సరికొత్త మామిడి రుచులు
ABN , Publish Date - May 16 , 2026 | 01:38 AM
ఈ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదీ ఆనందించేలా పుల్లటి మామిడికాయలతో రకరకాల శాకాహార, మాంసాహార వంటకాలు ప్రయత్నించవచ్చు. వాటిలో సులువుగా తయారుచేసుకోదగ్గ విభిన్న రుచులు మీకోసం...
వంటిల్లు
ఈ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదీ ఆనందించేలా పుల్లటి మామిడికాయలతో రకరకాల శాకాహార, మాంసాహార వంటకాలు ప్రయత్నించవచ్చు. వాటిలో సులువుగా తయారుచేసుకోదగ్గ విభిన్న రుచులు మీకోసం...
ల్యాంబ్ మ్యాంగో కోకోనట్ కర్రీ
కావాల్సిన పదార్థాలు
ఫ మటన్ ముక్కలు- అర కేజీ, ఉల్లిపాయలు- 2, జీడిపప్పు పేస్టు- 2 చెంచాలు, టమాటా పేస్టు- 2 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, కారం- చెంచా, పసుపు- పావు చెంచా, గరం మసాలా పొడి- అర చెంచా, ఉప్పు- చెంచా, నూనె- 4 చెంచాలు, పచ్చిమామిడికాయ పేస్టు- అర కప్పు, కొబ్బరిపాల పొడి- 2 చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
ఫ స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేసి అది వేడెక్కాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మటన్ ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్లు చిలకరించి మూతపెట్టి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి రెండు చెంచాల నూనె వేసి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత టమాటా పేస్టు, జీడిపప్పు పేస్టు, పచ్చి మామిడికాయ పేస్టు వేసి బాగా కలిపి అయిదు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు, కొబ్బరిపాల పొడి వేసి కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి.
కైరీ పనీర్ టిక్కా
కావాల్సిన పదార్థాలు:
పనీర్ క్యూబ్స్- పావు కేజీ, కైరీ (పచ్చి మామిడికాయ పేస్టు)- అర కప్పు, గ్రీక్ యోగర్ట్ (చిక్కటి పెరుగు)- అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, ఉల్లిపాయ- 1, క్యాప్సీకమ్- 1, కశ్మీరీ కారం- చెంచా, పసుపు- పావు చెంచా, గరం మసాలా పొడి- చెంచా, జీలకర్ర పొడి- చెంచా, చాట్ మసాలా పొడి- చెంచా, కసూరీ మెంతి- చెంచా, ఉప్పు- తగినంత, శనగపిండి- 2 చెంచాలు
తయారీ విధానం:
ఉల్లిపాయ, క్యాప్సీకమ్‌లను పెద్ద ముక్కలుగా కోయాలి. గిన్నెలో పెరుగు వేసి క్రీమ్‌లా వచ్చే వరకు బీట్ చేయాలి. ఆపైన అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి మామిడికాయ పేస్టు, శనగపిండి, కారం, పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కసూరి మెంతి వేసి బాగా కలపాలి. తరువాత పనీర్ క్యూబ్స్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సీకమ్ ముక్కలు వేసి జాగ్రత్తగా కలిపి ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి. పొడవాటి పుల్లలను తీసుకుని వాటికి క్యాప్సీకమ్, పనీర్, ఉల్లిపాయ ముక్కలను వరుసగా గుచ్చాలి. స్టవ్ మీద పాన్ లేదా గ్రిల్ పెట్టి కొద్దిగా నూనె రాసి వేడిచేయాలి. దానిమీద పనీర్, క్యాప్సీకమ్ ముక్కలు గుచ్చిన పుల్లలు ఉంచి గుండ్రంగా తిప్పుతూ చిన్న మంట మీద అయిదు నిమిషాలపాటు గ్రిల్ చేయాలి. తరువాత పళ్లెంలోకి తీసి కొద్దిగా చాట్ మసాలా పొడి చల్లి పుదీనా చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.
ఫిష్ ఫింగర్స్ విత్ మ్యాంగో సల్సా
కావాల్సిన పదార్థాలు
ఫ పొడవుగా కోసిన తెల్లటి చేప ముక్కలు- అర కేజీ, బ్రెడ్ పొడి- ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్- అర కప్పు, మిరియాల పొడి- చెంచా, ఉప్పు- తగినంత, వెల్లుల్లి పొడి- చెంచా, పాప్రికా పొడి- చెంచా, కోడిగుడ్లు- 2, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు- ఒక కప్పు, టమాటా- 1, ఉల్లిపాయ- 1, కొత్తిమీర తరుగు- పావు కప్పు, పచ్చి మిర్చి- 1, నిమ్మరసం- 2 చెంచాలు, నూనె- తగినంత, ఆలివ్ ఆయిల్- చెంచా, టమాటా కెచప్- 2 చెంచాలు
తయారీ విధానం
ఒక గిన్నెలో మామిడికాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, తగినంత ఉప్పు, టమాటా కెచప్ వేసి బాగా కలిపి మ్యాంగో సల్సా తయారుచేసుకోవాలి. దీన్ని అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఒక గిన్నెలో కోడి గుడ్డు సొనలు వేసి బాగా బీట్ చేయాలి. మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్, పాప్రికా పొడి, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చేప ముక్కలను ఈ మసాలా పొడిలో అద్ది తరువాత కోడిగుడ్డు సొనల్లో ముంచి ఆపైన బ్రెడ్ పొడిలో దొర్లించి వేడెక్కిన పాన్ మీద వేయాలి. చిన్న మంట మీద అన్ని వైపులా దోరగా వేగేలా షాలో ఫ్రై చేయాలి. తరువాత వీటిని పళ్లెంలోకి తీసి మ్యాంగో సల్సాతో సర్వ్ చేయాలి.
ఖట్టా కా ముర్గ్
కావాల్సిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ లెగ్ పీస్‌లు- 6, పచ్చి మామిడికాయ పేస్టు- ఒకటిన్నర కప్పులు, నిమ్మరసం- 2 చెంచాలు, ఉప్పు- 3 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్టు- 2 చెంచాలు, పెరుగు- అర కప్పు, జీడిపప్పు పేస్టు- పావు కప్పు, జీలకర్ర పొడి- 2 చెంచాలు, మెంతి పొడి- చెంచా, మిరియాల పొడి- 2 చెంచాలు, గరం మసాలా పొడి- 2 చెంచాలు, కారం- 2 చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం:
ఒక గిన్నెలో పెరుగు, జీడిపప్పు పేస్టు, జీలకర్ర పొడి, మెంతి పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో చికెన్ లెగ్ పీస్‌లు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పచ్చి మామిడికాయ పేస్టు వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి. తరువాత అందులో ముందుగా తయారుచేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాలు ఉంచాలి. ఆపైన సన్నని పొడవాటి కడ్డీలను తీసుకుని వాటికి చికెన్ లెగ్ పీస్‌లు గుచ్చాలి. వీటిని తందూరీ కుండలో అమర్చి పావుగంటసేపు మగ్గించాలి. తరువాత పళ్లెంలోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేయడమే.
కొడాలి వెంకటేశ్వర రావు
ఎగ్జిక్యూటివ్ చెఫ్
గోల్కొండ హోటల్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News