స్త్రీల ఆరోగ్యంలో సరికొత్త విప్లవం
ABN , Publish Date - Aug 17 , 2026 | 03:12 AM
ఆధునిక సమాజంలో మహిళలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం, వ్యాపారం, మరోవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ... ఇలా ప్రతి దశలోనూ...
ఆధునిక సమాజంలో మహిళలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం, వ్యాపారం, మరోవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ... ఇలా ప్రతి దశలోనూ నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో అందరి సంక్షేమాన్ని పర్యవేక్షించే మహిళలు తరచుగా విస్మరించేది తమ సొంత ఆరోగ్యాన్నే. అయితే ఇటీవలి కాలంలో మహిళలు తమ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ వారి జీవనశైలిలో ఒక సానుకూల మార్పుకు శ్రీకారం చుట్టింది.
సూపర్ విమెన్ సిండ్రోమ్
ఇంట్లోనూ, బయట అన్ని పనులూ తామే పరిపూర్ణంగా చేయాలనే ఆరాటమే సూపర్ విమెన్ సిండ్రోమ్. ఈ ఒత్తిడి వల్ల మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, అధిక రక్తపోటు, తీవ్రమైన మానసిక ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
‘మీ టైం’ అవసరం
రోజంతా కుటుంబం కోసం కేటాయించే సమయంలో కనీసం అరగంట లేదా ఒక గంట సమయాన్ని కేవలం తమ సొంత సంతోషం, ఆరోగ్యం కోసం కేటాయించడమే ‘మీ టైమ్’. ఇది స్వార్థం ఎంతమాత్రమూ కాదు, అది ఒక అత్యవసర స్వయం సంరక్షణ. ఈ సమయంలో ఫోన్లు, బాధ్యతలకు దూరంగా ఉంటూ నచ్చిన పుస్తకం చదవడం, సంగీతం వినడం, లేదా ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మెదడులో ‘ఎండార్ఫిన్లు’ వంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలై ఒత్తిడి తక్షణమే తగ్గుతుంది.
శారీరక దృఢత్వం
ముప్పై ఏళ్లు దాటిన ప్రతి మహిళ తమ ఎముకల ఆరోగ్యం, రక్తం సరిపడా ఉందో? లేదో? తరచుగా పరీక్షించుకోవాలి. క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, విటమిన్-డి ఉన్న ఆహారాన్ని దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోవడం అత్యంత ముఖ్యం. కేవలం బరువు తగ్గడం కోసం కాకుండా, శరీర బలాన్ని పెంచుకోవడానికి యోగా, జుంబా డాన్స్, వాకింగ్ లేదా తేలికపాటి వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. ఒక మహిళ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం కూడా సంతోషంగా ఉండగలదు. కాబట్టి, కుటుంబ బాధ్యతలతో పాటు తమ సొంత ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, ‘నో’ చెప్పడం నేర్చుకోవడం, తమ ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడమే మహిళల సంపూర్ణ వికాసానికి నిజమైన మార్గం.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు