Share News

గ్లోబల్‌ ఫ్యాషన్‌ రాణి

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:35 AM

భారతీయ మహిళలకు కలలు కనే ధైర్యమే కాదు, వాటిని నిజం చేసుకునే సత్తా కూడా ఉంటుందని నిరూపించారు లీనా నాయర్‌. ప్రపంచ కార్పొరేట్‌ రంగంలో అగ్రగామిగా ఎదగడం అంటే కేవలం డిగ్రీలు ఉండటం కాదు,

గ్లోబల్‌ ఫ్యాషన్‌ రాణి

భారతీయ మహిళలకు కలలు కనే ధైర్యమే కాదు, వాటిని నిజం చేసుకునే సత్తా కూడా ఉంటుందని నిరూపించారు లీనా నాయర్‌. ప్రపంచ కార్పొరేట్‌ రంగంలో అగ్రగామిగా ఎదగడం అంటే కేవలం డిగ్రీలు ఉండటం కాదు, ఒక స్పష్టమైన విజన్‌ ఉండాలని ఆమె జీవితం చాటిచెబుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన అతిపెద్ద విలాసవంతమైన వస్తువుల సంస్థ ‘షనెల్‌’కు గ్లోబల్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టి ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తి పతాకాన్ని ఎగరవేశారామె.

అడుగుల పడ్డాయిలా

లీనా నాయర్‌ జూన్‌ 11, 1969న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఒక సాధారణ హిందూ మలయాళీ కుటుంబంలో జన్మించారు. చదువు విషయంలో ఆమె తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపించేవారు. అప్పట్లో ఆడపిల్లల చదువుపై ఉన్న పరిమితులను దాటుకుని హోలీక్రాస్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో మొదటి బ్యాచ్‌ విద్యార్థినిగా ఆమె విద్యను అభ్యసించారు. ఆ తర్వాత తన లక్ష్యం వైపు ప్రయాణాన్ని వేగవంతం చేశారు. ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. అంతటితో ఆగకుండా మేనేజ్‌మెంట్‌ రంగంపై ఉన్న ఆసక్తితో జంషెడ్‌పూర్‌లోని ప్రతిష్ఠాత్మక ‘ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ’ నుంచి 1992లో ఎంబీయే పూర్తిచేశారు. తన కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన మొట్టమొదటి మహిళగా లీనా అప్పుడే రికార్డు సృష్టించి, భవిష్యత్‌ తరాలకు మార్గదర్శిగా నిలిచారు.

సవాళ్ల మధ్య విజయం

లీనా నాయర్‌ కెరీర్‌ హిందూస్థాన్‌ యూనీలీవర్‌ (హెచ్‌యూఎల్‌)లో ఒక సమ్మర్‌ ఇంటర్న్‌గా ప్రారంభమైంది. అప్పట్లో ఫ్యాక్టరీలు, ఫీల్డ్‌వర్క్‌ అంటే కేవలం పురుషులకే పరిమితం అనే భావన ఉండేది. కానీ 1992లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరిన లీనా ఆ అపోహలను తుడిచిపెట్టేశారు. పారిశ్రామిక ప్రాంతాల్లో, గ్రామీణ మార్కెట్లలో తిరుగుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకున్నారు. ఆమె పనితీరు చూసి యాజమాన్యం ఆశ్చర్యపోయింది. అలా క్రమంగా ఎదిగిన లీనా 2007లో ‘హెచ్‌యూఎల్‌’లో హెచ్‌ఆర్‌ విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అతి పిన్న వయసులోనే మేనేజ్‌మెంట్‌ కమిటీలో చోటు సంపాదించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు యూనీలీవర్‌ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో లండన్‌ని ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆమె అక్కడ గ్లోబల్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఆర్‌వో)గా బాధ్యతలు చేపట్టారు. ఒక ఆసియా మహిళ అంతర్జాతీయ స్థాయి సంస్థలో అటువంటి కీలక పదవి చేపట్టడం అదే తొలిసారి.


షనెల్‌ సీఈవోగా

2021 డిసెంబర్‌లో లీనా నాయర్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఫ్రెంచ్‌ లగ్జరీ గ్రూప్‌ ‘షనెల్‌’ తమ గ్లోబల్‌ సీఈవోగా లీనా నాయర్‌ పేరును ప్రకటించగానే ప్రపంచ బిజినెస్‌ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే, వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆ సంస్థకు ఒక భారతీయురాలు నాయకత్వం వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ బ్రాండ్‌ను నడిపిస్తున్న రెండో మహిళా సీఈవోగా ఆమె బాధ్యతలు చేపట్టారు. 2023 జూలైలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పారి్‌సను సందర్శించినప్పుడు లీనా నాయర్‌ను ప్రత్యేకంగా కలిశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభ ఏ స్థాయిలో ఉందో ఆ సమావేశం మరోమారు నిరూపించింది.

3-Navya.jpg

అవార్డులు.. గుర్తింపులు

లీనా నాయర్‌ ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గౌరవాలు దక్కాయి. రిటైల్‌, వినియోగదారుల పరిశ్రమలో ఆమె చేసిన సేవలకు గాను 2025లో బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ విలియమ్స్‌ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ అంపైర్‌’ అవార్డు అందుకున్నారు. 2021లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఫోర్బ్స్‌ ఆమెకకు 68వ స్థానాన్ని ఇచ్చింది. 2017లో క్వీన్‌ ఎలిజబెత్‌-2 చేతుల మీదుగా కూడా అరుదైన గౌరవాన్ని పొందారు.

వ్యక్తిగత జీవితం

వృత్తిరీత్యా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్‌ను నడిపిస్తున్నప్పటికీ లీనా వ్యక్తిగత జీవితం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఆర్థిక సేవల రంగంలో ఉన్న కుమార్‌ నాయర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇక ఆమె ఆర్థిక విషయానికి వస్తే.. లీనా నాయర్‌ నికర ఆస్తి విలువ సుమారు 40 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 362 కోట్లు). లీనా నాయర్‌ ప్రయాణం నేటి యువతకు ముఖ్యంగా మహిళలకు గొప్ప పాఠం. పరిమితులు మన మెదడులోనే ఉంటాయని, పట్టుదల ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చని ఆమె నిరూపించారు.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 03:57 AM