి- పావు చెంచా, జాజికాయ పొడి- పావు చెంచా, ఆమ్‌చూర్ పొడి- చెంచా, కారం- చంచా, ఉప్పు- రెండు చెంచాలు, నిమ్మరసం- ఆరు చెంచాలు, చిక్కటి పెరుగు- కప్పు, ఆలివ్ ఆయిల్- నాలుగు చెంచాలు, ఉల్లిపాయ పేస్టు- పావు కప్పు, అల్లం పేస్టు- చెంచా, వెల్లుల్లి పేస్టు- చెంచా, రెడ్ ఫుడ్ కలర్- చిటికెడు, పసుపు- అర చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
ఒక గిన్నెలో చేప ముక్కలు, నూనె, అర చెంచా జీలకర్ర పొడి, రెండు చెంచాల నిమ్మరసం వేసి కలిపి ఉంచుకోవాలి. మరో వెడల్పాటి గిన్నెలో పెరుగు, ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయ-అల్లం-వెల్లుల్లి పేస్టులు, మిగిలిన నిమ్మరసం, రెడ్ కలర్ వేసి కలపాలి. తరువాత పసుపు, పైన సూచించిన పొడులు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో చేప ముక్కల మిశ్రమం వేసి జాగ్రత్తగా కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బేకింగ్ ట్రేలో ఫాయిల్ పరిచి కొద్దిగా నూనె రాసి చేప ముక్కల మసాల మిశ్రమాన్ని సమంగా పరచాలి. ఈ ట్రేని ఓవెన్‌లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పావుగంటసేపు బేక్ చేయాలి. తరువాత బ్రాయిల్ మోడ్‌లో అయిదు నిమిషాలు ఉంచి బయటికి తీయాలి. ఎర్రగా తందూరీలా కాలిన చేప ముక్కలపై కొత్తిమీర తరుగు చల్లి వేడిగా సర్వ్ చేయాలి.
గలౌటి కబాబ్
కావాల్సిన పదార్థాలు
మెత్తటి కీమా- అర కేజీ, పచ్చి బొప్పాయి ముక్కలు- అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, ఫ్రైడ్ ఆనియన్స్- కప్పు, నానబెట్టిన జీడిపప్పులు- పది, కారం- ఒకటిన్నర చెంచాలు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- అర చెంచా, గరం మసాల పొడి- చెంచా, జాజికాయ పొడి- అర చెంచా, వేయించిన శనగ పిండి- రెండు చెంచాలు, గులాబి నీళ్లు- రెండు చెంచాలు, కుంకుమ పువ్వు- అర చెంచా, నెయ్యి- నాలుగు చెంచాలు
తయారీ విధానం
బ్లెండర్‌లో పచ్చి బొప్పాయి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్, నానబెట్టిన జీడిపప్పులు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కీమా, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాల పొడి, జాజికాయ పొడి, శనగపిండి, కొద్దిగా నెయ్యి, చెంచా పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు, గులాబి నీళ్లు వేసి చేత్తో బాగా కలపాలి. దీనిమీద మూతపెట్టి రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడిచేయాలి. ఫ్రిజ్ నుంచి తీసిన కీమా మిశ్రమాన్ని చేత్తో కొద్దిగా తీసుకుంటూ చిన్న బిళ్లల మాదిరి చేసి పాన్ మీద పరచాలి. ఆపైన రెండు వైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. వీటిని రుమాల్ రోటీ, పరోటా, పుల్కా లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయవచ్చు.
పనీర్ టిక్కా
కావాల్సిన పదార్థాలు
పనీర్ ముక్కలు- పావు కేజీ, శనగపిండి- అర కప్పు, వాము- పావు చెంచా, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, గరం మసాల పొడి- చంచా, కారం- చెంచా, పసుపు- పావు చెంచా, చాట్ మసాల పొడి- అర చెంచా, తందూరి మసాల పొడి- చెంచా, నిమ్మరసం- చెంచా, నూనె- షాలో ఫ్రైకి తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
ఒక గిన్నెలో శనగపిండి, వాము, కారం, ఉప్పు, పసుపు, గరం మసాల పొడి, తందూరి మసాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసి కొద్ది కొద్దిగా నీటిని చిలకరిస్తూ పేస్టులా కలపాలి. అందులో పనీర్ ముక్కలు వేసి జాగ్రత్తగా మరోసారి కలిపి మూతపెట్టి అరగంటసేపు నాననివ్వాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. ఆపైన మసాలా పేస్టుతో కూడిన పనీర్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేయాలి. అవి దోరగా వేగిన తరువాత టిష్యూ పేపర్ పరిచిన పళ్లెంలోకి తీయాలి. వాటిపై కొద్దిగా చాట్ మసాల పొడి చల్లి కొత్తిమీర తరుగు వేసి పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.
చికెన్ కబాబ్
కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ ముక్కలు (పెద్దవి)- 450 గ్రాములు, చిక్కటి పెరుగు- రెండు కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, నిమ్మరసం- చెంచా, కశ్మీరి కారం- చెంచా, గరం మసాల పొడి- చెంచా, ధనియాల పొడి- చెంచా, జీలకర్ర పొడి- చెంచా, పసుపు- అర చెంచా, కసూరి మేథి- చెంచా, నూనె- చెంచా, వెన్న- కొద్దిగా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత, చాట్ మసాల పొడి- కొద్దిగా
తయారీ విధానం
వెడల్పాటి గిన్నెలో చికెన్ ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చేత్తో కలిపి మూతపెట్టి ఇరవై నిమిషాలు నాననివ్వాలి. మరో గిన్నెలో పెరుగు, నూనె, కశ్మీరి కారం, గరం మసాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కసూరి మేథి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరువాత అందులో చికెన్ ముక్కల మిశ్రమం వేసి కలిపి నాలుగు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత చికెన్ ముక్కలను స్క్యూవర్లకు గుచ్చి ఓవెన్‌లో 230 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఇరవై నిమిషాలు బేక్ చేయాలి. మధ్యలో చికెన్ స్క్యూవర్లను రెండో వైపునకు తిప్పాలి. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా వెన్న వేసి కరిగించి బేక్ చేసిన చికెన్ స్క్యూవర్లను ఉంచాలి. వాటిని రెండు వైపులా దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. వీటిపై చాట్ మసాల పొడి చల్లి కొత్తిమీర తరుగు వేసి టమాటా సాస్, మింట్ చట్నీలతో సర్వ్ చేయాలి.
కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ చెఫ్
కడలి రెస్టారెంట్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News