Share News

అభాగ్య మహిళలకు వెలుగు రేఖ

ABN , Publish Date - May 18 , 2026 | 05:16 AM

శ్రీకృష్ణుడి లీలాధామంగా ఖ్యాతి పొందిన బృందావనం ‘వితంతువుల నగరం’గానూ ప్రసిద్ధి చెందింది. భర్తలను కోల్పోయి, కుటుంబాల నిర్లక్ష్యానికి గురై... ఆధ్యాత్మికతలో శేష జీవితం...

అభాగ్య మహిళలకు వెలుగు రేఖ

శ్రీకృష్ణుడి లీలాధామంగా ఖ్యాతి పొందిన బృందావనం ‘వితంతువుల నగరం’గానూ ప్రసిద్ధి చెందింది. భర్తలను కోల్పోయి, కుటుంబాల నిర్లక్ష్యానికి గురై... ఆధ్యాత్మికతలో శేష జీవితం గడపడానికి ఆ క్షేత్రాన్ని గమ్యంగా ఎంచుకొని, దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఎందరో మహిళలకు వెలుగురేఖ... విన్నీసింగ్‌. ‘‘ఒకసారి ఎవరి బాధ్యతైనా తీసుకుంటే... చివరిదాకా దానికి కట్టుబడి ఉంటాను’’ అంటున్న విన్నీ ప్రయాణం ఇది.

‘‘పద్దెనిమిదేళ్ళ క్రితం... బృందావనానికి ఒక క్లబ్‌ తరఫున... దాని ఢిల్లీ విభాగం అధ్యక్షురాలుగా నేను, మరికొందరు సభ్యులు ఉత్సాహంగా బయలుదేరాం. అక్కడ ఉంటున్న పేద, వృద్ధ మహిళలకు రేషన్‌ కిట్లు పంచిపెట్టడం కోసం కొద్ది రోజుల ముందే మేము విరాళాలు సేకరించాం. 1,500 కిట్స్‌ తీసుకువెళ్ళాం. మేం అక్కడికి చేరుకొనేసరికి... రెండువేలమందికి పైగా మహిళలు ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. చాలామంది దీనస్థితిలో, అనారోగ్యంగా, చిరిగిన చీరలు, జాకెట్లతో కనిపించారు. అది చూసి నా గుండె తరుక్కుపోయింది. కిట్లు అందనివారి నిరాశ చూసి ఎంతో బాధ కలిగింది. శ్రీకృష్ణుడి లీలావిలాస గాథలకు నిలయం బృందావనం. ఇప్పుడది వితంతువులకు, కుటుంబాల నిరాదరణకు గురైన మహిళలకు నెలవుగా మారింది. ఎక్కడా దిక్కులేక బృందావనంలో తలదాచుకుంటూ, ఆధ్యాత్మికతను జీవిత పరమావధిగా ఎంచుకున్నవారు 20 వేలమందికి పైనే ఉన్నారు. అందుకే దానికి ‘వితంతువుల నగరం’ అనే పేరు వచ్చింది. అయినవారికి దూరమైన ఆ మహిళలను చూడగానే... ఒకప్పుడు నాకు జీవితంలో ఎదురైన చేదు అనుభవం గుర్తుకువచ్చింది.

  • శాశ్వత పరిష్కారం కోసం..

భూపేందర్‌ ఉద్యోగరీత్యా కొన్నాళ్ళపాటు షిల్లాంగ్‌లో ఉన్నాం. ఆ సమయంలో కుటుంబాలు వెలివేసిన హెచ్‌ఐవి రోగుల గురించి తెలిసింది. అది 2005. అప్పటికి ‘జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ’ ఈశాన్య రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రజల్లో హెచ్‌ఐవిపై అవగాహన పెంచడం కోసం... దేశంలో ఆ సమస్యపై రూపొందిన చిత్రాలను ఈశాన్య రాష్ట్రాల్లో ప్రదర్శించాను. రోడ్‌షోలు నిర్వహించాను. చిత్ర రూపకర్తలను, నటులను భాగస్వాములను చేశాను. దానికి మంచి స్పందన వచ్చింది. ఒక ఉద్యమంలా చేపట్టిన ఈ కార్యక్రమాలు అక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో... ‘మైత్రి’ అనే సంస్థను నేను, భూపేందర్‌ ఢిల్లీలో ఆరంభించాం. మహిళలపై సాగుతున్న గృహహింస, వేధింపులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాం. అలాగే పట్టణ ప్రాంతాల్లో పనికోసం వచ్చే వలస కార్మికులకు, వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచి, నిలదొక్కుకోవడానికి సాయపడ్డాం. 2005 నుంచి ఇప్పటివరకూ... ఆరోగ్యం, మానవ హక్కులు, న్యాయసహాయం, ఉపాధి కల్పన, గృహహింస, కుటుంబ, సామాజిక సమస్యల పరిష్కారం ఇలా వివిధ అంశాల్లో 45 వేల మందికి పైగా ‘మైత్రి’ సంస్థ సాయపడింది. ఈ క్రమంలోనే బృందావనంలోని మహిళల దుస్థితిని ప్రత్యక్షంగా గమనించాను. వారికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను.


  • గుర్తింపు.. గౌరవం

2008లో బృందావనంలో ఒక సర్వే నిర్వహించాం. అక్కడ నిస్సహాయంగా జీవిస్తున్న మహిళలతో మాట్లాడాం. వారికి గుర్తింపు అందించి, హుందాగా, గౌరవంగా జీవించడానికి కార్యాచరణ రూపొందించాం. మా కుటుంబం తరఫున మొదటి విడతగా వందమంది మహిళలను కనీసం అయిదేళ్ళపాటు ఆదుకోవడానికి నిధులు సమకూర్చాం. వారితో పాటు వీలైనంతమందికి రోజూ మూడు పూటలా పోషకాహారం అందించడం మాకు ఎదురైన మొదటి సమస్య. దానికోసం ‘అక్షయపాత్ర ఫౌండేషన్‌’ సాయం తీసుకున్నాం. ఒక పాడుబడిన ఆశ్రమ భవనాన్ని పునర్నిర్మించాం. దానిలో 280 మందికి వసతి కల్పించాం. ప్రస్తుతం దానితోపాటు మరో నాలుగు ఆశ్రమాల్లో ఇంకో 600 మందికి పైగా మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. దీనితోపాటు నివసించే సదుపాయం ఉన్నవారికి కూడా రోజూ పాలు, పండ్లు, భోజనం, ఆరోగ్య సంరక్షణ అందిస్తున్నాం. వారిలో నూరేళ్ళకు పైబడిన వారు కూడా ఉన్నారు. మహిళల నైపుణ్యాలకు అనుగుణంగా క్లాత్‌ బ్యాగుల తయారీ, బ్లాక్‌ ప్రింటింగ్‌, పచ్చళ్ళు, అప్పడాల తయారీ లాంటి వాటిలో శిక్షణ ఇచ్చి, వారికి ఆదాయం లభించేలా చేస్తున్నాం. ఆశ్రమాల్లోని మహిళలందరూ నన్ను తన కూతురిలా చూసుకుంటారు. మా అమ్మ తరువాత అంతటి ఆప్యాయత వారి నుంచే నాకు దక్కుతోంది’’

  • రోజూ వేధింపులే...

మాది దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ నుంచి ఢిల్లీ వచ్చి స్థిరపడిన పంజాబీ కుటుంబం. మా అమ్మ రోజూ సాయంత్రం తను చేసిన చపాతీల్లో కొన్ని, కూర, పప్పు పక్కన పెట్టేది. గురుద్వారాకు వాటిని పంపేది. అలాగే పేద పిల్లలకు అక్షరాలు, లెక్కలు నేర్పించేది. మన దగ్గర ఉన్నది ఆహారం కావచ్చు, డబ్బు కావచ్చు, విద్య కావచ్చు... దాన్ని అవసరమైనవారితో పంచుకోవడంలోని ఆనందం అమ్మ ద్వారానే నాకు తెలిసింది. చదువు పూర్తి చేసుకొని, పెళ్ళయిన తరువాత... జీవితానికి మరో కోణం నా అనుభవంలోకి వచ్చింది. భర్త వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. పిల్లలు పుట్టిన తరువాత కూడా అతడి ధోరణి ఏమాత్రం మారలేదు. చివరకు ఒక రోజు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ నేను నిస్సహాయురాలినని భావించలేదు. భర్త పెట్టిన బాధల నుంచి విముక్తి దొరికిందనుకున్నాను. పిల్లలతో పుట్టింటికి చేరుకున్నాను. క్రమంగా నా కాళ్ళమీద నిలబడగలిగాను. ఆ తరువాత... సైనికాధికారి మేజర్‌ భూపేందర్‌సింగ్‌ను వివాహం చేసుకొని కొత్త జీవితం ఆరంభించాను.

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 05:16 AM