Share News

అంతరంగంలోకి లక్ష్మిని ఆహ్వానిద్దాం

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:31 AM

సంపదను సాధారణంగా లౌకికమైన విషయంగా లోకం పరిగణిస్తూ ఉంటుంది. అయితే... సంపద అంటే కేవలం ధనం, ఆస్తులు, సుఖాన్ని ఇచ్చే సౌకర్యాలు మాత్రమేనా? కానే కాదు...

అంతరంగంలోకి లక్ష్మిని ఆహ్వానిద్దాం

సహజ యోగ

సంపదను సాధారణంగా లౌకికమైన విషయంగా లోకం పరిగణిస్తూ ఉంటుంది. అయితే... సంపద అంటే కేవలం ధనం, ఆస్తులు, సుఖాన్ని ఇచ్చే సౌకర్యాలు మాత్రమేనా? కానే కాదు. ప్రశాంతమైన మనసు, సంతృప్తికరమైన జీవితం, ధర్మబద్ధమైన ప్రవర్తన, ఇతరుల పట్ల ప్రేమ, బాధ్యతాయుతమైన కుటుంబ జీవితం... ఇవి కూడా సంపదలో భాగాలే. భౌతిక సంపదకు మించిన అంతరంగ సంపదే నిజమైన ఐశ్వర్యం అని నిర్వచించిన మన ఆధ్యాత్మిక సంప్రదాయం... అంతరంగ ఐశ్వర్యానికి ప్రతీకగా శ్రీమహాలక్ష్మీ తత్త్వాన్ని దర్శించింది. ఆ లక్ష్మీ తత్త్వం మన నాభిచక్రంతో ముడిపడి ఉందని సహజయోగ బోధిస్తోంది.

‘‘మనిషిలోని నాభీ చక్రం జీవన సమతుల్యతకు, సంతృప్తికి, ధర్మబద్ధమైన జీవనానికి ప్రతీక’’ అని శ్రీమాతాజీ నిర్మలాదేవి పేర్కొన్నారు. కుటుంబ పోషణ, ఆహారపు అలవాట్లు, దైనందిన క్రమశిక్షణ, ఆర్థిక వ్యవహారాల్లో సమతుల్యత లాంటి అంశాలు ఆ చక్రం సూచించే జీవన విలువలతో సంబంధం కలిగి ఉంటాయి. నాభీ చక్రంలో ప్రతిబింబించే లక్ష్మీ తత్త్వం కేవలం భౌతిక సౌఖ్యాలను మాత్రమే కాకుండా... అంతరంగ ప్రశాంతతను, సంతృప్తిని, జీవితాన్ని సమతుల్యతతో నడిపించగలిగే వివేకాన్ని కూడా సూచిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టిలో ‘ఐశ్వర్యం’ అంటే సంపదను కలిగి ఉండడం మాత్రమే కాదు... దాన్ని ధర్మబద్ధంగా వినియోగించడం, ఉన్నదానితో సంతృప్తి చెందడం. ఇతరుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం కూడా. ప్రతి మనిషిలో కుండలినీ శక్తి అంతర్లీనంగా ఉంటుందని, ఆ శక్తి ఆత్మ సాక్షాత్కార ప్రక్రియలో మేలుకొని, మన శరీరంలోని చక్రాల ద్వారా ఆధ్యాత్మిక పరిణతికి దోహదపడుతుందని, కుండలినీ శక్తి నాభి చక్రాన్ని ప్రభావితం చేసినప్పుడు... మనలోని లక్ష్మీ తత్త్వం మరింత చైతన్యవంతమవుతుందని శ్రీమాతాజీ నిర్మలాదేవి వివరించారు. ఆ మేలుకొలుపును కేవలం ఒక ఆచారంగానో, బాహ్యమైన పూజా విధానంగానో మాత్రమే చూడ కూడదు. మన అంతరంగంలో సద్గుణాలు వికసించే ఆధ్యాత్మిక పరిణామంగా అర్థం చేసుకోవాలి.

గృహస్థ జీవితంలో...

భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమానికి విశిష్టమైన స్థానం ఉంది. ఇంట్లో ధనం ఉండడం మాత్రమే లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణ ప్రమాణం కాదు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం, అనురాగం, నమ్మకం, శాంతి ఉన్నప్పుడు ఆ ఇల్లు నిజమైన ఐశ్వర్యంతో కళకళలాడుతుంది. లక్ష్మీ తత్త్వం అందించే ప్రధాన సందేశం... సంతృప్తి, సమతుల్యత. సంతృప్తి అంటే అభివృద్ధిని కోరుకోకపోవడం కాదు. అత్యాశకు లోనుకాకుండా, ధర్మబద్ధమైన మార్గంలో కృషి చేస్తూ తన దగ్గర ఉన్న దాని విలువను గుర్తించడం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు వివేకంతో తీసుకోగలుగుతాం. కుటుంబం పట్ల మరింత బాధ్యతగా ఉంటాం. ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడకుండా... వారి అభివృద్ధిని ఆనందించగలుగుతాం. ఇలాంటి అంతరంగ పరివర్తనే ఆధ్యాత్మిక ఐశ్వర్యానికి పునాది.


ఆధ్యాత్మిక సంపదకు మార్గం

మనలోని నాభీ చక్రంలో లక్ష్మీ తత్త్వం మేలుకున్నప్పుడు... ఆధ్యాత్మికంగా సమతుల్యమైన జీవనానికి మార్గం సుగమమవుతుంది. బాహ్య సంపదను ఆర్జించడంతో పాటు అంతరంగ సంపదను పెంపొందించుకోవడం కూడా మనిషి కర్తవ్యం. ప్రేమ, సంతృప్తి, ధర్మం, క్రమశిక్షణ, వినయం, పరోపకారం మన జీవితంలో భాగమైనప్పుడు... మన ప్రవర్తనలో లక్ష్మీ తత్త్వం ప్రతిఫలిస్తుంది. నిజమైన ఐశ్వర్యం మన ఇంట్లోని వస్తువులలో కాదు... మన హృదయంలోని ప్రశాంతతలో మన సంబంధాలలోని మాధుర్యంలో, మన చేతలలోని మంచితనంలో ఉంటుంది. లక్ష్మీ దేవిని బాహ్యంగా ఆరాధించడంతోపాటు ఆమె తత్త్వాన్ని మన అంతరంగంలో మేలుకొలుపడమే ఆధ్యాత్మిక సంపదకు అసలైన మార్గం.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఈ వార్తలు కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 06:25 AM