Share News

మహిళలకూ టెస్టొస్టిరాన్‌?

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:12 AM

మహిళల ఎముకల దారుఢ్యానికి ఈస్ట్రోజన్‌ ఒక్కటే సరిపోదు. దానికి టెస్టొస్టిరాన్‌ కూడా తోడవ్వాలి. ఎందుకో తెలుసుకుందాం!

మహిళలకూ టెస్టొస్టిరాన్‌?

ఔరా!

మహిళల ఎముకల దారుఢ్యానికి ఈస్ట్రోజన్‌ ఒక్కటే సరిపోదు. దానికి టెస్టొస్టిరాన్‌ కూడా తోడవ్వాలి. ఎందుకో తెలుసుకుందాం!

మెనోపాజ్‌ తర్వాత క్షీణించే ఈస్ట్రోజన్‌ ఫలితంగా ఎముకలు బలహీనపడుతూ ఉంటాయి. కాబట్టే ఈ వయసు మహిళలకు హార్మోన్‌ థెరపీ అవసరమవుతూ ఉంటుంది. అయితే కెక్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆఫ్‌ యుఎ్‌ససికి చెందిన పరిశోధకులు 51 మంది మెనోపాజ్‌ మహిళలను నాలుగేళ్ల పాటు గమనించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనిపెట్టారు. ఈ మహిళలకు మొదట మూడున్నరేళ్ల పాటు ఈస్ట్రోజన్‌ అందించి, ఆ తర్వాత ఈస్ట్రోజన్‌తో పాటు టెస్టోస్టిరాన్‌ను కూడా అందించి బోన్‌ డెన్సిటీ స్కాన్స్‌ చేపట్టారు. ఈ పరీక్షల్లో కేవలం ఈస్ట్రోజన్‌ తీసుకున్నప్పటి ఎముకల సాంద్రత, ఈస్ట్రోజన్‌తో పాటు టెస్టొస్టిరాన్‌ కలిపి తీసుకున్నప్పటి ఎముకల సాంద్రత కంటే తక్కువగా ఉన్నట్టు కనిపెట్టారు. మరీ ముఖ్యంగా వెన్ను చివరి భాగంలోని ఎముక సాంద్రత పెరిగినట్టు కూడా పరిశోధకులు గమనించారు. నిజానికి మహిళల్లో సహజసిద్ధంగానే టెస్టొస్టిరాన్‌ కూడా తయారవుతూ ఉంటుంది. ఈ రెండు హార్మోన్ల మిశ్రమం వల్లే వెన్ను లోపలి స్పాంజ్‌ను పోలిన ఎముక రూపొందుతూ ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే టెస్టొస్టిరాన్‌తో ఎముకల దారుఢ్యాన్ని పెంచుకోవచ్చా? అన్నది నిర్థారించడం కోసం మరిన్ని పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంది. కాబట్టి మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు ఎముకల ఆరోగ్యం కోసం వైద్యుల సూచనలు సలహాల మీద ఆధారపడవలసి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 01:13 AM