Share News

అతివలు అపోహలు వీడాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:42 AM

మహిళల్లో వెజైనల్‌ హెల్త్‌ గురించి కొన్ని అపోహలుంటాయి. అవగాహన లోపం వల్ల సహజసిద్ధ లక్షణాలను కూడా వ్యాధి లక్షణాలుగా భ్రమపడి బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఇలా జరగకుండా...

అతివలు అపోహలు వీడాలి

వెజైనల్‌ హెల్త్‌

మహిళల్లో వెజైనల్‌ హెల్త్‌ గురించి కొన్ని అపోహలుంటాయి. అవగాహన లోపం వల్ల సహజసిద్ధ లక్షణాలను కూడా వ్యాధి లక్షణాలుగా భ్రమపడి బెంబేలెత్తిపోతూ ఉంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే యోని ఆరోగ్యం, లక్షణాలు, పరిశుభ్రతల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

మహిళల పరిపూర్ణ ఆరోగ్యంలో వెజైనల్‌ హెల్త్‌ కీలక పాత్ర పోషిస్తుంది. శుభ్రత మొదలు వ్యాధుల నివారణ, పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యాల వరకూ... ఆరోగ్యకరమైన యోని, మహిళల ఆత్మవిశ్వాసం, జీవన నాణ్యతల మీద అద్భుతమైన ప్రభావాన్ని కనబరుస్తుంది. అయితే అనేక అపోహ/, అరకొర సమాచారాల ఫలితంగా కొందరు మహిళలు కొన్ని సమస్యాత్మక లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ, మౌనంగా బాధను భరిస్తూ ఉంటారు. బ్యాక్టీరియల్‌ వెజినోసిస్‌, ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు, అసాధారణ స్రావం, దురద మొదలైన సమస్యలు ప్రాణాంతకమైనవి కాకపోయినా ఇబ్బందినీ, అసౌకర్యాన్నీ కలిగిస్తాయి.

డూషింగ్‌ అనవసరం

యోనిని తరచూ డూషింత్‌తో శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి అలా చేయడం వల్ల ఆ ప్రదేశంలోని సహజసిద్ధ బ్యాక్టీరియా, పిహెచ్‌ మోతాదులు దెబ్బతింటాయి. దాంతో బ్యాక్టీరియల్‌ వెజినోసిస్‌, ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. వెజైనా తనను తాను శుభ్రం చేసుకునే అవయవం. కాబట్టి బయటి నుంచి అదనంగా డూషింగ్‌ లాంటి పరిశుభ్రత చర్యలు పాటించవలసిన అవసరం లేదు.

అన్ని స్రావాలూ ప్రమాదం కాదు

పారదర్శకంగా లేదా తెల్లగా ఉండే స్రావం ప్రమాదకరం కాదు. ఈ సహజసిద్ధ స్రావం సాంద్రత నెలసరి సమయంలో మారుతుంది. అయితే స్రావం రంగు, చిక్కదనం లేదా వాసనలో ఎలాంటి మార్పులొచ్చినా దాన్ని ఇన్‌ఫెక్షన్‌గా అనుమానించాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.


బిగుతుగా, దృఢంగా....

యోని సాగే గుణం కలిగిన కండరం. లైంగిక క్రీడ, ప్రసవ సమయాల్లో సాగి, తిరిగి పూర్వపు పరిమాణానికి చేరుకుంటుంది. అయితే వెజైనా బిగువు మహిళల్లో భిన్నంగా ఉంటుంది. దానికంటూ ప్రామాణికతలు లేవు. అలాగే వయసు, ప్రసవం, హార్మోన్లలో మార్పులు కూడా యోని బిగువును ప్రభావితం చేస్తాయి. ప్రసవం తదనంతర కెగెల్‌ వ్యాయామాలు కొంత మేరకు పూర్వపు బిగువు పొందడానికి తోడ్పడతాయి.

లోదుస్తులు ఇలా...

బిగుతుగా ఉండే లోదుస్తులతో తేమ, వేడి పెరిగి ఇన్‌ఫెక్షన్స్‌ పెరిగే అవకాశాలు ఎక్కువ. గాలి చొరబడని, చమట పీల్చుకోలేని లోదుస్తులతో బ్యాక్టీరియా లేదా ఈస్ట్‌కు మార్గం సుగమం అవుతుంది. కాబట్టి వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, సౌకర్యం కోసం కాటన్‌ లోదుస్తులను ఎంచుకోవాలి. ప్రత్యేకించి తేమ వాతావరణాల్లో నివసించేవారు కాటన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి.

ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 22 , 2026 | 04:42 AM