కవ్వించే కుందనాలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:42 AM
ఒకప్పుడు విశేషంగా ఆదరణ పొందిన కుందన్ జ్యువెలరీ సెట్లు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. యువత మెచ్చేలా వజ్రాలు, పచ్చలు, కెంపులు, పోల్కీలు పొదిగి సరికొత్తగా...
ఒకప్పుడు విశేషంగా ఆదరణ పొందిన కుందన్ జ్యువెలరీ సెట్లు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. యువత మెచ్చేలా వజ్రాలు, పచ్చలు, కెంపులు, పోల్కీలు పొదిగి సరికొత్తగా వీటిని ఆవిష్కరిస్తున్నారు డిజైనర్లు. రకరకాల డిజైన్లలో చిన్న, పెద్ద కుందనాలతో కూర్చిన చోకర్లు, విక్టోరియా హారాలు, స్టేట్‌మెంట్ ఉంగరాలు, జుంకాలను మహిళలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
నామ మాత్రపు బంగారంతో గ్రాండ్‌గా రూపొందించిన కుందన్ సెట్లు బడ్జెట్‌లోనే దొరుకుతుండడంతో అమ్మాయిలంతా వాటివైపే మొగ్గుచూపుతున్నారు.
కుందన్ డిజైనింగ్‌ను జాడౌ వర్క్ అంటారు. ఇది రాజస్థాన్‌లో ఆవిర్భవించిన ప్రాచీన సాంప్రదాయ కళారూపం. మొఘలుల కాలంలో దీనికి విశేష ప్రాచుర్యం లభించింది. ఇందులో ఘడాయి, ఖుధాయి, మీనాకారీ, జడాయి, ఫినిషింగ్ దశలు ఉంటాయి. బంగారాన్ని బాగా వేడిచేసి మెత్తబరిచి డిజైన్ కోసం బేస్ ఫ్రేమ్‌ను సిద్ధం చేయడం ఒక విధానమైతే బంగారు రేకు మీద నమూనాలను చెక్కడం మరో పద్ధతి. ఇలా విభిన్నమైన డిజైన్లలో రూపొందించిన భారీ కుందన్ సెట్లకు దేశ విదేశాల్లో అత్యధికంగా డిమాండ్ ఉంటోంది.
24 కేరట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన పలుచని రేకుని ‘కుందన్’గా పరిగణిస్తారు. దీని సహాయంతో రత్నాలు, అన్ కట్ డైమండ్స్, రకరకాల గాజు రాళ్లు, ఖరీదైన రంగురాళ్లను చక్కని డిజైన్లలో పొందికగా కూరుస్తారు. వీటి మధ్య వ్యాక్స్ లేదా యాంటిమొనీని నింపుతారు. ఇలా బంగారు రేకులు పట్టి ఉంచడం వల్ల రత్నాల మెరుపుదనం చెక్కుచెదరకుండా ఉంటుంది. అడుగు భాగంలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో ఉండే మీనాకారీ ఎనామిల్‌ను అప్లయ్ చేస్తారు. దీనివల్ల కుందన్ ఆభరణాలు ఎక్కువకాలం మన్నికగా చెక్కు చెదరకుండా తరతరాలుగా నిలిచి ఉంటాయి.
వివాహాది శుభకార్యాలు, పండుగలు, పుట్టినరోజు లాంటి ప్రత్యేక సందర్భాల్లో కుందన్ జ్యువెలరీని ధరించడం హోదాకు, హుందాతనానికి ప్రతీకగా నిలుస్తోంది. అమ్మాయిలకు కుందన్ సెట్లను బహుమతిగా ఇవ్వడం అనాదిగా కొనసాగుతోంది కూడా! టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తరచూ కుందన్ సెట్లు ధరించి తళుక్కుమంటూ ఉంటారు. నెమళ్లు, హంసలు, పువ్వులు, కొమ్మలులాంటి ప్రకృతి పరమైన డిజైన్లతో తయారుచేసిన అందమైన కుందనాల ఆభరణాలు నేడు ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తున్నాయి. ఎంబ్రాయిడరీ, జర్దోసి వర్క్‌లతో నిండిన భారీ లెహంగాల మీద ఇవి చక్కగా నప్పుతాయి. పట్టు చీరలు, లంగా ఓణీ, అనార్కలీ డ్రెస్‌ల మీద సాంప్రదాయపరమైన గ్రాండ్ లుక్‌నిస్తాయి. ఫ్రాక్, లాంగ్ స్కర్ట్, షార్ట్ స్కర్ట్ లాంటి ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లపైన కూడా సొగసుగా సూటవుతాయి. ఒకే రకమైన కుందన్ డిజైన్‌తో రూపొందించిన చోకర్ లేదా హారం, జుంకాలు, పాపిడి బిళ్ల, గాజులు, ఉంగరాలను ధరించడం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్.
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..