నైవేద్యాలలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు వాడరు?
ABN , Publish Date - May 01 , 2026 | 05:10 AM
నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయల వినియోగం దైవ నివేదనల్లో, ప్రసాదాల్లో కనిపించదు. అలాగే పూర్వకాలం నుంచి కొన్ని వర్గాలవారికి వాటిని తమ ఆహారంలో వాటిని...
ధర్మ సందేహం
నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయల వినియోగం దైవ నివేదనల్లో, ప్రసాదాల్లో కనిపించదు. అలాగే పూర్వకాలం నుంచి కొన్ని వర్గాలవారికి వాటిని తమ ఆహారంలో వాటిని వినియోగించకపోవం ఆచారంగా వస్తోంది. ఆధ్యాత్మిక సాధనకు, ప్రశాంత జీవనానికి సాత్వికాహారం ప్రధానమని సాధకులు చెబుతారు. నీరుల్లిని, వెల్లుల్లిని తామ, రజో గుణాలను పెంచే పదార్థాలుగా పూర్వులు పేర్కొన్నారు. అవి కోపాన్ని, ఆందోళనను, వాంఛలను పెంచుతాయి కాబట్టి యోగ సాధనకు ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు.
‘లశునం గృంజనం చైవ పలాండుం కవకాని చ/ అభక్ష్యాణి ద్విజాతీనాం అమేధ్య ప్రభవాణి చ’ అని మనుస్మృతి చెబుతోంది. ‘‘లశునం (వెల్లుల్లి), గృంజనం (ముల్లంగి), పలాండుం (ఉల్లిపాయ), కవకాని (పుట్టగొడుగులు)... ఇవి అశుద్ధమైన చోట పుడతాయి కాబట్టి ఉపాసకులు, శ్రీవిద్యాసాధకులు వాటిని తినకూడదు’’ అని భావం.
ఆధ్యాత్మిక పరంగా: ఆత్మశుద్ధి, సాత్విక జీవన శైలి కోసం ఉల్లిని, వెల్లుల్లిని నిషిద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సును చంచలం చేస్తాయని చెబుతారు.
ఆయుర్వేదం, యోగ శాస్త్రం ప్రకారం: ఉల్లిపాయలు తామస, రజోగుణ ప్రేరేపకమైన పదార్థాలు, అవి శరీరంలో పైత్యరసాన్ని పెంచుతాయి. ఆవేశాన్ని, వాంఛలను రేకెత్తిస్తాయి.
పౌరాణికంగా చూస్తే: రాహు, కేతువుల రక్త బిందువుల నుంచి ఉల్లి, వెల్లుల్లి పుట్టాయంటారు. అందుకే వాటిని అశుద్ధమైనవిగా, రాక్షస ప్రవృత్తి కలిగించేవిగా భావిస్తారు.
దైవ నివేదన విషయానికి వస్తే: పూజలలో, దేవునికి సమర్పించే నైవేద్యంలో ఉల్లి, వెల్లుల్లిని అపవిత్రంగా భావించి వినియోగించరు. కాలక్రమేణా మారుతున్న అలవాట్ల వల్ల... పూర్వం వీటిని ఉపయోగించని వర్గాలు కూడా స్వీకరిస్తున్నప్పటికీ... సంప్రదాయ ఆచారాలు పాటించేవారు ఇప్పటికీ దూరంగానే ఉంటారు. అయితే... పూజల్లో వినియోగం, సాధకుల నియమాలను పక్కన పెడితే.... నిత్య ఆహార పదార్థాల్లో వీటిని వాడే విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు