దెయ్యాలు కట్టిన దేవాలయం!
ABN , Publish Date - May 15 , 2026 | 04:05 AM
క్షేత్ర మహత్యాలకు, నిర్మాణ కౌశలానికి, విలక్షణమైన ఆరాధనా విధానాలకు ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే... మధ్యప్రదేశ్‌లోని కాకన్మఠ్ ఆలయం నిర్మాణశైలికే కాదు...
ఆలయదర్శనం
క్షేత్ర మహత్యాలకు, నిర్మాణ కౌశలానికి, విలక్షణమైన ఆరాధనా విధానాలకు ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే... మధ్యప్రదేశ్‌లోని కాకన్మఠ్ ఆలయం నిర్మాణశైలికే కాదు, ఆశ్చర్యకరమైన అనేక అంశాలకు నెలవు. దేవతలంటే దెయ్యాలు పారిపోతాయంటారు. కానీ ఈ గుడిని దెయ్యాలే కట్టాయంటారు భక్తులు. దాదాపు వెయ్యేళ్ళ క్రితం నిర్మితమైన ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
కుష్వాహ వంశానికి చెందిన రాజు కీర్తిరాజ్ భార్య కాకనవతీదేవి శివభక్తురాలు. శివుడికి తమ రాజ్యంలో ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టించాలని ఆమె సంకల్పించింది. ఆమె కోరిక ప్రకారం ఆలయ నిర్మాణాన్ని కీర్తిరాజ్ క్రీస్తుశకం 1015 సమయంలో చేపట్టాడని చరిత్రకారులు చెబుతున్నారు. నిర్మాణపరంగానూ ఈ ఆలయం విశేషమైనదే. సుమారు 120 అడుగుల ఎత్తుతో చేపట్టిన ఈ నిర్మాణంలో ఎక్కడా సున్నం లాంటివి వినియోగించలేదు. భారీగా ఉండే రాళ్ళను ఒకదాని మీద ఒకటి సమతుల్యతతో పేర్చారు. అవి ఏమాత్రం కదిలినా ఆలయం కూలిపోతుందనీ, కానీ వెయ్యేళ్ళయినా, ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవించినా ఇది చెక్కుచెదరకుండా ఉందనీ, ఈ నిర్మాణం వెనుక ఉన్న వాస్తుశైలి, గణితసూత్రాలు శాస్త్రవేత్తలకే అంతుచిక్కలేదనీ ఆలయవర్గాలు అంటున్నాయి. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో విదేశీయుల దండయాత్రల్లో ఆలయంలో కొంతభాగం ధ్వంసమయింది. కానీ ప్రధాన నిర్మాణం ఇంకా నిలిచే ఉంది.
రాత్రి కాగానే వింత శబ్దాలు
కాగా... ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయనేది స్థానిక ప్రజల విశ్వాసం. దాని ప్రకారం... పొలాల్లో ఉన్న రాళ్ళను దెయ్యాలు ఒక రాత్రి సమయంలో తీసుకువచ్చి... చక్కటి క్రమపద్ధతిలో దీని నిర్మాణం ఆరంభించాయి. ఆలయం పూర్తయ్యేలోగా సూర్యోదయం కావడంతో... దాన్ని అసంపూర్తిగా వదిలేసి మాయమైపోయాయి. ఈ కారణంగానే ఈ గుడిలో కొంత భాగం పూర్తికాకుండా కనిపిస్తుందని స్థానికులు చెబుతారు. దీన్ని దెయ్యాలు కట్టాయనడానికి తార్కాణం... ఆలయంలో రాత్రివేళ వినిపించే వింత వింత శబ్దాలేనని వారి వాదన. పూర్వం... గర్భాలయం నుంచి వింత శబ్దాలను గ్రామస్తులు గమనించారట. అప్పటినుంచి సాయంత్రం దాటాక అటువైపు ఎవరూ వెళ్ళరు. ఈ శబ్దాలకి కారణం ఎవరూ కనిపెట్టలేకపోయారనీ, అదే ఈ ఆలయ రహస్యమనీ చెబుతారు భక్తులు. కాకన్మఠ్ ఆలయంలో కొలువైన శివుణ్ణి దర్శించి పూజించినవారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయనేది వారి నమ్మకం. మొత్తానికి... చరిత్ర, శిల్పకళ, అంతుపట్టని అంశాల కథలు కలిసి దీన్ని కాకన్మఠ్ గుడిని మార్మికమైన ప్రదేశంగా మార్చాయి. ఇది మఽధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లా సిహోనియాలో... గ్వాలియర్‌కు దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News