Share News

వైవిధ్యమే ప్రాణంగా

ABN , Publish Date - Jul 27 , 2026 | 05:57 AM

కొన్ని పాత్రలు ప్రేక్షకుడిని కథలో లీనం చేసి... ఆద్యంతం తమతో నడిపిస్తాయి. వాటిని ధరించిన నటులను మరిపించి... ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాత్రలనే తన...

వైవిధ్యమే ప్రాణంగా

విన్నర్‌

కొన్ని పాత్రలు ప్రేక్షకుడిని కథలో లీనం చేసి... ఆద్యంతం తమతో నడిపిస్తాయి. వాటిని ధరించిన నటులను మరిపించి... ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాత్రలనే తన చిరునామాగా మార్చుకుని... వెండితెరపై నిత్యనూతనంగా వెలిగిపోతున్న నటి... యామీ గౌతమ్‌ ధర్‌. అలియా... దీపిక లాంటి క్వీన్‌లు బాలీవుడ్‌ను ఏలుతున్నా... తనదైన శైలితో... వరుస చిత్రాలతో... పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాందించుకున్న తార ఆమె. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న యామి... ప్రతిభావంతమైన నటిగానే కాకుండా... ఇల్లాలిగా... బిడ్డకు తల్లిగా నిజ జీవితంలోనూ బహుముఖ పాత్రలను విజయవంతంగా పోషిస్తోంది.

‘ఆర్టికల్‌ 370’ చిత్రంలో అద్భుతమైన నటనకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది యామీ గౌతమ్‌. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి హోదాను కల్పించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని 2019లో కేంద్రం రద్దు చేసింది. దీని ఆధారంగా రూపొందిన రాజకీయ థ్రిల్లర్‌... ‘ఆర్టికల్‌ 370’. ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో దీనికి మూడు ప్రధాన అవార్డులు దక్కాయి. ఉత్తమ నటితోపాటు ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ సంగీతం పురస్కారాలను కూడా గెలుచుకుంది. అత్యధిక ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

‘‘మన అభిరుచిని ఎందుకు వదులుకోకూడదో గుర్తు చేసే ఒక క్షణం ప్రతి ప్రయాణంలోనూ ఉంటుంది. ఈ రోజు నాకు అలాంటి క్షణమే. ‘ఆర్టికల్‌ 370’కి జాతీయ పురస్కారం అందుకోవడం నా జీవితాంతం గుర్తుంచుకొనే క్షణం, గౌరవం. పధ్నాలుగేళ్లుగా నేను నా వృత్తికి కట్టుబడి, నిజాయతీగా పని చేస్తున్నాను. నా నటననే మాట్లాడనిచ్చాను. ఆశయం, పట్టుదల, దృఢ సంకల్పం, సినిమాపై అచంచలమైన ప్రేమతో నిండిన నా ప్రయాణానికి ఈ గౌరవం పరాకాష్టలా అనిపిస్తోంది. ఇది నేను ఎన్నో ఏళ్లుగా నా హృదయంలో మోస్తున్న కల’’ అంటూ భావోద్వేగంగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన యామీకి ఇది కేవలం మరొక ప్రాజెక్ట్‌ మాత్రమే కాదు. వ్యక్తిగత అనుబంధం కూడా. ఈ చిత్రం ఆమె సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చింది.

‘‘నేను బలంగా నమ్మిన కథ ఇది. ఆ కథను అంతే నమ్మకంగా, నిజాయతీగా చెప్పాలనే నిబద్ధతతో సెట్‌లో ప్రతి రోజూ, ప్రతి సంభాషణ ముందుకు సాగింది. ప్రేక్షకులు చూపిన ప్రేమ... అర్థవంతమైన కథలు ఎల్లప్పుడూ ప్రజల హృదయాలను చేరుకొంటాయనే విషయాన్ని మరోసారి ధ్రువీకరించింది. అన్ని వేళలా అండగా నిలిచిన నా కుటుంబానికి కృతజ్ఞతలు. గమ్యం సుదూరం అనిపించిన ప్రతి క్షణంలోనూ వారి విశ్వాసం, ప్రోత్సాహం ముందుకు వెళ్లడానికి అవసరమైన శక్తినిచ్చాయి. ఈ పురస్కారం ఒక కలకు ముగింపు కాదు. ఒక గొప్ప బాధ్యతకు ఆరంభం... నిరంతరం ఎదుగుతూ, సాహసాలు చేస్తూ, ప్రాముఖ్యత గల కథలను చెబుతూ ఉండటానికి’’ అని పేర్కొంది.


వైవిధ్యమే ఊపిరి...

హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలా్‌సపూర్‌లో పుట్టిన యామి... చండీగఢ్‌లో పెరిగింది. ఆమె తండ్రి ముఖేష్‌ గౌతమ్‌ పంజాబీ చిత్ర దర్శకుడు. పీటీసీ నెట్‌వర్క్‌ ముఖ్య సలహాదారుడు. తల్లి అంజలి. యామి చెల్లి సురిలీ గౌతమ్‌ కూడా నటి. ‘పవర్‌ కట్‌’తో తెరకు పరిచయమైంది. తమ్ముడు ఓజస్‌. నాన్న చిత్ర పరిశ్రమలో ఉన్నా... ఆ ప్రపంచానికి దూరంగా, క్రమశిక్షణతో పెరిగింది యామి. చిన్నప్పటి నుంచి చదువుపై శ్రద్ధ పెట్టింది. ఐఏఎస్‌ కావాలన్నది ఆమె కోరిక. పన్నెండో తరగతి తరువాత ఎల్‌ఎల్‌బీలో చేరింది. అయితే ఇరవయ్యేళ్లప్పుడు తన రూటు మార్చుకుంది. నటి కావాలని నిర్ణయించుకుంది. 2010లో కన్నడ చిత్రం ‘ఉల్లాస ఉత్సాహ’ ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె... అంతకుముందు మోడలింగ్‌ చేసింది. టీవీ సీరియల్స్‌, షోస్‌లో పాల్గొంది. ఆ మరుసటి ఏడాది తెలుగులో వచ్చిన రవిబాబు ‘నువ్విలా’లో నటించింది. ‘విక్కీ డోనర్‌’తో 2012లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన యామి... తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అ్కడి నుంచి వరుస ప్రాజెక్ట్‌లతో, కథాబలం, వైవిధ్యం గల పాత్రలను ఎంచుకొంటూ అంచెలంచెలుగా ఎదిగింది. ‘కాబిల్‌, ఉడి- ది సర్జికల్‌ స్ట్రయిక్‌, బాలా, ఎ థర్స్‌ డే, దస్వీ’ తదితర చిత్రాలతో తనేంటో నిరూపించుకుంది. ఆ మధ్య కోర్ట్‌ రూమ్‌ డ్రామా ‘హక్‌’లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దానికిముందు రొమాంటిక్‌ యాక్షన్‌ కామెడీ సినిమా ‘ధూమ్‌ధామ్‌’లో కనిపించింది.

పునరావిష్కరించుకొంటూ...

‘‘నేను ఒక కథను ఎంచుకొనేటప్పుడు అది ఎంత భిన్నంగా ఉందో గమనిస్తాను. ఒక కళాకారిణిగా, ఒక ప్రేక్షకురాలిగా ఆ కథ నన్ను ఉత్తేజపరచాలి. నన్ను నేను పునరావిష్కరించుకొంటూ, మూస ధోరణులను భిన్నంగా సాగిపోవడమే నా లక్ష్యం. ‘విక్కీ డోనర్‌’ స్ర్కిప్ట్‌ చదివినప్పుడు అది నాకు ఏమాత్రం నిషిద్ధంగా అనిపించలేదు. ఈ రోజు ఆ సినిమాను ఎలా చూస్తున్నానో, అప్పుడు కూడా దాదాపు అలానే చూశాను. అంటే ఉన్నది ఉన్నట్టుగా కథతో మమేకం కావడానికి ప్రయత్నించడం. సంచలనాల కోసం కాకుండా సరైన ఉద్దేశం, భావప్రకటనలతో కూడిన చిత్రం అది’’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన యామి... క్రమశిక్షణ, అంకితభావం గల నటిగా పరిశ్రమలో ప్రశంసలు అందుకొంటుంది. అనేకసార్లు స్ర్కిప్ట్‌ను చదువుతుంది. రిహార్సల్స్‌ చేస్తుంది. ఆ తరువాతనే సెట్‌కు వెళుతుంది. ‘ఆర్టికల్‌ 370’లో జూనీ హక్సర్‌ పాత్ర కోసం ఫిట్‌నెస్‌ కోచ్‌ వద్ద నాలుగు నెలల శిక్షణ తీసుకుంది. ‘హక్‌’లో తన భర్త ట్రిపుల్‌ తలాక్‌ ఇచ్చి వదిలేసిన తరువాత, తన హక్కుల కోసం ఎంతకైనా తెగించే ధైర్యవంతురాలైన షాజియా బానో పాత్ర పోషించింది. ఆ పాత్ర సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం అర్థం చేసుకోవడానికి నాలుగు నెలలపాటు ఖురాన్‌ అధ్యయనం చేసిందని చిత్ర దర్శకుడు చెప్పడం, పని పట్ల ఆమెకున్న అంకితభావానికి అద్దం పడుతుంది.


‘‘నేను ఒప్పుకున్న పనిని ప్రేమిస్తానా లేదా అనేదే ఆలోచిస్తాను. వాస్తవానికి మీ అభిరుచికి తగినట్టు ఫలితం ఉండాలని మీరు కోరుకొంటారు. కానీ అది నా చేతుల్లో లేదని తెలుసు. నేను ఒప్పుకున్న ఏ పనినైనా సంతోషంగా చేయడం, దాన్ని ఆసాంతం ఆస్వాదించడం మాత్రమే నా అదుపులో ఉంటుంది.’’

‘దేనికోసమూ ఆరాటపడలేదు’

‘‘నా జీవితంలో నేను దేని కోసమూ ఆరాటపడలేదు. నా పని పట్ల నాకు ఎంతో ప్రేమ ఉంది. కానీ సహజంగానే ఈ ప్రయాణంలో మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, మనల్ని కుదిపేసే అనుభవాలు ఎదురవుతాయి. నా కుటుంబం ఇచ్చే మద్దతే నాకు సర్వస్వం. నా తల్లిదండ్రులు, నా సోదరి, సోదరుడు, ఇప్పుడు నా భర్త ఆదిత్య... వాళ్లవల్లే క్లిష్ట పరిస్థితుల్లో నిలదొక్కుకొనేందుకు మద్దతుగా నిలిచారు’’ అంటున్న యామి భర్త... ‘దురంధర్‌’ దర్శకుడు ఆదిత్య ధర్‌.

‘నిన్ను చూసి నీ కొడుకు గర్వపడతాడు’

యామి కొడుకు వేదవిద్‌కు ఇప్పుడు రెండేళ్లు. తన సమయమంతా కొడుకుతోనే గడపాలని ఆమె కోరుకొంటోంది. ‘‘వాడిని ఇంట్లో ఉంచి సెట్‌కు వెళ్లినప్పుడు నా హృదయంలోని ఒక భాగాన్ని అక్కడే వదిలినట్లు అనిపిస్తుంది. ఇంటికి, సెట్‌కు మధ్య బ్యాలెన్స్‌ చేసుకోవడానికి సరైన మార్గం అంటూ ఏదీ లేదు. ప్రాధాన్యతలను సర్దుబాటు చేసుకొంటూ, రోజుకో అడుగు ముందుకు వేయాలి. ప్రతి రోజూ ఒక కొత్త రోజే. దానికి తగినట్టుగానే నేను, ఆదిత్య ప్రణాళికలు వేసుకొంటాం. వేదవిద్‌ పుట్టిన కొద్ది రోజులకే ‘హక్‌’ చిత్రం షూటింగ్‌కు వెళ్లాను. ‘‘అప్పుడు మా అమ్మ సూపర్‌హీరోలా రంగంలోకి దిగింది. ‘నువ్వు ఈ స్థాయికి చేరుకోవడానికి జీవితాంతం కష్టపడ్డావు. ఒక రోజు నిన్ను చూసి నీ కొడుకు గర్వపడతాడు’ అని అమ్మ చెప్పింది. మా కుటుంబంలో అలాంటి మద్దతు వ్యవస్థ ఉండటం నా అదృష్టం.

‘‘అభిరుచిని వదులుకోనప్పుడు మాత్రమే కలలు నిజమవుతాయి. నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. ఇది కలలు కనాలని ఆశించేవారికి. అత్యంత ముఖ్యమైన విషయం... ఈ పరిశ్రమలో మీరు మీలాగే ఉండగలగడం. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం. సరైన అవకాశం వచ్చేవరకు సహనంతో, దృఢచిత్తంతో ఉండాలి. మీదైన ముద్ర వేయాలనుకున్నప్పుడు నిర్భయంగా కూడా ఉండాలి.’’

ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 05:57 AM