ఆచార్య సరాహ
ABN , Publish Date - Jun 12 , 2026 | 03:25 AM
బౌద్ధ తత్త్వవేత్తగా ఆచార్య నాగార్జునుడు సుప్రసిద్ధుడు. తెలుగువాడైన ఆయనకు తంత్రవిద్యలోనూ ప్రవేశం ఉంది. దాన్ని నాగార్జునుడికి సరాహ (రాహులభద్రుడు) అనే...
దర్మపథం
బౌద్ధ తత్త్వవేత్తగా ఆచార్య నాగార్జునుడు సుప్రసిద్ధుడు. తెలుగువాడైన ఆయనకు తంత్రవిద్యలోనూ ప్రవేశం ఉంది. దాన్ని నాగార్జునుడికి సరాహ (రాహులభద్రుడు) అనే గురువు బోధించాడు. సరాహ ఆ విద్యను పొందడానికి సంబంధించి ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది.
శ్రీకీర్తి అనే బౌద్ధ గురువు దగ్గర సరాహ శిష్యరికం చేశాడు. ఆ సమయంలోనే... అతను ధ్యానంలో ఉండగా... బాణం ఎక్కుపెట్టిన ఒక మహిళామూర్తి ఆయనకు దర్శనమిచ్చింది. గురువు అనుమతితో ఆమెను వెతుకుతూ సరాహ బయలుదేరాడు. రద్దీగా ఉన్న సంతలో... ఒక స్త్రీ బాణాన్ని తయారు చేసి, వింటికి సంధించి, ఒక కన్ను మూసి, ఏదో వస్తువుపై గురిపెట్టి కూర్చున్న దృశ్యం అతనికి కనిపించింది. తన కలలో కనిపించిన మహిళ ఆమేనని గుర్తించాడు. ఆమె సరాహను చూసి నవ్వి ‘‘వచ్చేశావా! నీ గ్రంథాలను, సిద్ధాంతాలను ఇక కట్టిపెట్టు. పనిలో ఏకాగ్రతతో నిమగ్నమై, లక్ష్యాన్ని ఛేదించే సాధన ప్రారంభించు’’ అంది. శ్మశానం ఆవరణలో తాను నివసించే కుటీరానికి అతణ్ణి తీసుకువెళ్ళింది. ఆమె సాధారణ మహిళ కాదు. బౌద్ధ తంత్ర విద్యలో ఆరితేరిన మేటి గురువు. ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి. ఆమె పర్యవేక్షణలో తాంత్రిక విద్యను సరాహ నేర్చుకోవడం ప్రారంభించాడు. శవ దహనాలు, అంత్యక్రియలు ఒక వైపు జరుగుతూ ఉండగా, మరోవైపు మరణించినవారి బంధువుల రోదనలు వినిపిస్తూ ఉండగా... సరాహ తంత్ర సాధనను కొనసాగించాడు. ఆ సాధనలోని వివిధ ప్రక్రియల్లో పారవశ్యాన్ని చవిచూసేవాడు, ఆనందంతో ఆడేవాడు, పాడేవాడు.
ఈ తతంగమంతా ఆ రాజ్య పాలకుడైన మహాపాలుడి చెవిన పడింది. ఆ రాజుకు సరాహ సుపరిచితుడు. సరాహ వివేకానికి, జ్ఞానానికి ముగ్ధుడై... తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని కూడా రాజు అనుకున్నాడు. అలాంటి వ్యక్తి శ్మశానంలో ఉన్మాదిలా గంతులు వేస్తున్నాడని తెలియగానే... సరాహను సన్మార్గంలో పెట్టాలని రాజు నిశ్చయించాడు. సరాహను తీసుకురావలసిందిగా పురప్రముఖులను పంపించాడు. వారికి జీవిత సత్యాలతో కూడిన 160 తత్త్వ గీతాలను సరాహ పాడి వినిపించాడు. వారు మైమరచిపోయి శ్మశానంలోనే ఉండిపోయారు. అనంతరం తన రాణిని ఆ రాజు పంపించాడు సరాహ 80 గీతాలను వినిపిస్తే... ఆమె తన్మయత్వంలో మునిగిపోయింది. చివరికి స్వయంగా రాజే సపరివారంగా శ్మశానానికి వచ్చాడు. అక్కడ జరుగుతున్నదంతా చూసి నిశ్చేష్టుడయ్యాడు. రాజును చూసిన సరాహా... 40 అద్భుతమైన గీతాలను గానం చేశాడు. దాంతో అన్నీ మరచిపోయిన రాజు... అక్కడ ఉన్నవారితో కలిసి నృత్యం చేశాడు.
అలా... ఆ మహిళ దగ్గర నేర్చుకున్న తంత్ర విద్యకు సరాహా మరిన్ని మెరుగులు దిద్ది... ‘గుహ్య సమాజ తంత్రా’న్ని రూపొందించాడు. దాన్ని తన శిష్యుడైన నాగార్జునుడికి అందించాడు. తదనంతరం ఆ తంత్ర విద్య టిబెట్‌కు చేరిందనీ, ఆ ప్రాంతం ఆ విద్య ప్రభావానికి లోనయిందనీ చరిత్ర చెబుతోంది.
రాచమడుగు శ్రీనివాసులు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News