Share News

బి12 లోపం ఇలా దూరం

ABN , Publish Date - May 26 , 2026 | 03:35 AM

విటమిన్‌ బి12 లోపం శాకాహారులతో పాటు మాంసాహారుల్లో కూడా పెరుగుతోంది. సరిపడా విటమిన్‌ బి12 తీసుకోకపోవడం, తీసుకున్న ఈ పోషకాన్ని శరీరం సజావుగా శోషించుకోలేకపోవడం...

బి12 లోపం ఇలా దూరం

పోషక లోపం

విటమిన్‌ బి12 లోపం శాకాహారులతో పాటు మాంసాహారుల్లో కూడా పెరుగుతోంది. సరిపడా విటమిన్‌ బి12 తీసుకోకపోవడం, తీసుకున్న ఈ పోషకాన్ని శరీరం సజావుగా శోషించుకోలేకపోవడం.. ఇలా ఈ పోషక లోపానికి పలు కారణాలుంటాయి. కాబట్టి లక్షణాలు, రుగ్మతలు, పరీక్షల ఆధారంగా ఈ లోపాన్ని కనిపెట్టి, సరిదిద్దుకోవాలంటున్నారు వైద్యులు

బి12 విటమిన్‌ లోపాన్ని వైద్య పరిభాషలో ‘మెగలోబ్లాస్టిక్‌ అనీమియా’గా పేర్కొంటారు. హిమోగ్లోబిన్‌ సరిపడా ఉన్నప్పటికీ విటమిన్‌ బి12 లోపం ఉండొచ్చు. నాడీ కణాల పైపొరలైన మైలీన్‌ షీత్స్‌ తయారీకి బి12 అవసరం. కాబట్టి ఈ లోపం తలెత్తినప్పుడు నాడీ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. కాళ్లు చేతులకు సంబంధించిన పెరిఫెరల్‌ నాడులతో పాటు, వెన్నుపాము, మెదడు ప్రధానంగా బి12 లోపం ప్రభావానికి లోనవుతాయి.

పెరిఫెరల్‌: ఈ నాడులు బలహీనపడినప్పుడు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నొప్పులు వేధిస్తాయి

స్పైనల్‌: నడక పట్టు తప్పుతుంది

మెదడు: జ్ఞాపకశక్తి తగ్గుతుంది

గుండెపోటు ముప్పు

మన శరీరం ప్రొటీన్‌ను విచ్ఛిన్నం చేసినప్పుడు, రక్తంలో హోమోసిస్టిన్‌ అనే సాధారణ అమీనో ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఆమ్లం మోతాదులు అవసరానికి మించి పెరిగినప్పుడు, ‘హైర్‌హోమోసిస్టినీమియా’ అనే పరిస్థితి తలెత్తుతుంది. దాంతో రక్తం గడ్డకట్టే అవకాశం పెరుగుతుంది. విటమిన్‌ బి12 తగ్గడం మూలంగా హోమోసిస్టిన్‌ మోతాదులు పెరిగి, రక్తం చిక్కబడి గుండెపోటు ముప్పు పెరుగుతుంది. కాబట్టి ధూమపానం మాదిరిగా, గుండెపోటుకు దారితీసే కారకాల్లో విటమిన్‌ బి12ను ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఈ విటమిన్‌ లోపాన్ని సరిదిద్దవలసి ఉంటుంది.


పిల్లల్లో మతిమరుపు

విటమిన్‌ సంబంధిత డిమెన్షియాను వైద్య పరిభాషలో ‘సూడో డిమెన్షియా’ అని కూడా అంటారు. డిమెన్షియా అంటే పైబడే వయసుతో తలెత్తే మతిమరుపు. కానీ బి12 లోపంతో వయసుతో సంబంధం లేకుండా, ఎప్పుడైన మతిమరుపు వేధించవచ్చు. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా బడికెళ్లే పిల్లలు పాఠాలను గుర్తుపెట్టుకోలేకపోతున్నట్టు చెప్తూ ఉంటారు. ఇది విన్న తల్లితండ్రులు, ఏకాగ్రతగా పాఠాలు వినడం లేదు కాబట్టే పిల్లలు వాటిని గుర్తుపెట్టుకోలేకపోతున్నట్టు భావించి, దండిస్తూ ఉంటారు. కానీ పిల్లలు ఇలా పదే పదే చెప్తున్నప్పుడు వాళ్ల మాటలను ఆలకించి, బి12 లోపం మీద దృష్టి పెట్టాలి. అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించి, సప్లిమెంట్లతో, ఆహారంతో ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలి.

శోషణ కీలకం

విటమిన్‌ బి12 పేగుల ద్వారా శోషణ చెందుతుంది. కాబట్టి ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌, పొట్టలో పుండ్లు ఉన్న వాళ్లలో ఈ విటమిన్‌ శోషణ సక్రమంగా జరగక లోపం తలెత్తుతూ ఉంటుంది. బేరియాట్రిక్‌ సర్జరీ మొదలైన చిన్నపేగు, జీర్ణకోశ సంబంధిత సర్జరీలు చేయించుకున్న వారిలో కూడా విటమిన్‌ బి12 లోపం కనిపిస్తుంది. మెట్‌ఫార్మిన్‌ మొదలైన మధుమేహ మందుల వల్ల కూడా విటమిన్‌ బి12 లోపం తలెత్తవచ్చు. మాంసాహారుల్లో బి12 లోపానికి ప్రధాన కారణం శోషణ లోపమే!


చికిత్సతో భర్తీ

తీవ్రమైన బి12 లోపానికి గురైనప్పుడు రక్త మార్పిడితో, మధ్యస్థంగా ఉన్న లోపాన్ని ఇంజెక్షన్లు, నోటి మాత్రలతో భర్తీ చేసుకోవచ్చు. ఈ విటమిన్‌ లోపాన్ని గుర్తించడం కోసం ఏడాదికి రెండుసార్లు రక్తపరీక్ష చేయించుకోవలసిన అవసరం ఉంటుంది. నీరసం, నిస్సత్తువ వేధిస్తున్నా, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, నొప్పులు బాధిస్తున్నా, మతిమరుపు తలెత్తినా ఈ విటమిన్‌ మోతాదును పరీక్షించుకుని అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రతించాలి. కాలేయంలో నిల్వ ఉండే విటమిన్‌ బి12 పూర్తిగా అడుగంటిన ఏడాది తర్వాతే, ఈ విటమిన్‌ లోపం తాలూకు లక్షణాలు బయల్పడడం మొదలుపెడతాయి. కాబట్టి సప్లిమెంట్లు కూడా ఏడాది పాటు కొనసాగించాలి.

8-Navya.jpg

పోషకభరిత ఆహారంతో...

శాకాహారులు ప్రధానంగా పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, పన్నీర్‌, కాలేజ్‌ చీజ్‌, టోఫు, బాదం పాలు, సోయా పాలు, ఓట్‌ పాలు, పుట్టగొడుగులతో బి12 లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. అలాగే, మాంసాహారులు శోషణ సమస్యలు లేకుండా చూసుకుంటూ, గుడ్లు, మాంసం తింటూ ఉండాలి.

బి12 విటమిన్‌ లోపం దీర్ఘకాలంలో పలు రుగ్మతలకు దారి తీయొచ్చు. అవేంటంటే...

  • వినికిడి లోపం: బి12 లోపం దీర్ఘకాలంలో సెన్సరీన్యూరల్‌ హియరింగ్‌ లాస్‌కూ, చెవిలో శబ్దాలతో ముడిపడి ఉండే టిన్నిటస్‌ అనే సమస్యకూ దారి తీయొచ్చు

  • డిమెన్షియా: డిమెన్షియాను మరిపించే మతిమరుపుకు దారి తీయొచ్చు

  • పార్కిన్సన్స్‌: విటమిన్‌ బి12 లోపం పార్కిన్సన్స్‌ సమస్యను తీవ్రం చేయొచ్చు

డాక్టర్‌ శివరాజు

సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌,

హెచ్‌ఒడి మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌,

కిమ్స్‌ హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు

చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..

Updated Date - May 26 , 2026 | 03:35 AM