Share News

ఆపద్బాంధవులు

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:49 AM

వణుకు పుట్టించే హిమపాతాలు.. విరిగిపడే కొండ చరియలు.. అడవి జంతువులు... వీటన్నింటినీ ఎదుర్కొంటూ హిమాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల పల్లెలను ప్రపంచంతో...

ఆపద్బాంధవులు

వణుకు పుట్టించే హిమపాతాలు.. విరిగిపడే కొండ చరియలు.. అడవి జంతువులు... వీటన్నింటినీ ఎదుర్కొంటూ హిమాచల్‌ ప్రదేశ్‌లోని మారుమూల పల్లెలను ప్రపంచంతో కలుపుతున్నారు మహిళా పోస్టుమాస్టర్లు. కరెంటు సరిగా ఉండని, ఫోన్‌ సిగ్నల్‌ దొరకని ఆ కొండల్లో వీరే ఆపద్బాంధవులు.

హిమాచల్‌ ప్రదేశ్‌ అనగానే పర్యాటకులకు మంచు కొండలు, అందమైన లోయలు గుర్తొస్తాయి. కానీ, అక్కడి స్థానికులకు ఆ కొండలే జీవన పోరాట వేదికలు. ముఖ్యంగా కమ్యూనికేషన్‌ సౌకర్యాలు అంతగా లేని మారుమూల గ్రామాలకు సమాచారాన్ని, ప్రభుత్వ ఫలాలను చేరవేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ కఠినమైన బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సుమారు 200 మంది మహిళలు ‘గ్రామీణ డాక్‌ సేవక్‌’లుగా నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తున్నారు.

పకృతి ఒడిలో ప్రమాదకర ప్రయాణం

సిర్మౌర్‌ జిల్లాలోని సరసూ పోస్ట్‌ ఆఫీస్‌ పరిధిలో పనిచేసే రక్ష కథ వింటే ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. రోజుకు కనీసం 10 నుంచి 12 కిలోమీటర్లు కొండ మార్గాల్లో నడక ఆమె దినచర్య. ఎండలు మండే వేసవి అయినా, గడ్డకట్టే చలికాలం అయినా ఆమె అడుగు ఆగదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ దారులన్నీ నరకాన్ని చూపిస్తాయి. బురదతో నిండిన జారుడు మార్గాలు, దట్టమైన పొదల్లో పొంచి ఉండే విష కీటకాలు, పాములు, అడవి జంతువుల మధ్య ఆమె ప్రయాణం సాగుతుంది. ‘‘నేను సుమారు 15 గ్రామాలకు ఉత్తరాలు, పెన్షన్లు చేరవేయాలి. అది ఎంత ప్రమాదకరమైనా సరే. వృద్ధులు నా కోసం ఎదురుచూస్తుంటారు. ఆ బాధ్యత ముందు ప్రాణభయం చిన్నబోతుంది’’ అంటారు రక్ష.


ఆశ్చర్యం నుంచి ఆత్మీయత దాకా

మారుమూల పల్లెల్లో ఒకప్పుడు మహిళలు బయటకు వచ్చి పనిచేయడమే వింత. అలాంటిది చేతిలో ఉత్తరాల సంచితో ఒక మహిళ ఊర్లోకి రావడం చూసి ఒకప్పుడు గ్రామస్థులు ఆశ్చర్యపోయేవారు. ఉనా జిల్లాలో పనిచేస్తున్న శిల్పకు పదేళ్ల క్రితం ఇలాంటి అనుభవమే ఎదురైంది. కానీ, కాలక్రమేణా ఆ ఆశ్చర్యం ఆదరణగా మారింది. నేడు శిల్ప కనిపిస్తే చాలు గ్రామస్థులు ఎదురెళ్లి మరీ మంచినీళ్లు ఇచ్చి భోజనం చేయాలని బలవంతం చేస్తారు. మండి జిల్లాలోని షబ్నం అనుభవం కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో నడవలేక ఇబ్బంది పడుతుంటే గ్రామస్థులే స్వచ్ఛందంగా ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ఊర్లలో దించేవారు. పల్లె ప్రజలు చూపే ఈ మమకారమే తమ కష్టాన్ని మరిపిస్తుందని ఈ పోస్టల్‌ మహిళలు గర్వంగా చెబుతారు.

అడవి దారుల్లో అక్షర జ్యోతులు

కులు జిల్లాకు చెందిన మోహిని ప్రతిరోజు జనావాసాలు లేని అడవి దారుల గుండా నడవాల్సి ఉంటుంది. మంచు కురిసినప్పుడు కొండదారులు అత్యంత ప్రమాదకరంగా మారతాయి. అడుగు పక్కన పెడితే అగాధమే అయినప్పటికీ 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్‌ డబ్బులు అందజేయడం తన విధిగా ఆమె భావిస్తుంది. ఆ డబ్బు కోసమే కాకుండా పట్టణాల్లో ఉన్న తమ పిల్లలు రాసే ఉత్తరాల కోసం ఆ వృద్ధులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఆ ఆశను మోసుకు వెళ్లే రాయబారుల్లా ఈ మహిళలు కనిపిస్తారు. కేవలం రూ. 12 వేల నుంచి రూ. 16 వేల వేతనం పొందుతున్నప్పటికీ వారు చేసే పని మాత్రం వెలకట్టలేనిది.

సవాళ్లు దాటుకుంటూ

ఈ మహిళా పోస్ట్‌మాస్టర్లకు కేవలం ప్రకృతితోనే కాదు, సామాజిక సవాళ్లతో కూడా పోరాటం తప్పడం లేదు. పెళ్లయ్యాక అత్తగారిల్లు దూరమైతే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం కష్టమవుతోంది. ఇలాంటి ఇబ్బందులను గమనించిన పోస్టల్‌ శాఖ మహిళా సిబ్బంది కోసం బదిలీ నిబంధనల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. పట్టణాల్లో పనిచేసే గుడ్డిదేవి వంటి వారు కూడా మరో రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లకు నంబర్లు ఉండకపోవడం, తెలియని వ్యక్తుల మధ్య భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ వారు వెనకడుగు వేయడం లేదు. భయంపై బాధ్యతను గెలిపిస్తూ సాగుతున్న ఈ మహిళా డాక్‌ సేవకులు హిమాచల్‌ గడ్డపై సాహసానికి ప్రతిరూపాలుగా అభినందనలు అందుకొంటున్నారు.

Also Read:

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 01:49 AM