బృందావనంలో దొంగ దూడ
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:21 AM
నందవ్రజంలో జరుగుతున్న హఠాత్ పరిణామాలు, ఊహకు అందని ప్రమాదాలు అక్కడి ప్రజలకు బోధపడడం లేదు. నందవ్రజాన్నీ ఏవో దుష్ట శక్తులు ఆవహించాయని వారు అనుకున్నారు. ‘ఎన్నడూ లేనిది..
భాగవతం
నందవ్రజంలో జరుగుతున్న హఠాత్ పరిణామాలు, ఊహకు అందని ప్రమాదాలు అక్కడి ప్రజలకు బోధపడడం లేదు. నందవ్రజాన్నీ ఏవో దుష్ట శక్తులు ఆవహించాయని వారు అనుకున్నారు. ‘ఎన్నడూ లేనిది ఎక్కడెక్కడి రాక్షసులో మన ఊళ్ళోకి వచ్చి హతులవడం, అంత పెద్ద మద్దిచెట్లు కూలిపోవడం మహా ఉత్పాతాలు కాకపోతే మరేమిటి? ముఖ్యంగా మన చిన్ని కృష్ణయ్యకు ఆపదల మీద ఆపదలు వచ్చి పడుతున్నాయి. అతనికి ఏమైనా అయితే భరించగలమా? తక్షణం మరో చోటికి వెళ్ళి నిశ్చింతగా ఉందాం’ అనుకున్నారు. వెంటనే గోకులంలోని గోవుల్నీ, దూడల్నీ తీసుకొని, సంసారాలతో ఆబాలంగోపాలం బృందావనానికి తరలివెళ్ళారు. అక్కడ ఇళ్ళూ, వాకిళ్ళూ ఏర్పరుచుకున్నారు. బృందావనం పచ్చగా ఉంది. పశుగ్రాసానికి లోటే లేదు. యమునా నదిలో నీలాల లాంటి నీరు చల్లగా ప్రవహిస్తోంది. బలరామకృష్ణులు సావాసగాళ్ళతో కలిసి యమునలో ఈదుతున్నారు. మధ్య మధ్యలో నందీశ్వర, గోవర్ధన పర్వతాల పైకి వెళుతున్నారు. ఆటపాటలు, నవ్వులు, వినోదాలతో వాళ్ళకు అంతా సుఖంగా, సంతోషంగా ఉంది.
మాయావికి మర్యాద
ఒకనాడు బలరామకృష్ణులు స్నేహితులతో కలిసి లేగదూడలను తోలుకుని యమునా తీరానికి వెళ్ళారు. కంసభృత్యుడైన , లేగదూగ రూపంలో ఉన్న రాక్షసుడొకడు కృష్ణయ్యను వెతుక్కుంటూ అక్కడికి వచ్చి మందలో కలిశాడు. గోకులంలో ఎవరూ అది గమనించలేదు. ‘ఈ కొత్త లేగ దూడ ఎక్కడిది?’ అనే అనుమానం కూడా వాళ్ళకు, బలరాముడుకి కూడా రాలేదు. కొంతసేపు ఆటపాటలు సాగిన తర్వాత బలరాముణ్ణి పక్కకు పిలిచి ‘‘ఆ దూడను చూశావా? మనకోసం అది కంసమామ దగ్గర నుంచి వచ్చింది. వాడు రాక్షసుడు. మాయావి. వాడికి మనం మర్యాద చేద్దాం’’ అంటూ దాని దగ్గరకు వెళ్ళాడు. అమాంతంగా దాన్ని పట్టుకొని, గిరగిరా తిప్పి ఒక వెలగ చెట్టుకేసి కొట్టాడు. ఆ దెబ్బకు ఆ రాక్షసుడు పెద్దగా గావుకేక పెట్టి, నిజరూపంలోనికి మారి ప్రాణాలు వదిలాడు. ఇది చూసిన గోపబాలురందరూ ‘‘భలే భలే’’ అంటూ కృష్ణయ్యను భుజాల మీదకు ఎక్కించుకొని ఊరేగించారు.
ధేనువు శాపం
చనిపోయిన ఆ రాక్షసుడి పేరు ప్రమీలుడు. ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న నందినీ ధేనువును చూశాడు. అది తనకు కావాలనుకునుకున్నాడు. వెంటనే సన్యాసి రూపంలో వెళ్ళి ఆ ధేనువును తనకు దానమివ్వమని కోరాడు. వశిష్ఠుడు మౌనం వహించి ఊరుకున్నాడు. ప్రమీలుని మోస ప్రవృత్తిని నందిని గ్రహించింది. ‘‘నువ్వు దేన్ని కోరి మహర్షిని మోసం చేద్దామనుకుంటున్నావో ఆ రూపాన్నే ధరించు’’ అని శపించింది. శాపగ్రస్తుడైన ప్రమీలుడు మహర్షికీ, నందినికీ నమస్కరించి శాప విమోచనం కలిగించమని వేడుకున్నాడు. నందిని జాలి పడింది. ‘‘శ్రీహరి గోపబాలుడై బృందావనంలో విహరిస్తున్నప్పుడు నిన్ను సంహరిస్తాడు. అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది’’ అని చెప్పింది. అందుకే ప్రమీలుడు లేగదూడగా మారి బృందావనంలోని దూడల్లో కలిసిపోయాడు. కృష్ణయ్య అది తెలుసుకొని అతనికి శాపవిముక్తి కలిగించాడు.
ప్రయాగ రామకృష్ణ
ఈ వార్తలు కూడా చదవండి..
ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News