How to Identify Adulterated Jaggery: బెల్లం కల్తీ గుర్తించేదెలా..
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:02 AM
సంక్రాంతి పండక్కి అరిసెలు, గవ్వలు లాంటి తీపి వంటకాలు తయారుచేసేందుకు బెల్లాన్ని ఎక్కువగా కొంటూ ఉంటాం. ఈ బెల్లంలో ఏదైనా కల్తి కలిసిందో లేదో ఎలా గుర్తించాలో...
సంక్రాంతి పండక్కి అరిసెలు, గవ్వలు లాంటి తీపి వంటకాలు తయారుచేసేందుకు బెల్లాన్ని ఎక్కువగా కొంటూ ఉంటాం. ఈ బెల్లంలో ఏదైనా కల్తి కలిసిందో లేదో ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...
చెరకు రసంతో తయారుచేసిన బెల్లానికి తియ్యటి వాసన ఉంటుంది. బెల్లం అచ్చులను రాయితో కొట్టి ముక్కలు చేసేటప్పుడు కూడా చెరకు వాసన తెలుస్తుంటుంది. అలాకాకుండా రసాయనాల వాసన లేదంటే చక్కెర మాడిన వాసన వచ్చినా, బెల్లాన్ని చేతుల్లోకి తీసుకోగానే అసహజమైన వాసనగా అనిపించినా దాన్ని కొనకపోవడమే మంచిది.
ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిన్న బెల్లం ముక్కను వేస్తే అది మునిగి మెల్లగా కరుగుతుంది. తరువాత నీళ్లు స్పష్టంగా కనిపిస్తుంటే అది మంచి బెల్లమని గుర్తించవచ్చు. బెల్లం త్వరగా కరిగినా, నీళ్లు మందంగా మురికిగా మారినా కల్తీ జరిగిందని తెలుసుకోవచ్చు.
చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే తియ్యగా అనిపిస్తూ చెరకు రుచి గుర్తుకు రావాలి. అలా కాకుండా తియ్యదనం ఎక్కువగా ఉందనిపించినా, నాలికమీద చేదుగా అనిపించినా, గొంతులో మంట ఏర్పడినా బెల్లాన్ని కల్తీ చేసినట్లు తెలుసుకోవాలి.
బెల్లాన్ని గుండ్రాయి లేదా రోకలితో దంచినప్పుడు సులభంగా విరగాలి. చేత్తో తాకితే మెత్తగా ఉందన్న భావన రావాలి. అలా కాకుండా ఎంత గట్టిగా దంచినప్పటికీ బెల్లం గడ్డ విరగకపోయినా, జిగురుతో సాగుతూ ఉన్నా దాన్ని వాడకూడదు.
బెల్లం సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. దీనికి ఎలాంటి మెరుపు ఉండదు. పసుపు రంగులో ప్రకాశవంతంగా కనిపిస్తే రసాయనాలు లేదా కృత్రిమ రంగులు కలిపినట్లు తెలుసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More AP News And Telugu News