Indian Woman Major Swati Shantakumat: శాంతి పథంలో భారతనారి
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:27 AM
యుద్ధక్షేత్రంలో తుపాకి పట్టడమే కాదు.. విద్వేషాలు సెగలు కక్కుతున్న చోట శాంతిని నెలకొల్పడంలోనూ భారతీయ మహిళా శక్తి సాటిలేనిదని నిరూపించారు మేజర్ స్వాతి శాంతకుమార్. ఐక్యరాజ్య సమితి...
యుద్ధక్షేత్రంలో తుపాకి పట్టడమే కాదు.. విద్వేషాలు సెగలు కక్కుతున్న చోట శాంతిని నెలకొల్పడంలోనూ భారతీయ మహిళా శక్తి సాటిలేనిదని నిరూపించారు మేజర్ స్వాతి శాంతకుమార్. ఐక్యరాజ్య సమితి అందించే అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకుని అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించారు.
ఎప్పుడు ఏవైపు నుంచి బుల్లెట్లు దూసుకొస్తాయో తెలియని అస్థిరత ఒకవైపు.. అడుగడునా ఘర్షణలు, భయం నీడన బతుకుతున్న వేలాది మంది మహిళలు మరోవైపు.. దక్షిణ సూడాన్‌లోని పరిస్థితి ఇది. అటువంటి గడ్డపై శాంతి పరిరక్షణ కోసం వెళ్లిన ఐక్యరాజ్య సమితి బృందంలోని ఒక భారతీయ అధికారిణి తనదైన ముద్రవేశారు. ఆమె మరెవరో కాదు, బెంగళూరుకు చెందిన మేజర్ స్వాతి శాంతకుమార్. ఐక్యరాజ్య సమితి మిషన్‌లో ఆమె చేసిన కృషికి గాను ‘యూఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు 2025’ వరించింది.
సామాన్యుల గుండెల్లో ధైర్యం
మేజర్ స్వాతి చేపట్టిన ‘ఈక్వల్ పార్ట్‌నర్స్.. లాస్టింగ్ పీస్’ అనే ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల నుంచి వచ్చిన నామినేషన్లలో అత్యుత్తమంగా నిలిచింది. లింగ సమానత్వం, మహిళల భాగస్వామ్యంపై ఆమె చూపిన చొరవకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐక్యరాజ్య సమితి సిబ్బంది ఓటు వేసి మరీ ఆమెను విజేతగా నిలబెట్టారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆమె కృషిని కొనియాడారు.
సరిహద్దులు దాటిన సేవా నిరతి
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో కేవలం భద్రత కల్పించడమే కాకుండా, అక్కడి మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపడంలో స్వాతి విజయవంతమయ్యారు. ఆమె నేతృత్వంలోని బృందం మారుమూల గ్రామాల వరకు పెట్రోలింగ్ నిర్వహించి దాదాపు 5 వేలమందికిపైగా మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించింది. దీనివల్ల వారు తమ సామాజికవర్గ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం లభించింది. నదీ పరివాహక ప్రాంతాలతోపాటు వైమానిక గస్తీలు నిర్వహిస్తూ స్థానికుల్లో నమ్మకం కలిగించారు.
ముగ్గురు ఆడపిల్లల తండ్రి కల
మేజర్ స్వాతి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ముగ్గురు కుమార్తెల్లో పెద్దమ్మాయి అయిన స్వాతి చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఆ పట్టుదలే ఆమెను ఈ రోజు అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. కన్నవారికి గర్వకారణంగా నిలవడమే కాకుండా నేటి తరం అమ్మాయిలకు మేజర్ స్వాతి ఒక రోల్‌మోడల్‌గా నిలిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News