జీవితం పరిపూర్ణం కావాలంటే...
ABN , Publish Date - Jun 12 , 2026 | 03:22 AM
మీరు మీ జీవితాన్ని నిశితంగా ఎప్పుడైనా పరిశీలించారా? మీరు దాదాపు డెబ్భయ్యేళ్ళు జీవిస్తారని అనుకుందాం. ఇప్పుడు ఆ కాలాన్ని విశ్లేషించి చూద్దాం. రోజూ...
చింతన
మీరు మీ జీవితాన్ని నిశితంగా ఎప్పుడైనా పరిశీలించారా? మీరు దాదాపు డెబ్భయ్యేళ్ళు జీవిస్తారని అనుకుందాం. ఇప్పుడు ఆ కాలాన్ని విశ్లేషించి చూద్దాం. రోజూ దంతధావనం, స్నానం చెయ్యడం లాంటి నిత్యకృత్యాలకు దాదాపు రెండు గంటలు పడుతుంది. అంటే సుమారు ఏడేళ్ళు ఖర్చవుతాయి. తినడం, తాగడం కోసం మరో ఏడేళ్ళు వెచ్చించవలసి వస్తుంది. నిద్రపోవడానికి ఎక్కువ సమయం కావాలి. అంటే సుమారు ఇరవై నుంచి ముప్ఫయ్యేళ్ళు. ఇలా ప్రతిదాన్నీ విభజించి చూసినప్పుడు... మీరు నిజమైన ఆనందంతో నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ గడిపిన క్షణాలను లెక్కిస్తే... మూడు నుంచి నాలుగేళ్ళు మాత్రమే ఉంటాయి. జీవించడానికి సన్నద్ధమయ్యే క్రమంలో... మనం జీవించడం మరచిపోతాం. సంతోషాన్ని, సంతృప్తిని వాయిదా వేస్తూనే ఉంటాం. ఇది రాత్రంతా దుప్పట్లు, పరవడం, దిండ్లు సరిచేసుకోవడం లాంటి పనులే చేస్తూ గడపడం లాంటిది. ఈలోగా తెల్లారిపోతుంది. విశ్రాంతి తీసుకోడానికి సమయం మిగలదు. శాంతితో, ఆనందంతో లేదా దైవంతో గడిపే నిశ్చలమైన క్షణాలను ఆస్వాదించకుండా... నాలుగు తరాలకు సరిపడా సంపదను కూడబెట్టడంలోనే కొందరు తమ జీవితాలను గడిపేస్తూ ఉంటారు. కాబట్టి... మీ జీవితం పట్ల మీకు ఎంత సంతృప్తి ఉందన్నదే అసలు ప్రశ్న.
అదే భరోసా
మనకు దైవంతో అనుబంధం ఒక్క క్షణంలోనే చిగురించవచ్చు. నిశ్శబ్దంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. దైవం తాలూకు సాన్నిహిత్యాన్ని, ప్రేమను అనుభవించండి. మీరు దైవానికి అత్యంత ప్రియమైనవారనే విషయం దృఢంగా తెలుసుకోవడం నుంచే నిజమైన పరిపూర్ణత వస్తుంది. ఈ విషయాన్ని లోతుగా మీరు గ్రహించిన మరుక్షణమే మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. అమ్మ వంట చేసిందో, లేదో అని పిల్లలు ఎప్పుడూ ఆందోళన చెందరు. అమ్మ ఇంట్లో ఉందన్న మాటే వారికి చాలు. అమ్మ ఉనికే వారికి భరోసా. అలాగే దేవుడు మీతోనే ఉన్నాడనీ, ఆయన మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకోండి. ఆ భావనే పరివర్తనకు నాంది. దీనికోసం మీరు ఏళ్ళ తరబడీ సాధన చెయ్యాల్సిన అవసరం లేదు. పర్వతాలు ఎక్కనవసరం లేదు, సముద్రాన్ని ఈది దాటవలసిన అవసరం లేదు. నిశ్శబ్దంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. దైవ సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందండి. ఆ ప్రేమను అనుభవించండి. ఆ తరువాత మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ దైవానుగ్రహం ప్రవహించడం ఎలా ఆరంభమవుతుందో చూడండి.
శ్రీశ్రీ రవిశంకర్
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News