పుడమి పచ్చగా... పరిశుభ్రంగా ఉండాలని..!
ABN , Publish Date - Apr 06 , 2026 | 03:04 AM
‘‘భూమాతను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వ్యర్థాలను వేరు చేయడం ద్వారా ఆ దిశగా తమ ప్రయత్నాన్ని ప్రారంభించాలి’’...
సంకల్పం
‘‘భూమాతను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వ్యర్థాలను వేరు చేయడం ద్వారా ఆ దిశగా తమ ప్రయత్నాన్ని ప్రారంభించాలి’’... ఇది డాక్టర్ వనితా ప్రసాద్ పిలుపు. భారీఎత్తున చెత్త పేరుకుపోయి దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యకు చక్కని పరిష్కారం చూపారు ఆమె. శాస్త్రవేత్తగా, సామాజిక కార్యకర్తగా, పారిశ్రామికవేత్తగా తనవంతు ప్రయత్నం చేస్తున్న ‘వేస్ట్ వారియర్ ఆఫ్ ఇండియా’ వనిత... వ్యర్థంపై చేస్తున్న యుద్ధం ఇది.
‘‘శాస్త్రవేత్తను కావాలనో, పారిశ్రామికవేత్తగా ఎదగాలనో ఎప్పుడూ కోరుకోలేదు. అయితే చిన్నప్పటి ఒక ఘటన అనుకోకుండా నన్ను విభిన్నంగా ఆలోచించేలా చేసింది. నాకు ఆరోగ్య సమస్య వస్తే సీటీ స్కాన్ తీయించారు. ‘మనిషి శరీరం గురించి ఒక యంత్రం వైద్యుడికి ఎలా చెప్పగులుగుతుంది’ అనేది అప్పుడు నా మదిలో మెదిలిన మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆ ఉత్సుకతతో మానవ శరీరం వెనుకనున్న శాస్త్రీయ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. దాని కోసం మెడిసిన్ చదవాలని అనుకున్నాను. నా దురదృష్టమో, అదృష్టమో కానీ సీటు రాలేదు. దాంతో తరువాత డిగ్రీలో బయోకెమిస్ర్టీని ఎంచుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బయోటెక్నాలజీలో పీజీ చేశాను.
అలా రూటు మారింది...
పీజీ చదివే రోజుల్లో నాకు ఒక విషయం అర్థమైంది. అధిక శాతంమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు అపరిశుభ్రమైన పరిసరాల్లో జీవించడంవల్లనే తలెత్తుతున్నాయని. దీనిపై లోతైన అధ్యయనం చేయాలన్న ఉద్దేశంతో పీహెచ్‌డీలో నా సబ్జెక్ట్‌ను మెడికల్ బయోటెక్నాలజీ నుంచి ఎన్విరాన్‌మెంటల్ బయోటెక్నాలజీకి మార్చుకున్నాను. తరువాత ఒక కంపెనీ ల్యాబ్‌లో ఉద్యోగం వచ్చింది. అందులో పని చేస్తున్నప్పుడు బోధపడింది ఏంటంటే... ప్రయోగశాలలో జరుగుతున్నది క్షేత్ర స్థాయికి చేరడంలేదని.
పారిశ్రామికవేత్తగా...
ఒక శాస్త్రవేత్తగా పర్యావరణ జీవ సాంకేతికత నుంచి వ్యర్థాల నిర్వహణ వైపు మారడం సహజంగా జరిగిపోయింది. కానీ ఎన్నో ప్రయోగాలు ప్రయోగశాల దాటకపోవడం నన్ను కలవరపెట్టింది. ఒక శాస్త్రవేత్త పారిశ్రామికవేత్త అయితే పరిస్థితుల్లో మార్పు తేవచ్చని భావించాను. అందుకే ఒక కంపెనీ పెట్టాలని అనుకున్నాను. అలా 2017లో మా స్వరాష్ట్రం గుజరాత్‌లోని వడోదరాలో ‘రెవీ ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నెలకొల్పాను.
సవాళ్లను అధిగమించి...
కంపెనీ ప్రారంభించడమంటే అంత సులువు కాదు. మంచి ఉద్యోగం వదిలేయడం, నిధులు సమకూర్చుకోవడం, అనుమతులు తెచ్చుకోవడం... ప్రతిదీ ఒక సవాలే. నా నిర్ణయానికి విలువనిచ్చి మావారు రజనీష్ ప్రసాద్ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇద్దరం కలిసి ఈ కంపెనీ నెలకొల్పాం. దీని ప్రధాన ఉద్దేశం... మురుగు నీటిని శుద్ధి చేసి, ఎరువు, బయోగ్యా్‌సగా మార్చడం. ఒక్క మురుగునీరు మాత్రమే కాదు... సేంద్రియ, మద్యం తయారీ కేంద్రాలు, చక్కెర, ఆహారశుద్ధి వంటి పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను కూడా శుద్ధి చేసి ఉపయోగిస్తున్నాం. దీని కోసం వ్యర్థాలను శుద్ధి చేసే ‘డిజైనర్ బయో కల్చర్’ను అభివృద్ధి చేస్తాం.
సరైన నిర్వహణ లేకపోవడమే...
సమాజంలో చాలా సమస్యలకు కారణం సరైన వ్యర్థాల నిర్వహణ లేకపోవడం. నీరు కలుషితం కావడం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే... ఉన్నది ఒక్కటే జీవితం. దాన్ని అర్థవంతమైనదిగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. ఏదైనా చేయాలని బలంగా సంకల్పించుకొంటే కచ్చితంగా అది సాధించి తీరుతారు. ఇది నేను నమ్మి, ఆచరించిన సిద్ధాంతం. ఒక నివేదిక ప్రకారం సింగపూర్ దేశం చుక్క మురుగునీటిని కూడా వృథా పోనివ్వదు. మన దేశంలో కూడా అలా చేయగలం. ఇక్కడ కేవలం ముప్ఫై శాతం మురుగునీరు మాత్రమే శుద్ధి జరుగుతోంది. అందుకు భారీ ఖర్చు అవుతోంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే... శుద్ధిని తక్కువ ఖర్చులో చేయగలగాలి. అప్పుడే ఈ ప్రాజెక్ట్‌లు ముందుకు సాగుతాయి. మా సాంకేతికను ఎలాంటి సేంద్రియ వ్యర్థాలలోనైనా ఉపయోగించవచ్చు. దీని నుంచి బయోగ్యాస్ తీయవచ్చు. ఇప్పటివరకు మేము లక్ష లీటర్ల మురుగునీటిని, ఐదు లక్షల టన్నుల సేంద్రియ వ్యర్థాలను శుద్ధి చేసి, పునర్వినియోగిస్తున్నాం. నా కృషికి పలు అవార్డులు, ప్రశంసలు దక్కాయి. ‘వేస్ట్ వారియర్ ఆఫ్ ఇండియా’గా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీని అర్థం నా ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చిందని. సమాజంలో కొంతైనా మార్పు తేగలిగానని. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.’’
మనకూ బాధ్యత ఉంది...
గత పదేళ్లుగా తడి, పొడి చెత్తను వేరు చేయమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మనలో ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? మనందరం వ్యర్థాల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పుడమితల్లి తనంతట తానే పరిశుభ్రంగా, పచ్చగా మారుతుంది. మా లక్ష్యం అదే. తక్కువ ఖర్చుతో వ్యర్థాలు, మురుగునీటిని శుద్ధి చేసే సాంకేతికతను అభివృద్ధి చేయడం. నా దృష్టిలో వ్యర్థం అంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న సాంకేతికతో ఏ వ్యర్థం నుంచైనా అర్థవంతమైన ఉత్పత్తులు సాధించగలం. పరిశోధనలు, వాటి పరిష్కారాలను ప్రయోగశాలలకే పరిమితం కాకూడదు. అవి సమాజానికి చేరనంతవరకు వాటికి విలువ ఉండదు.’’
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు