Share News

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

ABN , Publish Date - Sep 21 , 2026 | 02:46 PM

అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న చైనా తాజాగా మరో అద్భుతం చేసింది. రెండు రోజుల వ్యవధిలో నాలుగు రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది.

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
China Rocket launches

ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష రంగంలో చైనా మరోసారి తన సత్తా చాటింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో నాలుగు రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. వీటిల్లో ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రైవేటు సంస్థల రాకెట్ ప్రయోగాలు కూడా ఉండటం విశేషం. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు, భూపరిశీలన కోసం చైనా సంస్థలు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఈ ప్రయోగాలను మూడు వేర్వేరు వేదికల నుంచి దిగ్విజయంగా నిర్వహించాయి. అవసరాల మేరకు త్వరిత గతిన శాటిలైట్‌లను ప్రయోగించే సత్తా తమకు ఉందని చైనా మరోసారి నిరూపించింది.


సెప్టెంబర్ 15న జికువాన్ శాటిలైట్ లాంఛ్ సెంటర్‌లో తొలి ప్రయోగం విజయవంతమైంది. ప్రైవేటు సంస్థ లాండ్‌‌స్పేస్ అభివృద్ధి చేసిన జుక్యు-2ఈ రాకెట్ పది ఉపగ్రహాలను దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బాండ్ సేవల కోసం ఉద్దేశించిన కియాన్‌ఫాన్ నెట్‌వర్క్‌ కోసం ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ నెట్‌వర్క్‌లో భాగంగా మొత్తం 10 వేల బ్రాడ్‌బాండ్ శాటిలైట్‌లను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.


అదే రోజున ఓరియన్ స్పేస్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన గ్రావిటీ-1 రాకెట్‌తో మరో తొమ్మిది కియాన్‌ఫాన్ రాకెట్లను దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రపంచంలో ఘనరూప ఇంధనాన్ని వినియోగించే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌గా గ్రావిటీ-1కు పేరుంది. సముద్రంలోని నౌక నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించడం గమనార్హం.


ఇక చైనా ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన మార్చ్-12 రాకెట్‌తో మూడో ప్రయోగాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శాట్‌నెట్ బ్రాడ్‌బాండ్ సేవల కోసం మొత్తం 9 శాటిలైట్లను దిగువభూక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 13 వేల శాటిలైట్‌లతో ఈ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను నిర్మించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది.


ప్రభుత్వ అనుబంధ సంస్థ చైనా ఎయిరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలుగో ప్రయోగం నిర్వహించారు. భూపరిశీలన కోసం క్వాయ్‌జో-11 రాకెట్ ద్వారా రెండు శాటిలైట్‌లను విజయవంతంగా ప్రయోగించారు.

ఈ శాటిలైట్ ప్రయోగాల్లో పునర్వియోగ రాకెట్లను వినియోగించనప్పటికీ చైనా ఈ దిశగా కూడా కీలక పురోగతి సాధిస్తోంది. లాండ్‌స్పేస్ సంస్థకు చెందిన జూక్యూ-3, సీఏఎస్‌సీ సంస్థకు చెందిన లాంగ్‌మార్చ్ 10బీ పునర్వియోగ రాకెట్లు ఇటీవల జరిగిన తొలి దశ పరీక్షల్లో లక్ష్యాన్ని చేరుకుని మళ్లీ భూమ్మీద ల్యాండయ్యాయి.


ఈ వార్తలనూ చదవండి:

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. ముగ్గురి మృతి

Updated Date - Sep 21 , 2026 | 03:23 PM